Menu Close

కేవలం కాలం గడపటమే జీవితం కాదని మనకు తెలిసి ఉండాలి – Value of Time in Telugu

మనిషిగా జన్మనెత్తాం, బతుకుతున్నాం. కేవలం కాలం గడపటమే జీవితం కాదని మనకు తెలిసి ఉండాలి. కాలం చాలా విలువైనది. పోగొట్టుకుంటే పొందలేనిది. కాలం విలువ గుర్తించినవారే విజయసోపానాలు అధిరోహించగలిగేది!

ఇద్దరు ఒకే రోజున, ఒకే సమయంలో పుట్టి ఉండవచ్చు. అయినా ఆ ఇద్దరికీ ఒకే విధమైన జీవితం, సమయం, అవకాశం లభించవు. కాలగమనంలో మేధావులు, మూర్ఖులు భూమి మీదకు వస్తారు. ఒకరు కాలంతో సంబంధం లేకుండా బతికితే, ఇంకొకరు కాలాన్ని దైవంగా భావించి విశ్వకల్యాణం కోసం అహర్నిశలూ తపిస్తారు.

clock sand timer

నిత్యం మనం కాలంతో ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాలంతో పోటీ పడుతుంటాం. కాలం తొందరగా జరిగిపోతుందని కొందరు బాధపడిపోతూ ఉంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని చక్కగా విభజించుకుంటే నిద్ర లేకుండా పనిచేయవలసిన అవసరం ఉండదు.

కాలమే దైవం. జీవితాంతం కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవడం తెలిస్తే ఎన్నో సాధించగలం. కాలాన్ని అర్థం చేసుకుంటే ఏ ఒక్క క్షణమూ వృథా చేసుకోం. ఎవరి సమయం వారికి మంచి మంచి అవకాశాలు ఇస్తుంది.

భూమ్మీదకు ఒక మనిషి వచ్చినప్పుడే అతడి కాలనిర్ణయం జరుగుతుంది. ఆ కాలంలో ఉన్న ప్రకృతి సహా సర్వజీవులూ ఆ సమయానుగుణంగానే ప్రవర్తిస్తాయి. ఆయుష్షు గురించి ఆలోచన అనవసరం. అయితే గియితే కాలం నిరుపయోగం అవుతుందని బాధపడాలి.

కాలానుగుణంగా ప్రతి యుగంలో మార్పులుంటాయి. ధర్మం మారుతుంది. సంఘం మారుతుంది. మనిషి మారతాడు. విలువైన కాలగమనం మాత్రం మారదు. ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలో వ్యవస్థ నడుస్తుంది. కాలం చాలా గొప్పది. కాని దానికంటే ఆ కాలంలో జన్మించిన అవతార పురుషులు ఇంకా గొప్పవారు.

అందుకే శ్రీరాముడి కాలంలో, శ్రీకృష్ణుడి కాలంలో అంటుంటారు. వారు కాలాన్ని ప్రభావితం చేశారు. కాలాన్ని దివ్యం చేశారు. కాలానికి ఒక చరిత్రను సృష్టించారు. వారి అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

clock time

ఒక్కోసారి కాలాన్ని మనం నడిపిస్తున్నామా, లేదా కాలమే మనల్ని నడిపిస్తుందా అనే మీమాంసకు గురి అవుతుంటాం. కాలాన్ని ఎవరూ నడిపించలేరు. కాలమే మన జీవితాలను మార్చిపారేస్తుంది. కాలమే పెను మార్పులకు గురిచేస్తుంది. కాలమే అనూహ్యమైన స్థితిలోకి మనల్ని నెట్టేసి చోద్యం చూస్తుంది.

మనమొక లక్ష్యాన్ని గట్టిగా పట్టుకుని, జారిపోకుండా వెనకడుగు వేయకుండా ముందుకు ప్రయాణిస్తుంటే కాలం చేసిన సహాయానికి జోహార్లు అర్పించకుండా ఉండలేం.

దెబ్బ తగిలింది… మందు వేస్తాం. వెంటనే ఆ క్షణంలోనే నొప్పి మాయమైపోదు. దెబ్బ కనపడకుండా పోదు. చికిత్స చేస్తున్నా కొంత సమయం మనం ఆగాలి. అదే కాలం చేసే విచిత్రం. వైద్యశాస్త్రంలో కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆయుర్వేదంలో కాలమూ చికిత్సలో భాగమే.

ప్రతి క్షణం మనం కాలంలోనే ఉంటూ కాలంతో సహజీవనం చేస్తూ ఉంటాం. చెడుకాలం, మంచి కాలమని మనిషి తనకు జరిగిన లాభనష్టాలను బట్టి విభజిస్తూ ఉంటాడు. నిజానికి కాలం నిమిత్తమాత్రం. మనం చేసే కృషిని బట్టే ఫలితాలు ఉంటాయి.

దైవాంశ సంభూతులం కాని మనం ధనం కన్నా, బంగారం కన్నా, ప్రాణం కన్నా కాలం విలువైనదిగా గుర్తించాలి. ఈ కాలాన్ని ఇతరులకు సహాయంకోసం, మంచి జీవనం కోసం, మానవత్వం నిలబెట్టడం కోసం, మన ఉనికి ఏమిటీ? అని, మనం ఎవరో మనం తెలుసుకోటం కోసం ఉపయోగించుకోవాలి. అక్కడే ఉంది మన నిజమైన వివేకం

Like and Share
+1
6
+1
0
+1
0
+1
0
+1
0

1 Comment

Leave a Reply

Your email address will not be published.

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker

Refresh Page
x

Subscribe for latest updates

Loading

Rashmika Mandanna Images Sai Pallavi Photos Samantha Cute Photos Pooja Hegde Images Anupama Parameswaran Cute Photos