ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories – ఒక ఊళ్లో ఇద్దరు సోదరులు నివసిస్తూ వచ్చారు. కావడానికి బ్రాహ్మణ కులానికి చెందినవారే అయినప్పటికీ వారు విద్యాధికులు కారు. దాంతో వారు దారిద్ర్యంలో మ్రగ్గసాగారు. కొంతకాలానికి కటిక దారిద్ర్యం పట్ల విసిగిపోయిన ఆ సోదరులు ఇల్లు వదలిపెట్టి బయలుదేరారు. సంపదను వెతికే ఉద్దేశంతో వారు చివరకు సముద్ర తీరానికి వచ్చారు.
అది మత్స్యకారులు నివసించే ప్రాంతం. ఆ ఇద్దరు సోదరులు పెద్ద తలపాగా, చందన బొట్టు, చేత పుస్తకాల దొంతర మొదలైన వాటితో వెళ్ళి, మత్స్యకారుల మధ్యలో తమ జ్యోతిష పాండిత్యాన్ని ప్రదర్శించారు. పాపం! ఆ పేద మత్స్యకారులు వీరిద్దరినీ జ్యోతిషంలో ఉద్దండ పండితులని నమ్మారు. తాము అతికష్టం మీద పొదుపు చేసుకున్న ధనమంతా వీరికి ధారాదత్తం చేయడంతోపాటు, వీరి మాటను వేదవాక్యంగా పరిగణించసాగారు.
మంత్రతంత్రాలంటూ, తాంత్రీకం అంటూ ఆ సోదరులు హడావిడి చేస్తూ ఏమీ తెలియని అమాయక మత్స్యకారులను బాగా మోసగించారు. కొద్ది కాలంలోనే బోలెడంత ధనం మూటకట్టుకోవడంతో ఆ ఇద్దరు సోదరుల ఇంటికి బయలుదేరారు. చేతనున్న ధనం ఎక్కువగా ఉండటంతో దాన్నంతా బంగారు కాసులుగా మార్చి, ఒక సంచీలో వేసుకొని నడవసాగారు.
దారిలో వెళుతున్నప్పుడు బంగారు కాసుల సంచీని ఒకరు మార్చి మరొకరు మోసుకుని పోసాగారు. అప్పుడు వారి మనోస్థితి బహు విచిత్రంగా తయారయింది. ఎవరి వద్ద ఆ బంగారు కాసుల సంచీ ఉందో అతడి మనస్సులో, ‘నేనే ఈ మొత్తం సంపదను సొంతం చేసుకుంటే ఎలా ఉంటుంది! అందు నిమిత్తం నా సోదరుణ్ణి చంపితే మటుకు ఏం?” అనే ఆలోచన మెదలింది.
ఏకోదరులైన ఆ సోదరులు ఒకరు మరొకరి పట్ల అమిత ప్రేమాదరణలతో అంతకాలం జీవిస్తూ వచ్చారు. వారి హృదయాల్లో గూడుకట్టుకు పోయిన ప్రేమాభిమానాలే వారి మనస్సులో ధనం కారణంగా తలెత్తిన పాపకృత్య చింతన కార్యరూపం దాల్చకుండా నివారించాయి. ఇంటిని సమీపిస్తున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది.
బంగారు కాసుల సంచీ ఎవరి చేతిలో లేదో, అతడు బంగారు కాసులు సంచీ పుచ్చుకుని ఉన్న సోదరుడితో, “అన్నా! నన్ను క్షమించు. నా వద్దకు సంచీ వచ్చినప్పుడల్లా, నిన్ను చంపి ఆ మొత్తాన్ని నేనే కాజెయ్యాలనే పాపిష్టి తలంపే నాకు వస్తూ వచ్చింది. కాబట్టి ఆ పాపిష్టి సొమ్ము నాకు వద్దు. దాన్ని నువ్వే ఉంచుకో” అని చెప్పాడు.
అది విన్న అన్న, తమ్ముడితో, “తమ్ముడూ! నా స్థితి అదే. ఇప్పుడు కూడా సంచీ నా వద్దకు రాగానే నిన్ను చంపాలనే యోచనే వచ్చింది, ఇలా మన ఇద్దరి ప్రగాఢ అనుబంధమూ, సోదర ప్రేమా ఇట్టే నశించిపోయేలా ప్రలోభ పెట్టిన ఈ బంగారు కాసుల సంచీని దూరంగా విసిరి పారేద్దాం. అదే మనకు శ్రేయస్కరం” అని చెప్పాడు.
ఇంటికి సమీపంలో చెత్తను పడవేసే ఒక పెద్ద పల్లం ఉంది. దాన్లోనే వారు రోజూ ఇంటి చెత్తను పారవేయడం వాడుక, ఇద్దరూ కలసి ఆ బంగారు కాసులు సంచీని దాన్లో విసిరి పారేసి, తిరిగికూడా చకుండా ప్రశాంత మనస్కులై ఇంట్లోకి వెళ్ళారు. విసిరి వేసిన బంగారు కాసుల సంచీ ఎవరికంటా పడకుండా దాన్ని చెత్తతో మూసి ఉంచాలని కూడా వారికి తోచలేదు.
అదే సమయంలో ఊరి నుంచి కొద్ది రోజులు అన్నలతో గడిపి పోదామని వచ్చిన వారి చెల్లెలు వచ్చి ఉంది. వంటకు కావలసిన కాయగూరలు తరిగి ఇంట్లోని చెత్తను పల్లంలో వేసి రావడానికి ఆమె బైటకు వచ్చింది. ఇంటి వెనుక వైపునుంచి వెళ్ళడంతో ఆ సోదరులు ఆమెను చూడలేదు. అక్కడ చెత్త గుట్టలో ఒక సంచీనుంచి బంగారు. కాసులు చెదరి పడి ఉండటం ఆమె చూసింది.
చెత్తను విసిరి పారవేసి అదే వేగంతో బంగారు కాసులను పోగుచేసి ఆ సంచీలో వేసి, దాన్ని కట్టి తన చీర చెంగులో దాచి, నడుముకు కట్టుకుంది. ఆ రోజు రాత్రే ఎవరి కంటా పడకుండా తన భర్తకు దాన్ని అందజేయాలని ఆమె నిర్ణయించుకొని ఇంటి వైపు తిరిగింది. అదే సమయంలో ఆమె పెద్దన్న భార్య ఏదో పనిగా బయటకు వచ్చింది.
తన మరదలు చెత్తగుట్ట వద్ద నిలబడి ఏదో చేస్తూండటం గమనించింది. ఏం చేస్తున్నదో తెలుసుకోవడానికి వదిన, మరదలును గబగబా సమీపించి, “ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా?”: ‘ అని కుతూహలంతో అడిగింది. అపరాధ భావంతో ఆమె మనస్సు గుభేలుమంది. ‘వదిన బంగారు కాసులను చూసిందేమో! అలా అయితే ఆమె అందరికీ చెప్పేస్తుంది!” అని అనుకొంది మరదలు.
చేతిలో కాయగూరలు తరిగే కత్తి ఉంది. అనాలోచితంగా ఆమె ఠక్కున ఆ కత్తితో వదిన కడుపులో బలంగా పొడిచింది. అంతే! భార్య గావుకేకలు విని పెద్దన్న అక్కడకు ఒక్క పరుగులో వచ్చాడు. అన్నను చూడగానే భయంతో గడగడ వణకిపోయిన చెల్లెలు పారిపోవాలనుకొంది; సాధ్యం కాలేదు. కాళ్ళు కదలడానికి నిరాకరించాయి.
అప్పుడు ఏం చెయ్యాలో పాలుబోక వెంటనే వదినగారి కడుపులో దిగిన అదే కత్తితో తన పొట్టలో బలంగా పొడుచుకుని నేలు కూలింది. ఈ ఘోర దృశ్యాన్ని చూసిన సోదరుల దుఃఖం వర్ణనాతీతం. అన్న తమ్ముణ్ణి చూస్తూ, “తమ్ముడూ! పాపంతో మూటగట్టిన ధనాన్ని విసిరి పారవేసినప్పటికీ ఇన్ని అనర్థాలు జరిగిపోయాయే!” అంటూ తల మీద చేతులు ఉంచుకుని అక్కడే కూలబడిపోయాడు. పాపంతో కూడబెట్టే సొమ్ము ఏ నిమిషంలోనైనా ఎవరికైనా ప్రమాద భరితంగా పరిణమిస్తుంది. కాబట్టి సన్మార్గంలో సొమ్ము గడించి జీవించడమే క్షేమమూ, శ్రేయస్కరమూను.
Best Story in Telugu – Lakshmi Devi Stories in Telugu – Devotional Stories in Telugu