Menu Close

ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నిన్ను నువ్వు బలపరుచుకునేందుకే – Moral Stories in Telugu Text – 351

చాలా ఏళ్లగా తీవ్రమైన సమస్యలతో సతమతమౌతున్న ఒక యువకుడు విసిగి వేసారి, అన్ని విడిచి పెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అన్నీ అంటే అన్నీ.. సమస్యలు, ఉద్యొగం.. తనని నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని, చివరికి దైవమిచ్చిన జీవితాన్ని కూడా విడిచి పెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.

చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవి లోకి వెళ్తాడు. “భగవంతుడా..! నేను ఇవన్నీ విడిచి పెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా” అని అడుగుతాడు.

Krishna-Hindu-God-Story-Birth-Festivals-temples

దానికి భగవంతుడు వాత్సల్యంగా.. “నాయనా..! ఒక్కసారి నీ చుట్టూ చూడు.. ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి, వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా..?”

“అవును.. కనిపిస్తున్నాయి.”

“నేను ఆ గడ్డి విత్తనాలు, వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి, నీరు సూర్యరశ్మి .. అన్ని అవసరమైనవి అన్నీ అందించాను.”

గడ్డి వెంటనే మొలకెత్తింది. భూమి పై పచ్చని తివాచి పరచినట్టుగా.. కానీ వెదురు మొలకెత్తనే లేదు. కానీ నేను వెదురును విడిచిపెట్టనూ లేదు. విస్మరించనూ లేదు. ఒక సంవత్సరం గడిచింది. గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది.. అందంగా ఆహ్లాదంగా..

కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు. రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు గడిచాయి.. వెదురు మొలకెత్తలేదు.. కానీ నేను అప్పటికి వెదురును విస్మరించలేదు.. ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది. గడ్డి కన్నా ఇది చాల చిన్నది.

కానీ ఒక్క ఆరు నెలలలో అది వంద అడుగుల ఎత్తు ఎదిగింది.. అందంగా బలంగా.. ఐదు సంవత్సరాలు అది తన వేళ్ళను భూమి లోపల పెంచుకుంది.. బలపరచుకుంది. పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి.

ఆ బలం వాటికి లేకపోతె వెదురు మనలేదు(నిలబడలేదు). నా సృష్టిలో దేనికీ కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను. ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ, ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నీ వేళ్ళను (మానసిక స్థైర్యాన్ని ) బలపరుస్తూ వచ్చాయి.

వెదురు మొక్కను విస్మరించలేదు. నిన్ను కూడా విస్మరించను. నిన్ను నువ్వు ఇతరులతో ఎన్నటికీ పోల్చుకోకు. రెండూ అడవిని అందంగా మలచినప్పటికీ.. గడ్డి లక్ష్యం వేరు.. వెదురు లక్ష్యం వేరు.. నీ సమయం వచ్చ్చినప్పుడు నువ్వూ ఎదుగుతావు..

భగవంతుడా..! మరి నేను ఎంత ఎదుగుతాను..?”

“వెదురు ఎంత ఎదిగింది? అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది.” “నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు..”

నీతి: భగవంతుడు ఎప్పుడూ.. ఎవరినీ.. విస్మరించడు.. విడిచిపెట్టడు. మనం కూడా భగవంతునిపై విశ్వాసాన్ని, మన ప్రయత్నాన్నీ ఎన్నటికీ విడిచి పెట్టకూడదు.

తప్పకుండా మీ మిత్రులకి షేర్ చెయ్యండి – Moral Stories in Telugu Text

Like and Share
+1
4
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading