Menu Close

Health Benefits of Myrobalan – Karakkaya – కరక్కాయ

Health Benefits of Myrobalan – Karakkaya – కరక్కాయ

కరక్కాయ అందరికి సుపరిచితమే. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. కరక్కాయ ఐదు రసములతో కూడుకుని ఉన్నదిగా, జఠరదీప్తిని పెంచునిదిగా, బుద్ధిబలముని ఇచ్చునిధిగా, నేత్రములకు మేలుచేయునిదిగా ఆయుర్వేదం పేర్కొన్నది. కరక్కాయ ఆయుర్వృద్ధిని ఇచ్చును. ధాతువుని వృద్ధిచేయును. కడుపులోని వాయువుని బయటకి పంపును. శ్వాసని, దగ్గును, ప్రమేహమును, మొలలను, కుష్ఠును, గొంతులోని నంజును తగ్గించును. ఉదరమును శుద్ధిచేయును. బొంగురుగొంతును మంచిగా చేయును.

Health Benefits of Myrobalan - Karakkaya - కరక్కాయ

గ్రహణి రోగమును నయం చేయును . మలబద్దకం పోగొట్టును. విషమజ్వరమును నయం చేయును కడుపులోని గుల్మాలను పోగొట్టును . కడుపుబ్బరం పోగొట్టును. దాహమును, వాంతిని, ఎక్కిళ్ళను, దురదని, గుండెజబ్బుని, కామెర్లని, నొప్పిని, ప్లీహారోగమును నయం చేయును. మూత్రకృచ్చం, మూత్రఘాతరోగం ని నయం చేయును.

శరీరంలోని పిత్తమును హరించును. కరక్కాయకి పులుపుదనం ఉండటం చేత వాతమును హరించును . తీపి, చేదు రసములు ఉండటం చేత పిత్తము హరించబడును . కారం వగరు రసం కలిగి ఉండుటచేత కఫమును హరించును. ఈ విధంగా కరక్కాయ త్రిదోష హరమైనది. పైన చెప్పిన విధముగా అయిదు రకాల రుచుల కరక్కాయలో సమ్మిళితం అయి ఉంటాయి.

కరక్కాయ పప్పునందు మధురరసం, యేశల యందు పులుపురసం, బెరడు నందు చేదురసం, చర్మం యందు కారంగా, గింజపైన పేడు యందు వగరు రసం కలిసి ఉంటాయి.

Different Types of Karakkayalu

అందరూ కరక్కాయ ఒకే రకం అనుకుంటారు . కాని కరక్కాయలో 7 రకాలు ఉన్నాయి. వాటిగురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.
విజయ, రోహిణి, పూతనా, అమృతా, అభయా, జీవంతి, చేతకి ఈ విధంగా 7 రకాలుగా ఉండును.

ఇప్పుడు మీకు వీటి గురించి వివరిస్తాను. విజయ కరక్కాయ వింధ్య పర్వతం పైన పుట్టుచున్నది. చేతకి కరక్కాయ హిమాలయ పర్వతముల యందు జనించును. పూతనా కరక్కాయ సింధూనది ప్రాంతముల యందు పుట్టుచున్నది. రోహిణి కరక్కాయ అన్ని ప్రాంతములలో పుట్టును. అమృత కరక్కాయ, అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టును. జీవంతిక కరక్కాయ మహారాష్ట్ర నందు పుట్టును.

లక్షణాలను బట్టి కరక్కాయ జాతి కనుగొనుట సొరకాయవలె పొడువుగా ఉండునది విజయ కరక్కాయ, గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ, బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ, బీజములు చిన్నవిగా ఉండి పైన పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ, అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ, బంగారు రంగుగా ఉండునది జీవంతిక కరక్కాయ, మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ.

పైన చెప్పిన విధముగా తగు జాగ్రత్తతో బుద్దిని ఉపయోగించి కరక్కాయలోని జాతిభేదాలు తెలుసుకొనవలెను.

How to Use Karakkayalu

కరక్కాయ ప్రయోగవిధి: విజయ కరక్కాయ సర్వరోగముల యందు ఉపయోగించవచ్చు . రోహిణి కరక్కాయ వ్రణములను హరించునది. పూతన కరక్కాయ లేపన క్రియల యందు ఉపయోగించవచ్చు. అమృత కరక్కాయ శరీర శోధన కొరకు వాడొచ్చు . అనగా విరేచనములు ద్వారా శరీరంలోని వ్యర్ధాలను బయటకి పంపు ప్రక్రియలో వాడవచ్చు . అభయ కరక్కాయ నేత్ర రోగముల యందు వాడవచ్చు . జీవంతిక కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకి కరక్కాయ చూర్ణములకు ప్రసిద్ధి.

చేతకి కరక్కాయలో మరలా రెండు రకములు కలవు. తెలుపు రంగు, నలుపు రంగు. తెల్ల చేతకి కరక్కాయ ఆరంగుళముల పొడవు ఉండును. నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళం పొడవుగా ఉండును. చేతకి కరక్కాయ చెట్టు కింద యే మనుష్యులు కాని లేక పశు పక్ష్యాదులు కాని తిరిగిన తక్షణం విరేచనాలు కలుగును. చేతకీ కరక్కాయ హస్తము నందు ఎంతవరకు ఉంచుకొందునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనాలు అగును.

చేతకీ కరక్కాయ సుకుమారులు, బలహీనులు, ఔషదం నందు ద్వేషం కలిగినవారు చేత పట్టకూడదు. ఇది అతి ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించును.
కరక్కాయలో ఏక కరక్కాయ ప్రశస్తమైనది జిగట కలిగి ఉండి, గుండ్రంగా ఉండి బరువు కలిగి నీటిలో వేసిన మునిగినచో అది ప్రశస్తమైనదిగా గుర్తించవలెను. బరువు 20 గ్రాములు ఉండవలెను .

కరక్కాయని ఋతువులలో ఉపయోగించు విధానం: కరక్కాయని వర్షఋతువు యందు సైన్ధవ లవణం చేర్చి, శరదృతువు నందు పంచదార చేర్చి, హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి, శిశిర ఋతువు నందు పిప్పిలి ని చేర్చి వసంత ఋతువు నందు తేనెని చేర్చి, గ్రీష్మఋతువు నందు బెల్లము చేర్చి లోపలికి తీసికొనవలెను.

Medical Values in Karakkaya – కరక్కాయలోని ఔషధ గుణాలు

  • కరక్కాయని నమిలి పుచ్చుకొనిన జఠరదీప్తిని కలిగించును. నూరి పుచ్చుకొనిన విరేచనం కలిగించి మలాశయం శుద్ది చేయును .
  • కరక్కాయ వేయించి తినిన త్రిదోషములను హరించును .
  • కరక్కాయను భోజనంతో పాటు పుచ్చుకొనిన బుద్ధిబలమును పెంచును. శరీర బలమును కలిగించును. పిత్తమును, కఫమును, వాతమును నిర్మూలించును.మలము, మూత్రములను దేహము నుంచి వెడలగొట్టును.
  • కరక్కాయని భోజనాంతరం తినిన అన్నపానములు
    వలన కలిగిన దోషములను నివారించును. వాత పిత్త కఫ సంబంధ దోషములను నివారించును.
  • కరక్కాయను లవణము తో చేర్చి భక్షించిన కఫమును, పంచదారతో చేర్చి భక్షించిన పిత్తమును, నెయ్యితో చేర్చి భక్షించిన వాతరోగములను, బెల్లముతో చేర్చి పుచ్చుకొనిన సర్వరోగములను హరించును .
  • కరక్కాయ విత్తనపు చూర్ణం నేత్రములకు బలం చేకూర్చును, వాతాన్ని, పిత్తాన్ని హరించును.
  • కరక్కాయ నుంచి తీయు తైలం చర్మరోగ నివారణగా ఉండును. సర్వరోగాలను నివారించును. కరక్కాయ పుచ్చుకోకూడనివారు –
    నడిచినడిచి అలసిపోయినవారు, బలహీన శరీరం కలిగినవారు, చిక్కి శల్యమైన వారు, ఉపవాసం వల్ల బలహీనం అయినవారు, శరీరం నందు అమిత వేడి కలిగినవారు, గర్భవతులు, రక్తం తీయబడిన మనుజులు కరక్కాయను సేవించరాదు .

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading