ఒక మనిషికి దేని గురించి జ్ఞానం ఉండాలి?
ఎందుకు ఉండాలి?
ఎంతవరకు ఉండాలి?
అనేది ప్రతీ వ్యక్తికీ అవసరం. అవసరం ఉన్న లేకున్నా ప్రతీ విషయం పట్ల జ్ఞానం కలిగి ఉండాలి అనుకోవటం అది లేక పోవటాన్ని అజ్ఞానం గా భావించడమే మనిషి అజ్ఞానం.
జ్ఞానం అనంతమయినది. మనిషి జీవితం పరిమితమయినది. పరిమితమయిన జీవితంలో పరిమిత జ్ఞానం మాత్రమే తెలుసుకోగలడు. అపరిమితమయిన జ్ఞానాన్ని పరిమిత జీవితంలో తెలుసుకోలేడు. ఈ ʹఇన్ఫర్మేషన్ ఎరాʹ లో కూడా మనిషి దాయగలిగింది సమాచారం మాత్రమే.
అది కూడా పరిమితమయిన సమాచారం. ఈ స్వల్పమయిన జీవిత కాలంలో ఏ విషయం పట్ల, ఏ సమయంలో, ఎంత వరకు జ్ఞానాన్ని కలిగి ఉండాలో అవగాహన ప్రతీ వ్యక్తికీ అవసరం. ఈ అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని జ్ఞానీ అంటారు. అంతే తప్ప జ్ఞానీ అనగా అపరిమితమైన జ్ఞానం మొత్తం అతనిలో ఉంది అని కాదు.

జ్ఞానం అనే నాణానికి మరో పార్శం అజ్ఞానం. జ్ఞానం లేనిదే అజ్ఞానం ఉండదు. సమకాలీన పరిస్థితులలో సమాజంలో ఉన్న జ్ఞానాన్ని మనకు అవసరం ఉన్నా పొందకుండా ఉండటమే అజ్ఞానం. ఇక్కడ ʹఅవసరంʹ మరియూ ʹసమకాలీనʹ అనే పదాలను విస్మరించరాదు.
ఒక ʹసివిల్ ఇంజినీర్ʹ కు ʹబయో కెమిస్ట్రీʹ గురించి జ్ఞానం లేక పోవటం అజ్ఞానం కాదు. ఒక ʹపెయింటర్ʹ కు ʹఆటో మొబైల్ ఇంజినీరింగ్ʹ తెలియక పోవటం అజ్ఞానం కాదు. ఒక ʹసైకాలజిస్ట్ʹ కి ʹసెకండరీ మార్కెట్ సూత్రాలుʹ తెలియక పోవటం అజ్ఞానం కాదు.
అలాగే ఒక 500 సంవత్సరాల క్రితం బ్రతికిన వ్యక్తికి ʹడిజిటల్ కెమెరాʹలో వాడే ʹసిమాస్ చిప్-సెట్ʹ గురించి తెలియక పోవటం అజ్ఞానం కాదు. కానీ అవన్నీ తెలుసు అనుకోవటం అతని అజ్ఞానాన్ని సూచిస్తుంది.

వ్యక్తి తన జీవన క్రమంలో తనకు అవసరమైన జ్ఞానాన్ని సముపార్జించకుండా తనకు తెలుసు అనే అహం తో వచ్చేది అజ్ఞానము. అహం నమ్మకం నుండి వస్తుంది. అంతవరకు తనకు తెలిసిన సమాచారమే జ్ఞానం అనుకోవటం వల్ల వ్యక్తికి అహం వస్తుంది. ఆ అహం వ్యక్తి అవసరమయిన కొత్త సమాచారాన్ని, జ్ఞానాన్ని పొందకుండా అడ్డుపడటం వల్ల అతను అజ్ఞానిగా మారతాడు.
తప్పకుండా షేర్ చెయ్యండి.