అర్థరాత్రికి అటు ఇటుగా పనులన్నీ ముగించుకుని నువ్వు పడుకోవటానికి రెడీ అవుతావ్ . నీ కుడిచేతిని ఎడం భుజం మీద ఆంచి, ఎడం చేయిని కుడి భుజం మీద ఉంచి మంచం మీదో చాప మీదో బోర్లా పడుకుని నీ తలని చేతుల మీద, చాతీ కింద దిండు పెట్టి ఓ క్షణం కనుపాపని కదలనీయకుండా కనురెప్పని కనుపాపకి తగలకుండా ఆలోచనలో పడతావ్. ఎటో వెళ్ళిపోయింది మనసు అంటూ గత జ్ఞాపకాల స్మృరుతులలోకి మెల్లగా..
నిజంగా నీ మనసు ఆ క్షణం నీ దగ్గర ఉండదు . ఎవరి దగ్గర అయితే నువ్వు ఆనందంగా ఉంటావో , ఎవరి దగ్గర నీ హృదయ స్పందన సంతోషంతో ఆరాధనా సవ్వడి చేస్తుందో అక్కడకి వెళ్లి కూర్చుంటుంది..
నీకు తెలియకుండానే నీ కళ్ళ కొలనుల్లోంచి ఓ కన్నీటి చుక్క ఉబికి వచ్చి చెంపలమీదకి జారిపోతూ నువ్వు ఎవరిని కోల్పోతున్నావో చెప్పకనే చెపుతుంది. చిన్న పిల్లల్లా తెలీకుండానే ఏడుస్తాం, యధాలాపంగా కనురెప్పలు ఒక్కసారి మూతపడి రెప్పల మాటున తన రూపం ఓ లిప్త పాటు మెరిసి మాయమవుతుంది…
జీవితంలో నువ్వు ఎంత డబ్బు సంపాయించు , నీ చుట్టూ ఉన్న బంధాలచేత వెల కట్టలేని ప్రేమ ఆప్యాయతలు పొందు, సంతోషాలు అనుభవించు. అవన్నీ ఒక ఎత్తు ఆ క్షణం నీ ఆ కన్నీటి చుక్కలో జ్ఞాపకమై మెరిసే రూపం ఒక ఎత్తు.
ఆ రూపానికి ఆ మనసుకి నువ్వు జీవితాంతం బానిసవే . తను నీ దగ్గర ఉంటే ఉండే ఆనందం ముందు ఇవన్నీ దిగదుడుపే. నువ్వు జీవితంలో ఏదైనా విలువైనది కోల్పోయావంటే తనే. వాళ్ళు ఎప్పటికీ నీ జీవితంలోకి రారు, వాళ్ళ జ్ఞాపకాలు నిన్ను విడిచి పోవు….
ఇంతే జీవితం. నీ కంట కన్నీటికి సాక్షం ఆ చీకటే. ఆ కన్నీటి వెల నీ జీవితమే.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.