ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పారేసుకున్న క్షణాలు ఎంత విలువైనవో – Telugu Short Stories
ఒక రైతు తన పొలాన్ని పంట వేయడానికి నాగలితో సిద్ధం చేస్తూండగా ఏదో తగిలింది. తవ్వి చూస్తే ఒక పెద్ద పెట్టె దొరికింది. పెట్టెను తెరిచాడు. అన్నీ బొగ్గులాంటి నల్లని రాళ్ళు కనిపిస్తే, రైతు చాలా నిరాశ చెంది, ఈ రాళ్లు పక్షులను తరమడానికి పనికివస్తాయిలే, అనుకున్నాడు. పంట కోతకు వచ్చింది, పక్షులు కూడా గింజలు తినడానికి వచ్చాయి.
ఆ నల్లని రాళ్ళు విసురుతూ పక్షులను తరిమాడు. ఒకరోజు రత్నాల వ్యాపారి ఒకరు ఆ దారిన పోతూ, రెండు నల్లని రాళ్లను చూసాడు. ఆశ్చర్యపోయి వర్తకుడు ఆ రాళ్లను రైతు దగ్గరకు తీసుకొచ్చి ‘ఈ రాళ్లను ఒక్కొక్కటి 5000 రు.లకు అమ్ముతావా’ అని అడిగాడు. వర్తకుడు హేళన చేస్తున్నాడని అనుకొని ‘అమ్మను’ అన్నాడు.
అయితే ఆ వర్తకుడు ‘పోనీ ఒక్కొక్కటి 50 వేలకు అమ్ముతావా! ఇవి అపురూపమైన వజ్రాలు!’ అన్నాడు. ‘అయ్యో!! ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ విసిరేసానే.’ అంటూ ఏడ్చాడు.
నిజానికి ప్రతి క్షణం విలువైనది. ఈ రోజుల్లో నిర్లక్ష్యంగా అపురూపమైన క్షణాలను విసిరేస్తున్నాం. ‘భవిష్యత్తులో ఈ పారేసుకున్న క్షణాలు ఎంత విలువైనవో.’ తెలుస్తుంది, కానీ అప్పటికి సమయం మించిపోతుంది. సమయాన్ని వివేకవంతంగా సద్వినియోగం చేసుకోవాలి. మన సమయాన్ని సెల్ఫ్ ఆడిట్ చేసుకుని ఎక్కడ సమయం వృధా అవుతోందో, మన ప్రాముఖ్యతలేమిటో, వాటి సాధన కోసం ఏం చేయాలో తెలుసుకోవాలి. కాలం చాలా విలువైనది.
సేకరణ – V V S Prasad