Menu Close

భారతదేశంలో టాప్ 10 డేంజరస్ సైబర్ క్రైమ్స్ – Top 10 Cyber Crimes in India


భారతదేశంలో టాప్ 10 డేంజరస్ సైబర్ క్రైమ్స్ – Top 10 Cyber Crimes in India

Top 10 Cyber Crimes in India: ఆన్ లైన్ మోసాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి. ఈ మోసాల బారిన పడడానికి కారణం ముఖ్యంగా మనిషి అవసరం లేదా అత్యాశ. ముక్కు, మొహం తెలియని వ్యక్తి ఎవరో తనను తాను పరిచయం చేసుకొని, ఫైనాన్షియల్ బెనిఫిట్ లేదా బిజినెస్ సర్వీస్ యిస్తానని చెబితే జనాలు ఎలా నమ్ముతున్నారో అసలు అర్థం కాదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసాలు లెక్కకు మించి పెరుగుతున్నాయి.

Top 10 Cyber Crimes in India

సైబర్ ఫ్రాడ్స్‌ను కట్టడి చేయడానికి పోలీస్ వ్యవస్థ ఎంత ప్రయత్నిస్తున్నా, ఈ సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. ఇంకా ఎక్కువవుతోంది. ఈ క్రమంలో జనాల భద్రత కోసం, వారిని జాగరూపులను చేయడం కోసమే ఈ వ్యాసం.

వివిధ పత్రికలు, వెబ్ సైట్లలో ప్రచురితమైన వార్తలను ఆధారంగా చేసుకొని, పలు సైబర్ నేరాల జాబితాను క్రోడికరించి మీకు అందిస్తున్నాను.

రహస్యాలకు పుట్టిల్లు – సెంటినల్ ద్వీపం – Sentinel Island Mystery in Telugu

హనీ ట్రాప్: కొందరు కిలాడీ అమ్మాయిలు సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు లేదా రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా వారితో పరిచయం పెంచుకొని, న్యూడ్ కాల్స్ మాట్లాడే విధంగా ప్రోత్సహిస్తారు. తర్వాత ఆ వీడియో కాల్స్ రికార్డ్ చేసి వారి ఇంట్లో వాళ్లకు, పెళ్ళాం బిడ్డలకు, బంధువులకు వాటిని పంపి.. పరువు తీస్తామని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బు లాగుతుంటారు. దీనినే హనీ ట్రాప్ అంటారు.

ఫేక్ రివ్యూస్ : గూగుల్ రివ్యూస్ రాస్తే, రివ్యూకి రూ.100 ఇస్తామని నమ్మబలికే బ్యాచ్ ఒకటి ఉంది. వాట్సాప్ ద్వారా వీరు తొలుత మిమ్మల్ని సంప్రదిస్తారు. ప్రముఖ కంపెనీ హెచ్.ఆర్ మాదిరిగా పరిచయం చేసుకుంటారు. తర్వాత ఓ టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ చేస్తారు. మొదటి మూడు రివ్యూలకు, రివ్యూకి రూ.100 చొప్పున మీ అకౌంట్లో వేస్తారు. తర్వాత రూ.5000 పెట్టి మెంబర్ షిప్ తీసుకోమంటారు. సభ్యత్వం తీసుకుంటే, రోజుకి పది నుండి ఇరవై ప్రొడక్టులకు రివ్యూ రాసే అవకాశం ఇస్తామంటారు. ఒకవేళ, మీరు డబ్బు కట్టి మెంబెర్ షిప్ తీసుకుంటే ఇక అంతే సంగతులు. వెంటనే మీ నెంబర్ బ్లాక్ చేసి, మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూపు నుండి తొలిగిస్తారు.

ఫేక్ ప్రొడక్ట్స్ : మనం ప్రొడక్టు ఆర్డర్ పెట్టకుండానే, ఎవడో అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ నుండి కొరియర్ వచ్చిందని కాల్ చేస్తాడు. మనల్ని నమ్మబలుకుతూ మనింటికి వస్తాడు. కొరియర్ విడిపించుకోవాలంటే, ఓ రూ.50 ఫోన్ పే లేదా గూగుల్ పే చేయమంటాడు. వాడే స్కానర్ ఓపెన్ చేసి పేమెంట్ ఆప్షన్ చూపిస్తాడు. దాన్ని మన స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే? ఇక అంతే సంగతులు. ఏదో మాల్వేర్ మన ఫోనులోకి ఎంటర్ అయ్యి, మన ఫోన్ మొత్తం అవతలి వాడి కంట్రోలులోకి వెళ్లిపోతుంది.

ఫేక్ ఫోన్ కాల్స్ : కొందరు సైబర్ నేరగాళ్లు తాము గ్రామ సచివాలయం నుండి మాట్లాడుతున్నామని, 15000 రూపాయలు “అమ్మఒడి” పథకంలో భాగంగా అర్హుల ఖాతాల్లో వేస్తున్నామని అంటారు. వెంటనే మొబైలులో ఫోన్ పే ఓపెన్ చేసి, “Rs.15000” అనే రిసివింగ్ మెసేజ్ కనిపించిన చోట క్లిక్ చేసి, యాక్సెప్ట్ ఆప్షన్ నొక్కమంటారు. ఎక్కువగా గృహిణులే వీరి టార్గెట్. పొరబాటున మీరు యాక్సెప్ట్ అనే ఆప్షన్ నొక్కారో, ఇక ఇంకే సంగతులు. మీ ఖాతా నుండే రూ.15000 కట్ అయ్యి, అవతలి వాడి ఖాతాలో పడతాయి.

ఆన్ లైన్ స్నేహాలు: ముఖ్యంగా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సుల్లో పనిచేసే ఉద్యోగులు ఆన్ లైన్ స్నేహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని వీరి నుండి తస్కరించడానికి చాలా అసాంఘిక సంస్థలు అందమైన ఫారిన్ అమ్మాయిల చేత వీరిని ట్రాప్ చేయిస్తున్నాయి. పురుషులకు నుండే కొన్ని లైంగిక బలహీనతలను ఆసరాగా తీసుకుని, ఈ లేడీ గూఢచారులు ఆన్ లైన్ ద్వారా కీలక శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు వలలు విసురుతున్నారు.

ఫేస్ బుక్ నేరాలు : కొందరు ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ ఫ్రెండ్స్ పేర్లతో ఫేక్ ఖాతాలు తయారుచేసి, ఆ ఖాతాల ద్వారానే మీతో కాంటాక్ట్ అవుతారు. అవసరంలో ఉన్నామని, ఓ రూ.10000, రూ.20000 సర్దుబాటు చేయమని అడుగుతారు. మీరు ఒకవేళ మీ స్నేహితుడే మెసేజ్ చేసాడని పొరబాటు పడితే, మీ జేబుకే చిల్లు పడుతుంది.

ఆన్‌లైన్ డేటా వర్క్స్ నేరాలు: కొందరు రోజుకి 20 నుండి 30 పేజీల వరకు డేటా టైపింగ్ వర్క్ చేస్తే, పేజీకి రూ.50 నుండి రూ.100 ఇస్తామని చెబుతారు. నమ్మి వీళ్ళ వలలో పడితే అంతే సంగతులు. వర్క్ ఏ అపరాత్రో, అర్థరాత్రో పంపిస్తారు. ఒక టైమ్ ఫిక్స్ చేసి, ఆ టైముకల్లా వర్క్ పంపకపోతే, పేమెంట్ ఇవ్వలేమంటారు. నిజానికి, వాళ్ళు ఇచ్చే టైమ్ చాలా తక్కువగా ఉంటుంది.

అయినా, ఎలాగోలా కష్టపడి చేసి పంపిస్తే, అక్షర దోషాలు ఉన్నాయని సాకులు చెబుతూ, పేమెంట్ ఇవ్వలేమంటారు. అలాగని ఈ టార్చర్ భరించలేక, వర్క్ మధ్యలో వదిలేద్దాం అంటే కుదరదు. “వర్క్ చేయలేం మహా ప్రభో.. మమ్మల్ని వదిలేయండి” అన్నామనుకోండి. వారు మీతో చేయించుకున్న డిజిటల్ అగ్రిమెంట్ చూపిస్తారు. వర్క్ మధ్యలో వదిలేస్తే.. రూ.25000 ఫైన్ కట్టాలని అందులో ఉంటుంది. కట్టకపోతే, లీగల్ నోటీస్ ఇంటికి పంపించి కోర్టుకి ఈడుస్తామంటారు. కానీ ఆ నోటీస్ అంతా ఫేక్ అన్న విషయం మనం తెలుసుకుంటే చాలు.

బెట్టింగ్ యాప్స్ : కొంతమంది విదేశీ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలు లేదా ఇన్ఫ్లుయన్సర్లను ఆన్ లైను ద్వారా సంప్రదిస్తారు. తమ యాప్ లింక్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఆయా సెలబ్రిటీల పేజీల ద్వారా ప్రమోట్ చేస్తే, దండిగా డబ్బులు ఇస్తామని చెబుతారు. చెప్పడమే కాదు, ఇస్తారు కూడా. అయితే ఈ యాప్ లింకులు క్లిక్ చేసి, బెట్టింగ్ ఆడే సామాన్యుల పరిస్థితే ఘోరం.

తొలుత రూ.100 పెట్టుబడి పెడితే రూ.1000 లాభంగా వస్తాయి. తర్వాత రూ.1000 పెడితే రూ.10000 లాభంగా వస్తాయి. ఆ తర్వాత ఆశతో సామాన్యుడు లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెడతాడు. అప్పుడు ఆ డబ్బులన్నీ పోతాయి. మళ్లీ మళ్లీ అప్పు చేసి పెట్టినా, మళ్లీ మళ్లీ పోతాయి. ఇలా బెట్టింగ్ యాప్స్ బారిన పడి, ఆర్థికంగా చితికిపోయి మరణించిన వారెందరో.

జ్యోతిష్యం పేరిట మోసాలు: కోయ జోస్యం చెబుతామని కొందరు, తాంత్రిక జోస్యం చెబుతామని కొందరు ఈ మధ్య ఎక్కడబెడితే అక్కడ సోషల్ మీడియా పేజీల్లో దూరిపోయి, పదే పదే ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. వీరి పట్ల మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో సమస్యలు అధికంగా ఉండే ఆడవాళ్లు దైవకృప కోసం ఈ నకిలీ జ్యోతిష్కులను సంప్రదించి వారు చెప్పిన చోటికి పూజల నిమిత్తం వెళ్తున్నారు. ఇదే క్రమంలో వారి చేతిలో అత్యాచారాలకు గురవుతున్నారు. తమ వద్దకు వచ్చే మహిళలకు ప్రసాదాల్లో మత్తు మందు కలిపి ఇచ్చి, వారి పట్ల జ్యోతిష్కుల ముసుగులో కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

బ్లూ బార్న్ ఎటాక్ : మీరు మీ బ్లూ టూత్ డివైజ్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి. మీ డివైజ్ సెక్కురిటి ఫీచర్ బలహీనంగా ఉంటే, బ్లూ టూత్ ద్వారా కూడా సైబర్ నేరగాళ్ళు వల పన్ని మీ మొబైల్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకు మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా APK ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దు. అటువంటి ఫైళ్ళలో మీకు తెలియనివి ఏవైనా ఉంటే, వాటిని వెంటనే డిలీట్ చేయండి. అలాగే మీ ఫోనుని సెక్యూరిటి స్కాన్ చేయండి. అనుమానస్పద యాప్స్ లేదా ఫైల్స్ కనిపిస్తే, డిలీట్ చేసేయండి. తద్వారా మీ వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా కాపాడుకున్న వాళ్ళవుతారు. మీ ఫోన్ లాక్‌కు, అలాగే మీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్‌కు బలమైన పాస్ వర్డ్స్ పెట్టుకోండి.

ఇవి మాత్రమే కాకుండా, ఈ మధ్య అమాయకులైన జనాలను బకరాలను చేయడానికి సైబర్ నేరగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో మరో కొత్త అవతారం ఎత్తుతున్నారు. తొలుత వీరు తాము పోలీసులమని నమ్మిస్తారు. ఆ తర్వాత మీ మీద చీటింగ్ కేసులు ఉన్నాయని చెబుతారు. ఆ కేసుల ఎంక్వయరి నిమిత్తం మిమ్మల్ని మీరే ఓ రూములో బంధించుకొని, వారితో ఫోనులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తారు. లేదా ఆ కేసుల నుండి బయట పడాలంటే, భారీ మొత్తంలో డబ్బులు వారి ఖాతాల్లో వేయాలని అడుగుతారు. ఇలా రకరకాల ఫీట్లు చేస్తారు. ఇవ్వన్నీ నమ్మొద్దు.

ఎందుకంటే, ఈ సైబల్ నేరగాళ్ళు ఏ రోజు ఏ కొత్త పథకం వేస్తారో అర్థం కావడం లేదు.

కనుక, జనాలు జాగ్రత్తగా ఉండడం మంచిది.

National Cyber Crime Reporting Portal వారు 1930 పేరిట ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ బాధితులు తాము మోసపోయామన్న విషయం తెలియగానే, వెంటనే ఈ నెంబరుకి ఫిర్యాదు చేయండి. వారు మీ ఫిర్యాదును స్వీకరిస్తారు. వెంటనే వారి టీమ్ రంగంలోకి దిగి, మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.

ప్రపంచాన్ని వణికించిన 10 మంది సైకో కిల్లర్స్ – 10 Psycho Killers in The World

గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Information Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading