ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఆంధ్ర దేశానికి రాజు కాల నాథుడు. చిత్రకూట ప్రాంతానికి రాజు ప్రమథ నాథుడు. ఇద్దరికీ కళింగ రాజ్యంపై కన్నుపడింది. కళింగ దేశంలో ప్రవహించే నదీజలాలు ఉపయోగించుకొని తమ దేశాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని ఇద్దరి కోరిక. ఇద్దరూ కలిసి ఒప్పందానికి వచ్చి ఒకేసారి కళింగ దేశంపై దండెత్తారు.
కళింగరాజు బలవంతుడే కానీ ఇద్దరూ ఒకేసారి యుద్ధానికి వచ్చేసరికి నిలబడ లేక పోయాడు. కళింగ రాజు, రాజకుమారులు యుద్ధంలో మరణించారు. అతని రాణివాసం అంతా సహగమనం చేసింది. కళింగ రాజకుమార్తె ఏకాకినిగా మిగిలింది.
ఆంధ్ర రాజు కాలనాథుడూ, చిత్రకూట ప్రభువు ప్రమథనాథుడూ విజయోత్సవాలు చేసుకున్నారు. సంబరాలు ముగిశాక పంపకాలు మొదలయ్యాయి. కోశాగారం సమంగా పంచుకున్నారు. నదీజలాలను ఎంత ఎవరు వాడుకోవాలి అనే విషయంలో ఒప్పందానికి వచ్చారు. కళింగ రాజ్యంలో సామంతుని నియమించి ఇద్దరికీ సమానంగా కప్పం కట్టేలా నిర్ణయించారు.
కాలనాథుడు “పంపకాలు అన్నీ సమంగా జరిగాయి విజయుడైన రాజు ఓడిపోయిన రాజకుమార్తెను వివాహమాడటం రాజనీతి కాబట్టి _ _ _”అన్నాడు.
కాలనాథుని మాట పూర్తికాకుండానే ప్రమథనాథుడు “అవును రాజ్యమే కాదు రాజకుమార్తె కూడా వీర భోజ్యమే. ఆమెను నేను మనువాడుతాను”అన్నాడు.
కాలనాథుడు మీసం దువ్వి “నన్ను మించిన వీరుడు ఎవడు? ఆమె నాదే” అన్నాడు.
ప్రమథ నాథుడు “మాది చిత్రకూటం. పర్వత ప్రాంతం. శరీరాలు కఠినమైనవి. మీరు సున్నిత శరీరాల వారు. మా ముందు మీరు ఎంత?” అన్నాడు.
కళింగ యుద్ధంలో గెలవడానికి నేనంటే నేనే కారణం అని ఇద్దరూ అన్నారు. విజయానికి కారణమైనందుకు తమకే కళింగ రాకుమారి దక్కాలని ఇద్దరు గట్టిగా చెప్పారు. ఇద్దరిలో ఎవరు వీరులో తెలుసుకోవాలనుకున్నారు.
ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. కాలనాథ, ప్రమథనాథులు ఇద్దరూ వీరత్వంలో సమానులు. ఇద్దరూ ఒకేసారి రెండవ వారిని హతమార్చారు. ఇద్దరికీ వీరస్వర్గం లభించింది.
స్వర్గంలో కలుసుకున్న ఇద్దరూ అనవసరంగా ఒక స్త్రీ కోసం ప్రాణాలర్పించామే అని బాధ పడ్డారు. ఇకనైనా స్నేహంగా ఉందాం అని అనుకుంటూ ఉండగా ఒక అప్సరస కనిపించింది ఆమె ముందు కళింగ రాజకుమార్తె అందం ఏ మూలకి అనిపించింది. ఆమె మీదే మనసు అయింది.
భూమిపై ఆగిపోయిన యుద్ధం స్వర్గంలో మళ్ళీ మొదలైంది. స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పదు అన్నది స్త్రీలకు మాత్రమే కాదు సుమా.
Telugu Moral Stories, Pitta Kathalu, Telugu Kathalu, Interesting Telugu Stories