అంతా మన ఎంపికే! – Telugu Moral Stories
ఒక రోజు ఆది శంకరాచార్యులు శిష్యులతో కలిసి వెళ్తుంటే, ఒక వ్యక్తి ఆవును తాడుతో లాగటం తారసపడింది. శంకరులు తన శిష్యులతో, ‘ఆవు ఆ మనిషికి కట్టుబడి ఉందా. లేదంటే, మనిషి ఆవుకు కట్టుబడి ఉన్నాడా?’ అని అడిగారు.
శిష్యులు ఏమాత్రం సంకోచించకుండా ‘గురువర్యా! తప్పకుండా ఆవే మనిషికి కట్టుబడి ఉంది. మనిషి తాడు పట్టుకొని ఉన్నాడు. ఆవు ఎక్కడికి వెళ్లినా అతణ్ని అనుసరించాలి. మనిషి యజమాని, ఆవు బానిస’ అని చెప్పారు.
‘ఇప్పుడు చూడండి’ అని శంకరాచార్యులు ఆ తాడును కత్తిరించారు. వెంటనే ఆవు పారిపోయింది. యజమాని దాని వెంట పరుగుపెట్టాడు. అప్పుడు శంకరులు ‘శిష్యులారా! ఆవుకు తన యజమాని పట్ల అస్సలు ఆసక్తి లేదు. నిజానికీ ఆవు ఆ మనిషి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది. మన మనసు విషయంలో కూడా అదే జరుగుతుంది.
మనసు దానంతట అదే చెడు ఆలోచనల మీద ఆసక్తి చూపదు. మనమే చెడు ఆలోచనలతో దాన్ని నింపుతున్నాం. వాటికి బదులు మంచి ఆలోచనలకి మనసులో స్థానం ఇవ్వాలి. అప్పుడు చెడు ఆలోచనలు ఆ ఆవులాగే వెళ్లిపోతాయి. స్వేచ్ఛ, సంతోషం మన ఎంపికే’ అని బోధించారు శంకరులు.
Telugu Moral Stories