సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో… సాగేటి ఆటలో
ఆవేశాలు ఋణపాశాలు తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
గుండెలే బండగా మారిపోయేటి స్వార్ధం
తల్లిని తాళిని డబ్బుతో తూచు బేరం
రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం
కంటికి మంటికి ఏక ధారైన శోకం
తలపై విధిగీత ఇలపైనే వెలసిందా
రాజులే బంట్లుగా మారు ఈ క్రీడలో
జీవులే పావులైపోవు ఈ ఖేళిలో
ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా..!!
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో
ఆవేశాలు ఋణపాశాలు తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
కాలిలో ముల్లుకి కంటనీరెట్టు కన్ను
కంటిలో నలుసుని కంట కనిపెట్టు చెయ్యి
రేఖలు గీతలు చూడదీరక్తబంధం
ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం
గడిలో ఇమిడేనా… మదిలోగల మమకారం
పుణ్యమే పాపమై… సాగు ఈ పోరులో
పాపకే పాలు కరువైన పట్టింపులో
ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
ప్రాణాలు తీసినా… పాశాలు తీరునా
అదుపూ లేదు ఆజ్ఞా లేదు మమకారాలలో
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
కౌగిలే కాపురం కాదులే పిచ్చితల్లి
మల్లెలా మంచమే మందిరం కాదు చెల్లి
తేనెతో దాహము తీర్చదేనాడు పెళ్లి
త్యాగమే ఊపిరై ఆడదయ్యేను తల్లి
కామానికి దాసోహం కారాదే సంసారం
కాచుకో భర్తనే కంటి పాపాయిగా
నేర్చుకో ప్రేమనే చంటిపాపాయిగా
మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక గుణపాఠం
ప్రేమే సంసారము ప్రేమే వేదాంతము
వయసూ కాదు వాంఛా కాదు మనసే జీవితం
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక గుణపాఠం
చుక్కలు జాబిలి చూసి నవ్వేది కావ్యం
నింగికే నిచ్చన వేసుకుంటుంది బాల్యం
తారపై కోరిక తప్పురా చిట్టి నేస్తం
రెక్కలే రానిదే ఎగరనేలేదు బ్రమరం
వినరా ఓ సుమతి పోరాదు ఉన్నమతి
పాత పాఠాలనే దిద్దుకో ముందుగా
నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా
నిను పెంచేది గెలిపించేది చదువే నాయనా
సంసారం ఒక చదరంగం… చెరిగిందా నీ చిరు స్వప్నం
ఈ గాలి వానలో నీ మేఘమాలలో
ఉరిమే మబ్బు మెరిసే బొమ్మ చెరిపే వేళలో
సంసారం ఒక చదరంగం… చెరిగిందా నీ చిరు స్వప్నం
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.