ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Health Benefits of Ashwagandha – అశ్వగంధ
అశ్వగంధ గురించి సంపూర్ణ వివరణ మరియు ఔషధ ఉపయోగాలు: అశ్వగంధ ని తెలుగులో “పెన్నేరు దుంప” అని పిలుస్తారు . దీనికి బల్య, వాజీకరి, కామరూపిణి అని రకరకాల పేర్లు కలవు. పెన్నేరు క్షుప జాతి చెట్టు. భూమి నుంచి 4 అడుగుల ఎత్తువరకు పెరుగును విశేషముగా కొమ్మలు కలిగి ఉండును. ఆకులు గుండ్రముగా ఉండును. ఆకులకు కొనలు కలిగి ఉమ్మెత్త ఆకుల వలే మందముగా ఉండును. తెల్లని పువ్వులు పూయును. కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండిన తరువాత ఎర్రగా ఉండును. కాయ యందు చాలా బీజాలు ఉండును.
దీనికి భూమిలో చిన్న ముల్లంగి దుంప వంటి దుంప పొడవుగా, మృదువుగా ఉండును. ఈ దుంపలను ఎండించి ఆవుపాలలో శుద్ధి చేసి ఔషధాలలో ఉపయోగిస్తారు. పెన్నేరు దుంప కారముగా, వేడిగా, చేదుగా, బలాకరంగా ఉండును. ఈ అశ్వగంధకు ఇండియన్ జెన్సాంగ్ అనే పేరు కలదు. అనగా భారత దేశపు యొక్క సర్వరోగ నివారిణి అని పిలుస్తారు . తెలుగులో కూడా ఒక సామెత కలదు. ” పేరులేని రోగానికి పెన్నేరే మందు ” అని ఒక నానుడి.
ఇప్పుడు అశ్వగంధ యొక్క ఔషధోపయోగాలు వివరిస్తాను.
- అశ్వగంధ యొక్క పచ్చి ఆకు రసం పూయుట వలన వ్రణాలు తగ్గును. గొంతు చుట్టు మాల వలే వ్రణాలు ఏర్పడే గండమాల అనే రోగం తగ్గును.
- రక్తమును శుద్ది చేయడం లో ఇది చాలా అద్భుతంగా పనిచేయును . కుష్టు, బొల్లి వంటి చర్మ సమస్యలతో ఇబ్బంది పడువారు చికిత్సా ఔషధాలతో పాటు దీనిని కూడా వాడుచున్న చర్మ సమస్యలు త్వరగా నివారణ అగును.
- శరీరములో వాతాన్ని పోగొట్టడంలో దీనికిదే సాటి.
- అశ్వగంధ వాడుచున్న త్వరగా ముసలితనం రానివ్వదు.
- శరీరం యొక్క కాంతిని పెంచును.
- అనేక రకాల వ్యాధుల వలన శరీరం బలహీనంగా అయ్యినవారు ఈ అశ్వగంధని వాడటం వలన మంచి శరీరపుష్టి వచ్చును. శరీరం నందు బలహీనత పోయి
బలవంతులుగా తయారగును. - మోకాళ్ల నొప్పులు, సయాటికా నొప్పులు, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన సమస్యల నుంచి త్వరగా విముక్తి
పొందుతారు.
- శరీరము నందు కఫం పెరిగి ఇబ్బంది పడే వారు అశ్వగంధని వాడటం వలన కఫ సంబంధ సమస్యల నుంచి విముక్తి చెందుతారు.
- పిండోత్పత్తి చేయు అవయవాలకు బలాన్ని ఇచ్చును. స్త్రీల గర్భాశయ దోషాలను నివారించి గర్భం ధరించే
అవకాశాలను పెంచును. - అశ్వగంధని నిత్యం వాడుట వలన శరీరం నందలి టాక్సిన్స్ మరియు వ్యర్ధ పదార్ధాలను బయటకి వెళ్లునట్లు చేసి శరీరమును శుద్ది చేయును .
- అశ్వగంధ యొక్క పచ్చి దుంపను నూరి కట్టినను లేదా ఎండు దుంపను నీటితో నూరి కట్టినను మానని మొండి వ్రణాలు మానును .
- అశ్వగంధ ఆకులకు ఆముదం పూసి వెచ్చచేసి కట్టిన రాచపుండ్లు, గడ్డలు కరిగిపోవును.
- అశ్వగంధ ఆకుల యొక్క పలచటి కషాయం లొపలికి ఇచ్చుచున్న జ్వరాన్ని హరించును.
- మూత్రం బిగించి పొట్ట ఉబ్బి ఉన్న సమయంలో అశ్వగంధ పండ్లు తినిపించిన మూత్రం ధారాళంగా బయటకి వెడలును .
- నిద్రపట్టక బాధపడువారు అశ్వగంధ చూర్ణమును, ఆవునెయ్యి, పటికబెల్లం చూర్ణం మూడు సమాన బాగాలుగా తీసుకుని లేహ్యములా కలుపుకుని తినుచున్న సుఖవంతమైన నిద్రని తెచ్చును.
- బలం లేక ఎండిపోతున్న పిల్లలకు శుద్ధి చేసిన పెన్నేరు చూర్ణం పాలలో కలిపి ఇవ్వవలెను. సంవత్సరం దాటిన పిల్లలు అయితే తేనెతో లేదా దేశవాళి ఆవునెయ్యితో ఇచ్చుచుండిన కృశించిన పిల్లలు బలిష్ఠులుగా తయారగును.
- పక్షవాతంతో బాధపడువారు ఈ అశ్వగంధ చూర్ణమును ఉదయం మరియు సాయంత్రం రెండుపూటలా తీసుకొనుచున్న నరాలకు సత్తువ చేయును.
- అతిరక్తం, తెల్లబట్ట వంటి సమస్యలతో బాధపడు స్త్రీలు ఈ అశ్వగంధ చూర్ణంను వాడుట వలన శారీక బలహీనతలు పోయి సమస్య నుంచి బయటపడుదురు.
ఈ అశ్వగంధ మరెన్నో రోగాలకు అద్భుతమైన ఔషధంగా పనిచేయును . - థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ ఔషధం వాడుట వలన మంచి ఫలితాలు వచ్చును.
ఇప్పటివరకు మీకు చెప్పిన ఫలితాలు అన్నియు శుద్ధిచేసిన అశ్వగంధ వాడినప్పుడే వస్తాయి. 11 సార్లు నాటు ఆవుపాలతో మాత్రమే శుద్ది చేయవలెను. బయట మార్కెట్లో దొరికే అశ్వగంధ చూర్ణం పొలాల్లో నుంచి తీసుకొచ్చి చూర్ణం చేసినటువంటిది. అలాంటి చూర్ణం కేవలం 40 % ఫలితాలు మాత్రమే ఇస్తుంది నూటికి నూరు శాతం ఫలితాల కోసం శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణం మాత్రమే వాడవలెను.
బయట దొరికే చూర్ణం లేత కాఫీ రంగులో ఉండును. శుద్ది చేసినది తెల్లగా, క్రీం రంగులో ఉండును. శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణం అనుభవ ఆయుర్వేద వైద్యుల ద్వారా చేయించుకొని మాత్రమే వాడవలెను. ఖరీదు కొంచం ఎక్కువుగానే ఉండును.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.