ఇంద్రియ నిగ్రహం సాధ్యమా?

వ్యాస మహర్షి వేదాలను విభజించి లోకానికి అందించారు. అష్టాదశ పురాణాలను ప్రజల చేతిలో పెట్టిన వారు. ఎంతటి పండితుడైనా వినయవంతుడు. ఆ పరమ పూజ్యులు తన రచనలపై ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇచ్చే వారు. ఒకసారి ఒక పండితుడు ఆయన ఆశ్రమానికి వచ్చాడు. మహర్షి తాను రచించిన దాన్ని చదివి వినిపిస్తున్నారు.
బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి
అని వ్యాసుడు చదవగానే పండితుడు ఫక్కున నవ్వాడు. ఆ నవ్వులో వెక్కిరింపు స్పష్టంగా వినిపించింది. మహర్షి చదవడం ఆపి తల ఎత్తి చూశారు. పండితుడు మరొక్కసారి నవ్వి “విద్వాంసుని కూడా బలమైన ఇంద్రియ వ్యామోహం లాగేస్తుందని అన్నారు. విద్వాంసుడు అయినవాడికి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అంతటి వాడికి సుఖాలు అశాశ్వతం అని తెలిసే ఉంటుంది. అటువంటి వాడిని వ్యామోహం ఎప్పటికీ లాగ లేదు.
బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపకర్షతి
అని మార్చడం అభిలషణీయం. ఎంత బలమైన విషయాలైనా పండితులను రొంపికి లాగ లేవు.” అన్నాడు. మహర్షి “రేపు ఉదయం మీరే గ్రంథంలో మార్పు చేయండి. రాత్రి అయింది. మీకై కేటాయించిన కుటీరంలో విశ్రమించండి. మా శిష్యులు మీకు ఏర్పాటు చేసారు.” అన్నారు. పండితుడు కుటీరంలో పులిచర్మం పరచుకుని భగవన్నామ స్మరణ చేస్తూ పడుకున్నాడు. చినుకులు పడసాగాయి. కొద్దిగా మొదలైన వాన కుండపోతగా మారింది.
కుటీర ద్వారంవద్ద “అయ్యా ఆడదాన్ని అబలను. ఈ రాత్రికి ఆశ్రయం కోరుతున్నాను.” అని వినిపించింది. పండితులు దీపం తీసుకుని వెళ్లి చూశాడు. ఒక అమ్మాయి తడిసిపోయి చలికి వణికిపోతూ నిలుచుంది. అతడు “అమ్మా లోపలికి రా” అని పిలిచి తన వద్ద నున్న కాషాయాంబరాలు ఇచ్చాడు. ఆమె కుటీరం లోని రెండవ గదిలోకి వెళ్లి శరీరమూ తలా తుడుచుకొని కాషాయపు దుస్తులు ధరించి వచ్చింది. ఆమెను చూసిన పండితునికి కళ్ళు తిరిగాయి. కాషాయపు దుస్తులలో ఆమె కమలంలా ఉంది. ఆమె సౌందర్యం అతనిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
అతని హృదయాన్ని గ్రహించిన దానిలా ఆమె లోపలి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని పడుకుంది. పండితునికి కంటిపై కునుకు లేదు. పెదవులపై హరినామస్మరణ లేదు. హృదయంలో భగవంతుని రూపం లేదు. కోరిక కట్టలు తెంచుకుంది. గది తలుపు వేసి ఉంది. రెండు గదుల మధ్య నున్న గోడను కష్టం మీద ఎక్కి రెండవవైపు దూకాడు.

“సుందరీ కరుణించు.” అని ఆమెను దగ్గరగా తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం ఉలిక్కిపడ్డాడు. అతను దగ్గరగా తీసుకున్నది ఎవరిని?
నల్లని వాడు, ఎర్రటి కళ్లవాడు, జటావల్కలధారి, వ్యాసమహర్షి. సుందరి ఏదీ?
పండితుడు మహర్షి కాళ్లపై పడ్డాడు. “మహానుభావా, క్షమించండి. తమ రచనలో తప్పు వెతికిన పాపాత్ముణ్ణి. ఇంద్రియ వ్యామోహం ఎంతటి వాడినైనా ఎంత విద్వాంసునయినా తప్పకుండా లాగిపారేస్తుంది. నిగ్రహ సాధనకై ప్రయత్నిస్తాను.” మహర్షి చిరునవ్వు నవ్వి పండితుణ్ణి లేవనెత్తారు.