Menu Close

శ్రీకృష్ణ పరమాత్మడి చిట్టచివరి సందేశం తప్పకుండా చదవండి – Mahabharatam Stories in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Mahabharatam Stories in Telugu – శ్రీకృష్ణ పరమాత్మడి చిట్టచివరి సందేశం

Krishna-Hindu-God-Story-Birth-Festivals-temples

ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు.. శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.

ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము.

ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.

అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుత మయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు.

ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి సందేశం.

దీని తర్వాత యింక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.

“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.

కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.

ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.

krishna

కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించు కుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.

కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.

అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు.తద్వారా బ్రహ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు.ఆడంబరాలకు ప్రాధాన్యత నిస్తారు.

ఉపవాసములు తమ మనసును సంస్కరించు కోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.

ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.

మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.

ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించా డన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించా డన్నది ప్రధానం అవుతుంది.

krishna

ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.

కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.

కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.

కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ‘యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో’

కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో.ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి.శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా.

ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, యింద్రియ నిగ్రహము, చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.

ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం.. ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.

తప్పకుండా షేర్ చెయ్యండి..

Mahabharatam Stories in Telugu, Hindu Stories in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading