ఈ గ్రాండ్ పేరెంట్స్ తో చాలా ఇబ్బందిగా ఉన్నదండి” అన్న కోడలి మాట చెవిన పడ్డ అన్నపూర్ణయ్య గారి మనసు ఒక్క సారిగా చివుక్కుమంది.
భార్య అన్నపూర్ణ వైపు చూసారు. ఆవిడ తల వంచుకుని ఏదో చదువుకుంటోంది. ఎప్పుడు గుంటూరు వదిలి రాని ఆ ఇద్దరు మార్చి నెలలో కొడుకు దగ్గరకు రావడం, అనుకోకుండా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండిపోవడం జరిగింది.
ఆ తరువాత తిరిగి గుంటూరు వెళ్ళిపోతామన్నా కొడుకు, కోడలు ఒప్పుకోలేదు. “అక్కడైనా మీ ఇద్దరే కదా, అదేదో ఇక్కడే ఉండండి” అని కొడుకు అంటే ….
“నాక్కూడా ఈ పిల్లలతో వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టంగా అత్తయ్య గారూ” అని కోడలు కూడా అనడంతో అక్కడే ఉండిపోయారు దంపతులిద్దరు.
మూడు పడకల ఇల్లు అవడం వల్ల పెద్ద ఇబ్బంది లేకపోయింది మొదట్లో. లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన రెండు గంటల వ్యవధిలోనే కొడుకు బజారెళ్ళి కూరలు, అత్యవసరమైన సామాను తేవడం వంటివి చేసేవాడు. ఈ లాక్ డౌన్ నిబంధనలు సవరించిన తరువాత ఇంటి ముందుకే కూరలు రావడం, ఇతర సామాను ఆన్ లైన్లో తెప్పించుకోవడం వీటితో సరిపోతోంది.
అందరికంటే బాగా సంతోషిస్తోంది మాత్రం మనవడు, మనవరాలు. మనవడు మహా చుఱుకైన వాడు. మనవరాలు మాత్రం దాని ౙడ, బొట్టు బిళ్ళలు, మూరెడు పూలు అంటూ కాలానికి అనుగుణంగా కాక పాత తరం వాళ్ళలాగా తయారయింది. ‘మంచిదేలే’ అనుకున్నారు అన్నపూర్ణమ్మ గారు.
మధ్యాహ్నం ఒక కునుకు తీసి లేచే సమయానికి కోడలు టీ కలిపి ఉంచుతుంది. అది తాగేసి మనవడితో అన్నపూర్ణయ్య గారు, మనవరాలితో అన్నపూర్ణమ్మ గారు కాలక్షేపం చేస్తూ గడిపేస్తుండేవారు. కానీ ఈ మధ్య స్కూళ్ళు తెరిచీ, తెరవనట్లు ఆన్లైన్ క్లాసులంటూ మొదలయ్యేసరికి కొడుక్కి, కోడలికి ఊపిరి ఆడటం లేదు. పిల్లలిద్దరికీ చెరో టాబ్ కొనవలసి వచ్చింది.
అందులోనుండే పాఠాలు వాళ్ళు చెప్పడం, వీళ్ళు వినడం అంతా కొత్తగా, వింతగా అనిపించింది ఆ దంపతులకు. అప్పటిదాకా వేమన పద్యాలు, తెలుగుబాల పద్యాలు, సుమతీ శతకం వంటివి నేర్పించి అర్ధాలు వివరిస్తూ కాలక్షేపం చేస్తున్న అన్నపూర్ణయ్య గారికి తోచడం లేదు. ఆడవాళ్ళు ఏదో ఒక వ్యాపకం త్వరగా కల్పించుకోగలరేమో కానీ మగవాళ్ళు అంత తొందరగా కొత్త వ్యాపకాలు తగిలించుకోలేరు.
దానితో ఆన్లైన్ క్లాసులు అయిపోయాక పిల్లలను మళ్ళీ పద్యాలు అంటూ విసిగించడం ఎందుకు? అనుకున్న అన్నపూర్ణయ్య గారు కొడక్కి చెప్పి ‘వైకుంఠపాళి’ చార్టు తెప్పించి పిల్లలతో ఆడటం మొదలు పెట్టారు. మొదట్లో పాము నోట పడి వెనక్కి వచ్చిన ప్రతిసారీ మనవడు, మనవరాలు ఏడుపు మొహం పెట్టేవాళ్ళు.
ఐతే ‘వైకుంఠపాళి’ అంటే ఏమిటో అన్నపూర్ణయ్య గారు వివరంగా చెప్పిన మీదట మనవడు అర్ధం చేసుకున్నాడు కానీ మనవరాలు మాత్రం ‘తాతా, ఈ పిచ్చాట నేనాడను. రాత్రి పూట పాములు కలలోకి వస్తున్నాయి’ అంటూ తప్పించుకుంది.
అప్పుడు అన్నపూర్ణమ్మ గారు మనవరాలిని దగ్గర కూర్చోబెట్టుకుని గ్రిల్ దగ్గర ఉన్న ఐదారు రాళ్ళు తీసుకొచ్చి ‘అచ్చంగిల్లాలు’ ఆడటం మొదలు పెట్టారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొడుకు, కోడలు బిజీగా ఉండటం వల్ల పిల్లల పని పెద్దవాళ్ళు చూసుకుంటున్నారనుకుని సంతోషపడ్డారు ఇద్దరూను.
అలా నడుస్తున్న సమయంలో ఆన్లైన్ క్లాసుల విషయంలో స్కూలు వాళ్ళు కోడలికి ఫోన్ చేసి మనవడి మీద ‘హోమ్ వర్క్ చెయ్యడం లేదంటూ’ కంప్లైంటు ఇచ్చింది.
అప్పటిదాకా పిల్లల సంగతి పట్టించుకోని కోడలికి ‘ఇదంతా తాతా, నాయనమ్మల ఆటల వల్లే’ అనే అభిప్రాయంతో “ఈ గ్రాండ్ పేరెంట్స్ తో చాలా ఇబ్బందిగా ఉన్నదండి. ఎప్పుడు పద్యాలు, ఆటలు, పాటలు …. కెరీర్ కు పనికొచ్చేవి ఒక్కటీ వీళ్ళకు తెలియవు. పాత కాలపు మనుషులు” అంటూ స్కూలు వాళ్ళకు చెప్పడం అన్నపూర్ణయ్య గారి చెవిన పడింది. ఆ తరువాత కోడలు తన భర్త దగ్గరకు వెళ్ళి ‘వీళ్ళ ఆటలు, పాటలు, పద్యాల గురించి చెబుతూ హోమ్ వర్క్ చెయ్యడం లేద’న్న స్కూలు వాళ్ళ మాట కూడా చెవిన వేసింది.
ఆ రాత్రికే అన్నపూర్ణయ్య గారు కొడుక్కి చెప్పేసారు మరునాడు ఉదయమే తాము గుంటూరు వెళ్ళిపోతున్నట్లు. “ఇప్పుడంత అవసరం ఏఁవొచ్చింది? ఇక్కడ ఇబ్బందేం లేదుగా?” మొహమాటనికి అన్నాడు కొడుకు మనసులో ‘వీళ్ళ వల్ల పిల్లలు హోమ్ వర్క్ చెయ్యడం లేదన్న విషయం గుర్తు పెట్టుకుని.
“లేదులేరా, ఊరొదిలి ఆర్నెల్లయింది. ఎంత కూతురు, అల్లుడు అయినా ఎంత కాలమని ఆ ఇంటిని కనిపెట్టుకుని ఉంటారు? వాళ్ళకీ ఇబ్బందే” అంటూ సర్ది చెప్పారు అన్నపూర్ణయ్య గారు.
కొడుకు డ్రైవర్ని పెట్టి తన కారులోనే తల్లిదండ్రులను గుంటూరు పంపించేసాడు.
“కోడలు అన్న మాటకు మీరు బాధ పడుతున్నారా?” అనడిగారు అన్నపూర్ణమ్మ గారు ఇంట్లోకి అడుగు పెడుతూనే.
“అదేం లేదులే అన్నపూర్ణ. ఇల్లు వదిలి చాలా కాలం అయింది కదా, గాలి మళ్ళింది” అంటూ మాట దాటేసారు కానీ ఆమెకు మాత్రం అర్ధం అయింది.
ఆ ఉదయం నలుగురికి బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి ఒక్కొక్క పళ్ళెం పట్టుకొస్తున్న తల్లిని చూసి కూతురు అడిగింది.
“ఒక్కో ప్లేటుకి ఒక్కోసారి తిరక్కపోతే అన్నీ ఒకేసారి తేవచ్చుగా?” అని.
“ఎలా తెస్తానే? నాకున్నవి రెండే చేతులు. అన్ని ప్లేట్లు, మంచి నీళ్ళ గ్లాసులు ఎలా తేవాలి?” విసుగ్గా అన్నది ఆ మనవరాలి అమ్మ.
“ఎలాగంటే నేను చూపిస్తాను” అంటూ తెచ్చిన ప్లేటు కూడా లోపలకు తీసుకువెళ్ళి ప్లేటు మీద ప్లేటు పెట్టుకుని రెండో చేత్తో వాటర్ బాటిల్ తీసుకొచ్చిన కూతుర్ని చూసి “ఈ సర్కస్ ఫీట్ల వల్ల ప్లేట్లు పడిపోతే?” అసహనంగా అన్నది ఆ పిల్ల తల్లి.
“ఎందుకు పడతాయ్? నానమ్మ గవ్వలాడేటప్పుడు ఒక గవ్వ ఎగరేసి కింద ఉన్న నాలుగు గవ్వలు పట్టుకుని అదే చేత్తో ఎగరేసిన గవ్వ కూడా పట్టుకునేది. రెండో చెయ్యి ఖాళీగానే ఉండేది. ఆట ఆడటం రావాలి” అన్న కూతురి మాటలు విన్న ఆమె ఒక్క క్షణం మాట్లాడలేదు, కూతురి వైపు ఆశ్చర్యంగా చూస్తూ.
లాక్ డౌన్ వల్ల పూర్తి స్థాయిలో వ్యాపారాలు సాగని కంపెనీలు సిబ్బందిని తగ్గించడం మొదలు పెట్టాయి.
ఆ దెబ్బ తన దాకా వస్తుందని ఊహించని కొడుకు ఆ రోజు ఉదయం మెయిల్ తెరవగానే కంపెనీ నుండి వచ్చిన మెయిల్ చూసి అవాక్కయ్యాడు.
‘వ్యాపారంలో పూర్తి స్థాయి కార్యక్రమాలు జరగడం లేనందున తన సర్వీసులు తాత్కాలికంగా అవసరం లేదు’ అన్న ఆ మెయిల్ సారాంశం చదివిన కొడుకు ఒక్కసారిగా కుదేలయినాడు.
భార్యకు విషయం చెప్పాడు. కోడలు కూడా తన ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటే భర్తను ఏమని ఓదారుస్తుంది?
ఇంతలో తమ ఎపార్టుమెంటు కాలింగ్ బెల్ మోగడంతో కోడలు తలుపు తీయడానికి వెళ్ళింది …. ‘ఈ మధ్య ఎవరింటికి ఎవరూ వెళ్ళడం లేదు. రావడం లేదు. మరి ఈ కాలింగ్ బెల్ ఏమిటో?’ అనుకుంటూ తలుపు తీసింది.
తమ కింద ఎపార్టుమెంటులోని వాళ్ళు. నిన్ననే వాళ్ళబ్బాయి తమ పిల్లవాడిని ఆటల్లో కొట్టడం, దాని మీద ఎపార్టుమెంటు సెక్రటరీకి కంప్లైంటివ్వడం జరిగాయి. ఆ నేపధ్యంలో ఆ పిల్లవాడి తల్లిదండ్రులిద్దరు ఆ పిల్లవాడితో పాటు రావడంతో కోడలు కంగారు పడింది, మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందేమోనని.
“లోపలకు రావచ్చాండి?” అంటూ మర్యాదగా అడిగేసరికి అన్యమనస్కంగానే దారి ఇచ్చింది కోడలు.
వస్తూనే ఆ పిల్లవాడి తండ్రి మాస్కు తీసేసి “మీ అబ్బాయిని కొట్టడం మావాడి తప్పేనండి. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి చెప్పడం ఎందుకంటే, ఇందాక మా వాడు సైకిలు తొక్కుతూ కింద పడి దెబ్బలు తగిలించుకుంటే మీ వాడు నిన్నటి గొడవ మనసులో పెట్టుకోకుండా మా వాణ్ణి లేపి దెబ్బ తగిలిన చోట కడిగి తులసి ఆకులు నలిపి ఆ రసం పూసాడట. ఇంత చిన్న వయసులోనే ఆ పిల్లవాడికి అలాంటి మంచి మనసు ఉండటం అనేది తల్లిదండ్రుల సంస్కారం” అంటూ నమస్కరించడంతో విస్తు పోవడం భార్యాభర్తల వంతయింది.
“మేం వెళ్ళొస్తామండి” అంటూ లేచారు ఆ వచ్చిన వాళ్ళు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి మనవడు ఇంట్లోకి వచ్చాడు.
“ఏరా, నిన్న నిన్ను కొట్టినవాడు కిందపడితే లేవదీసి మందు రాసావా?” అనడిగాడు కొడుకు.
“ఔను డాడీ, తాత గారు చెప్పారు కదా” అన్నాడు మనవడు.
“ఏం చెప్పార్రా?” అనడిగాడు తండ్రి.
“అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి’ అంటే మనకు అపకారం చేసినవాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే అప్పుడు వాళ్ళకు మన మీద ఉన్న కోపం పోయి మంచి ఫ్రెండ్సైపోతాం కదా?” అన్న తొమ్మిదేళ్ళ ఆ పిల్లవాడి మాటలు విని ఆశ్చర్యపోయారు కొడుకు, కోడలు.
తండ్రి ఆ తరువాత కూడా అన్యమనస్కంగా ఉండటంతో విషయం తెలియని మనవడు చెల్లి దగ్గర చేరాడు. తండ్రి తల్లికి ‘తన ఉద్యోగం పోయింద’ని చెప్పడం విన్న ఆ పిల్ల అన్నకు ఆ విషయం చెప్పేసింది.
పిల్లవాడు తండ్రి పక్కన కూర్చున్నాడు. తండ్రి ఎవరితోనో ఫోన్లో తన ఉద్యోగం విషయమై బ్రతిమలాడటం విన్నాడు.
తండ్రి చేతిలోనుండి ఫోను తీసేసుకున్నాడు పిల్లవాడు.
“మాట్లాడూతుంటే మధ్యలో లాగేస్తావేంట్రా? బుధ్ధుందా నీకు?” అని అరిచాడు తండ్రి ఉద్యోగం పోయిందనే బాధలో.
“డాడీ, నీ చిన్నప్పుడు ఎప్పుడూ స్నేక్స్ అండ్ లేడర్స్ ఆట ఆడలేదా? పైకి వెళ్ళేకొద్ది పెద్ద స్నేక్స్ ఉంటాయి. బైట్ చేస్తూనే ఉంటాయి. మళ్ళీ ట్రై చెయ్యాలి. లేడర్స్ ఉంటాయి డాడీ. ‘విన్ పాయింట్’ చేరేవరకు ఆట ఆడుతూనే ఉండాలి. మధ్యలో ఆట ఆపేయకూడదు డాడీ” అన్న కొడుకు మాటలు విన్న ఆ పిల్ల వాడి తల్లిదండ్రులు ‘పెద్దవాళ్ళను తొందర పడి పంపేసామా? అనుకున్నారు.
(ఇంటిలో ఉండే పెద్దలు తమ అనుభవాలను పిల్లలకు, ముఖ్యంగా మనవళ్ళు, మనవరాళ్ళకు నేర్పడం ఎంతో అవసరం. ఆనాటి ఆటలు కాలక్షేపం ఆటలు కావు. జీవితాన్ని నేర్పే ఆటలు. వాళ్ళతో ఆడాలి. ఆ ఆటలను జీవితానికి అన్వయించుకోవడం నేర్పాలి).
ఈ పోటీ ప్రపంచంలో అంత సానుకూలంగా ాఆల్ఓఓసిహించే ఆలోచించే సమయం ఎవ్వరికీ లేకుండా పోతోంది… ఇకనైనా అందరూ ఆలోచించాలి👍
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.