Menu Close

MANTRA Explanation in Telugu – మంత్ర శక్తి గురుంచి ఎన్నో ఆశక్తికర విషియాలు

MANTRA Explanation in Telugu

మనసును ప్రక్షాళనం చేసి, నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు.. మంత్రాలు. జన్మ గత వాసనలతో, మనలను కట్టి పడవేసి, అచేతన, సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది.

మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తాయి. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తాయి.

ఉదాహరణకు..
‘హుం’ కారం మనలోని భయాన్ని పారద్రోలుతుంది.
‘రం’ కారం మనకు శాంతిని కలుగచేస్తుంది.

మంత్రంలో ‘మ’కారం అంటే మననం,
మననం అంటే పదేపదే ఉచ్ఛరించడం.
‘త్రం’కారం అంటే త్రాణం,
త్రాణం అంటే రక్షించేదని అర్థం,

కాబట్టి ‘మంత్రం’అంటే ఏకాగ్రచిత్తంతో పదేపదే ఉచ్ఛరించే వానిని రక్షించేదని అర్థం.మననం చేయువానిని రక్షించేది మంత్రమని అర్థం. మంత్రం అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఒక బీజం (విత్తనం) పెద్దచెట్టు గా వృద్ధిచెందినట్లు, నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచించబడింది.

మంత్ర వివరణపై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి.

తన హృదయం నుండి అవగతమయ్యే శక్తే మంత్రమనీ, దేవతాధిష్టితమైన ఒకానొక అక్షర రచనా విశేషమే మంత్రమనీ, దేవతా స్వరూపమే మంత్రమనీ,
సాధనకు, కార్యసిద్ధికి, ప్రత్యేక ఫలితాలకు ప్రకృతి శాస్త్రాలను అనుసరించి వివిధ ప్రక్రియలలో అభ్యాసమూలమైన సిద్ధిత్వాన్ని కలిగించేదే మంత్రమనీ కొన్ని అక్షరాల ప్రత్యేక ఉచ్ఛారణే మంత్రమనీ, ఒక శబ్దాన్ని యాంత్రికంగా, పారవశ్యం కలిగేంతవరకు పురశ్చరణ చేయడమే మంత్రమని అంటారు.

ఈ జగత్తు అంతా దెైవానికి ఆధీనమై ఉంది. అటువంటి దెైవం మాత్రం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. కాబట్టి శబ్ధరూపంలో నున్న దెైవశక్తి స్వరూపమే మంత్రం, మంత్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆమంత్రం దేవతామూర్తి యొక్క శక్తి సాధకునిలో అణువణువు వ్యాపించి ఉంటుంది. అప్పటివరకు నిబిఢీకృతమై ఉన్న దెైవికశక్తులు సాధకునికి ఉపయోగపడి జ్ఞానోదయ మవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, మాలిన్యాలు తొలగి, మనస్సు నిశ్చలమై, సచ్చిదానంద స్థితిని పొందుతాడు.

అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి, శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమయిన రీతిలో జరిగే మంత్రోచ్ఛారణ వలన, మంత్రంలోనున్న బీజాక్షరాలలో స్పందన కలిగి, అత్యద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది. యోగసాధన సఫలీకృత మయ్యేందుకు యోగశక్తి ఎలా అవసరమో అదే విధంగా మంత్రసాధన ఫలించేందుకు విశేషమైన మానసిక ఏకాగ్రత అవసరం.

ఈ వాక్ శక్తీకరణ కలిగినప్పుడు, మనం కొన్ని సాధారణ శబ్దాలలో నిగూఢమైన అర్థాలను చూడగలం. అవి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సమస్తవిశ్వంతో సంభాషించే స్థితికి సాధకుని తీసుకెళ్తాయి. ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది.

మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచారరహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. పండుగ సమయాలో గ్రహణసమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.

మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా! వాటిని స్థానిక భాషలోకి తర్జుమా చేసుకొని దెైవాన్ని పూజించకూడదా? అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు సమాధానం ఒక్కటే. మంత్రం శబ్దప్రధానమైనది. ధ్వన్యాత్మక సృష్టిపదార్థం… సృష్టి కంటే ముందే పుట్టింది. ఇతర తత్త్వాలకంటే శబ్దతత్త్వం శక్తివంతమైనది. కాబట్టి మంత్రానికి ఆధారం శబ్దం అయింది.

సంస్కృత భాషలోని అక్షరాలలో శబ్దం, అర్థం రెండూ ఉన్నాయి. ఈ అక్షరాల నిర్మాణం వల్ల అనేక మహిమలు కలుగుతాయి. అందుకే మిగతా భాషల కంటే సంస్కృతం ఉత్కృష్టమైన మంత్ర ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సంస్కృతం మంత్రంలో నుండి ఉద్భవించింది మరి.

మంత్రాలు రెండు రకాలు.

  1. దీర్ఘమంత్రాలు,
  2. బీజ మంత్రాలు.

మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు (మంత్రాలు) ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూలశబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది.

దీర్ఘమంత్రాలు వేదపాఠాల వలే గాన రూపములో ఉంటాయి. వీటిలో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది. గాయత్రీ మంత్రం మూడు పాదములు కలదెై,
ఇరవెై నాలుగు అక్షరాలతో, ఇరవెైనాలుగు చంధస్సులెై, ఇరవెై నాలుగు తత్వాలకు సంకేతంగా భాసిస్తోంది.

గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలు ఋగ్, యజుర్, సామవేదాల నుంచి గ్రహించబడి, ‘ఓం’కారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి.

‘గాయత్రీ’ మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్రుడు మంత్రానుష్ఠాన ప్రభావంవల్ల జితేంద్రియుడవడమే కాక, రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతేకాక, ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు.

అందుకే చాలా మంది సంధ్యావందనాది సమయాల్లో గాయత్రీ మంత్రమును జపిస్తుంటారు. గాయత్రీ మంత్రాన్నీ ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం.

హ్రస్వ బీజమంత్రం మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి.

దీర్ఘమంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనల పై ఆధారపడి ఉంటాయి.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది?

ఈ ప్రశ్న మనకు కలుగవచ్చు. అందుకు సమాధానం, త్రికాల వేదులెైన ఋషులు, జగత్ కళ్యాణం కోసం అందించిన సత్యోపదేశాలే ‘మంత్రాలు’. అదే విధంగా ‘మంత్రసిద్ధి’ ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది. ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణ ప్రదాలు. వాటి ఉచ్ఛారణతో సంకల్పాలు సిద్ధిస్తాయి అన్నది పెద్దలవాక్కు.

అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు, ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం, అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.

ఋషి:
మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.
ఛందస్సు:
శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పు తున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తాము కాపాడు కొనేందుకు గాయత్రీ వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకొన్నారు.
దేవత:
ప్రతి మంత్రానికి ఒక అధిష్టాత దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.

బీజం:
మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.
శక్తి:
మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.
కీలకం:
మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి, సర్వసిద్ధులను పొందుతాడు.

అంగన్యాసం:
అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి. శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.

వినియోగం:
చతుర్దిధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు.

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం.

పండుగ సమయాలలో గ్రహణ సమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి. మంత్రాలు కర్మార్థమై జనించాయి. ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆ మంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది.

మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఉదాహరణకు.. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, నారాయణ’ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి.

భక్తహనుమ ‘రామ’ నామజపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు.
గాయత్రీ మంత్ర జపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మార్షిత్వాన్ని పొందాడు.

మహాత్ములు కొన్ని ప్రాధమిక మంత్రాలను సూచించారు. అవి:

ఓం’: సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది.

అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం ‘ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజ సత్త్వ, తమో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు.

వేదం ఓంకారరూపం, వేదరాశి..
ఋగ్వేదం నుండి ‘అ’ కారం,
యజుర్వేదం నుండి ‘ఉ’ కారం,
సామవేదం నుండి ‘మ’ కారం
పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

శ్రీం:
అమ్మ వారికి చెందిన మంత్రం. ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.

హూం:
సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవిక క్రోధం యొక్క శబ్దం ‘హూం’.

ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.

రం:
ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.

ఐం:
జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.

మాం:
మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.

సోహం:
ఊపిరి యొక్క స్వాభావిక బీజం.
‘సో’ ఉచ్ఛ్యాసం,
‘హం’ నిశ్శ్వాసం.
సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం.
‘సో’ శక్తి ‘హం’ శివుడు.

గాయత్రీ మంత్రం:
ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత శాస్త్రాలలో, పురాణాలలో గాయత్రీ దేవత సగుణ, నిర్గుణ, స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి. గాయత్రీ దేవని గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రీని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు.

ఏకాక్షర మంత్రం – ‘ఓం’
అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం’. దీనినే ‘ప్రణవం’అని కూడా అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన.

ఉదా..బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవతా మూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మనపట్ల ప్రసన్నలవుతున్నారు.

మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.‘ఐం, శ్రీం, హ్రీం, క్లీం’ అనే ఏకాక్షర బీజమంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి.

ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం.
సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది.

సాధారణంగా మంత్రాలు మూడు విధాలు..💐

  1. తామస మంత్రం: క్షుద్రంతో ఉచ్ఛారణ చేసేవి.
  2. రాజస మంత్రం: యుద్ధంలో గెలుపు కోసం చేసేవి.
  3. సాత్విక మంత్రం: ఆధ్యాత్మిక సాధనకై చేసేవి.

చంధోబద్ధంగా ఉన్న మంత్రాలు ‘ఋక్కులు’ అని గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను ‘యజస్సులు’ అని అంటారు. ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు.
అలాంటి మంత్రం ప్రాణవాయువు లేని నిర్జీవ శరీరం వంటిది.

ఓంకారం ఆ సర్వేశ్వరుని నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై, దాన్నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది. ఋగ్వేదం – ‘అ’ కారం, యజుర్వేదం నుండి ‘ఉ’ కారం, సామవేదం నుండి ‘మ’ కారం కలసి ‘ఓం’ కారం ఏర్పడింది.

MANTRA Explanation in Telugu

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images