కామాఖ్యాదేవి – Kamakhya Devi Temple – Ashtadasa Sakthi Peetalu
మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అస్సాంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. అంటే, తలచినంతనే కోరుకున్న రూపంలోకి మారిపోవటం.
ఇక్కడి అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి.
పురాణ గాథ – Historical Story of Kamakhya Devi
సతీదేవి తండ్రి దక్షప్రజాపతి ఆమె భర్త పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించిన కూతురిని అవమానిస్తాడు. సహించలేని ఆమె యజ్ఞ గుండంలో దూకి అగ్నికి ఆహుతై పోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. విరాగిలా మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు.
ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీమహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు.
ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూలకారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
స్థల పురాణం – Kamakhya Devi Temple Location History
పూర్వం కూచ్ బెహర్ రాజా విశ్వసింహ్ ఒక యుద్ధంలో అయిన వాళ్లందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తాడు. దగ్గరలో కనిపించే మట్టిదిబ్బ ఏమిటని అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా అందులోని దేవత వుందని మహా శక్తి వంతురాలని ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. రాజు వెంటనే తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకోగానే వారంతా తిరిగి వస్తారు.
తన రాజ్యంలో కరవు శాంతిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అనుకున్నట్లుగానే రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అప్పుడు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్విస్తుండగా కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ తల్లిని అక్కడే కొలువుదీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు. పరమేశ్వరుడు కూడా నీలాచలానికి తూర్పు వైపు బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉమానంద భైరవునిగా దర్శనమిస్తాడు.
ఆలయ పురాణం – History of Kamakhya Devi Temple
కూచ్ బెహర్ రాజవంశానికి చెందిన చిలరాయ్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతకుముందే అక్కడ ఉన్న ఆలయాన్ని కాలపహార్ అనే అజ్ఞాత వ్యక్తి నాశనం చేయటంతో చిలయ్‌రాయ్ పునర్నిర్మించారు. తదనంతర కాలంలో చేసిన చిన్న తప్పిదానికి ప్రవేశాన్ని కోల్పోయిన ఆ వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపుల్లోకి కూడా ప్రవేశించరు. ఈ ఆలయ నిర్మాణం నాలుగు గదులుగా ఉంటుంది.
తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి మూడు, మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్ప కళాఖండాలతో, తేనెతుట్ట ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. మొదటి నుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలులు సర్వసాధారణం.
మరెక్కడా లేనివిధంగా ఇక్కడ మహిషాలను సైతం బలిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణ చేయకపోతే దర్శనఫలం దక్కదని భక్తుల నమ్మకం. సంధ్యావేళ దాటిన తరవాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడాఉంది. అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు.
ఉత్సవాలు – Kamakhya Devi Celebrations and Festivals
ఏటా వేసవిలో మూడురోజుల పాటు అంబుబాచీ పండుగ సందర్భంగా కామాఖ్యదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసేస్తారు. పూజారులు కూడా గుడిలోపలికి వెళ్లరు. నాలుగో రోజు లక్షలమంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపురంగులో ఉంటుంది.నవరాత్రి సమయంలో ఐదు రోజుల పాటు ఇక్కడ దుర్గా ఉత్సవాలతో పాటు భాద్రపదమాసంలో మానస పూజ నిర్వహిస్తారు. ఆ సమయంలో జంతుబలులు నిషేదం.
చేరుకునే మార్గాలు – How to Reach Kamakhya Devi Temple
దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి గౌహతికి విమాన సదుపాయం ఉంది. విమానాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కామాఖ్యదేవి ఆలయం ఉంది. గౌహతి రైల్వేస్టేషన్ నుంచి 6 కి.మీ దూరంలో ఉంది. గౌహతిలో ఎక్కడినుంచైనా ట్యాక్సీ, ఆటోరిక్షా ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అసోం పర్యాటక విభాగం ఆలయానికి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది.
- Kamakhya Devi Story in Telugu
- Kamakhya Devi Temple Secret
- Kamakhya Devi Temple History in Telugu
- Kamakhya Devi Festivals
- Kamakhya Devi Location
- Kamakhya Devi Address
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.