ఒక కప్ప అనుకోకుండా ఓ రోజు గెంతుకుంటూ వెళ్ళి స్నానాకికి వేడి నీటి కోసం అప్పుడే పొయ్యి మీద పెట్టి వున్న గిన్నిలో పడింది.
కాసేపటికి నీళ్ళు కొంచెం వేడి అవ్వటం మొదలవుతుంది, ఆ నీళ్ళ వేడికి తగ్గట్టుగా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటుంది..
ఇంకొంచెంసేపు తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువ వేడి అవుతాయి, అప్పుడు కూడా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను నీటి వేడికి తగ్గట్టుగా మార్చుకుని నీటి వేడిని ఓర్చుకోగలుగుతుంది..
ఇలా కొన్నిసార్లు జరిగినతరువాత ఇక నీళ్ళు పూర్తిగా మరిగినంత స్థితికి చేరాక కప్ప తన శరీర ఉష్ణోగ్రతను ఇంక మార్చుకోలేదు, ఇక అప్పుడు కప్ప నిర్ణయించుకుంటుంది, నీళ్ళగిన్నెలోంచి ఇక బయటకు దూకేద్దాము అని…
కానీ దూకలేకపోయింది, ఎందుకంటే అప్పటివరకూ శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటూ నీటి వేడిని భరించటంలోనే కప్ప శక్తి అంతా హరించుకుపోయింది, వేడి నీళ్ళ గిన్నెలోంచీ దూకే శక్తి లేక నీరసపడిపోయింది…
కాసేపటికి కప్ప చనిపోయింది…
కారణం వేడినీళ్ళా…కానే కాదు
ఎప్పుడు గిన్నెలోంచి దూకాలో సరైన సమయంలో సరైన నిర్ణయం కప్ప తీసుకోలేకపోయింది..అదే అసలైన కారణం..
మనుష్యులతో పరిస్థితులతో సర్దుకుంటూ బతకటం జీవితానికి చాలా అవసరమే..
కానీ శారీరకంగానో, మానసికంగానో, ఆర్ధికంగానో, ఆచారాల పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, భావాలపరంగా బలహీనపరుస్తూనో..ఒకరు లేదా కొందరు మరొకరిని ఇబ్బంది పెడుతుంటే, బాధపెడుతుంటేనో కొంతకాలం, కొంత హద్దువరకు భరించినా పరవాలేదు…
కానీ అదే పద్ధతి ఇరువైపులవారికి ఒక మార్చుకోలేని అలవాటుగా మారినప్పుడు…బాధపడేవారు ఎల్లకాలం భరిస్తూ ఉండి బలై పోవడం మంచిది కాదు…
సరైన సమయంలో బాధనుంచి తనను తాను రక్షించుకోవడం , బాధాకరపరిస్థితులకి, బాధపెట్టే మనుష్యులకి దూరంగా వెళ్ళడం అనేది సహజసిద్ధంగా నేర్చుకోవలసిన ఆత్మరక్షణ…
ఎవరోవస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ సమయం ముగిసిపోయేవరకు ఉండి బలై పోయేకంటే, సమయం ఉన్నప్పుడే కళ్ళు తెరుచుకుని ధైర్యంగా, సరైన శక్తి ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మంచి జీవితానికి చాలా అవసరం..
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.