Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu
నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి
బెస్తవాడు – భూతం
అనగా అనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్రపు ఒడ్డుకు పోయి నాలుగు సార్లు వల వేసేవాడు. ఆ నాలుగుతూర్లకు ఏవి దొరికితే అవి తీసుకుని బజారుకు పోయి అమ్ముకుని, ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు.
ఒక్కొక రోజున ఒక చేపైనా దొరికేదికాదు. అయినా వాడు “ఇవ్వాళ నాకు దేవుడు ఏమీ యివ్వలేదు,” అనుకుని తృప్తిగానే యింటికి వెళ్లేవారు. ఒకరోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు. మొదటి సారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది. రెండోసారి వేశాడు ఎండ్ర కాయలు పడ్డాయి. మూడో సారి వేశాడు, బొమ్మరాళ్లూ, నత్త గవ్వలూ వచ్చినాయి. నాలుగోసారి దేవుణ్ణి తలచుకుంటూ మళ్లీ వలవేశాడు ఒక ఇత్తడి కూడా దొరికింది.
వాడు అదిచూసి చాలా సంతోషించాడు. “ఇది అమ్ము కుంటే నూరుచేపల ఖరీదన్నా రాక పోతుందా?” అనుకున్నాడు. కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టివుంది. అది చూడగానే వారికి ఒక ఆలోచన కూడా తట్టింది. ఈ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకుని వుండ కూడదా, అనుకున్నాడు. అనుకుని వాడు తాడు విప్పాడు. తాడు తీసివెయ్యగానే మూత దానంతటదే ఎగిరివచ్చింది. బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు.
అతనికి దాంట్లో పొగతప్ప మరేమీ కనిపించలేదు. కాని, క్రమంగా అది బయటికి రా సాగింది. అది అట్లా వచ్చి అట్లావచ్చి ఆకాశం ఎత్తుకు పోయింది. ఆ తర్వాత ఆ పొగంతా ఒక చోట చేరి పెద్ద భూతమైంది.
పాపం, బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి, పారిపోదామనుకున్నాడు. కాని, భూతం పోనివ్వలేదు. “ఓ! రాజా! నీ మాట ఇక ఎప్పుడూ వింటాను, రా!” అని బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది. “ఎవర్ని నువ్వు పిల్చేది . నేను రాజును కాను.” అన్నాడు. “నువ్వు సాలమన్ రాజువుకాదా?” అని అడిగింది భూతం. “ఉహుఁ, ఆ రాజు వెయ్యేళ్ల కిందనే చచ్చిపోయాడు. నేను బెస్తరాజుని.”
ఈమాట విని భూతం ఆకాశం దద్దరిల్లేట్లుగా నవ్వి, “బెస్తరాజువా నువ్వు! ఐతే వుండు నిన్ను తిన బోతున్నాను.” అన్నది. బెస్తవాడు గజగజ వణకుతూ, “నన్ను చంపుతావా ? ఎందుకు ? నిన్ను ఈ కూజాలోనుంచి వదలి పెట్టినందుకా ? నేను చేసిన మేలుకు ఇదేనా నువ్వు చేసే సహాయం?” అన్నాడు. “ఆ ! ఇదే. నిన్ను తినక తప్పదు. అయితే నీ ఎలాగూ చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో… నీకు ఆ వరం ఇస్తాను.
“అయితే నీ కథ తెలుసుకోవాలని వుంది, చెప్పు.” అన్నాడు బెస్తవాడు. “విను, చెప్తాను. పూర్వం నేను మంచిభూతాన్ని, సాలమన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించాడు. బంధించి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పారేయించాడు. నేను అప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఈ కూజాలో నుంచి వదిలి పెడితే వాడికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను చాలాకాలం.
ఎవ్వరూ రాలేదు. ఇక నాకు కోపం వచ్చింది. ఈ సారి ఎవరైనా వచ్చి నన్ను వదిలి పెడితే వాడిని చంపుదామనుకున్నాను. నువ్వు వచ్చి వదిలించావు. నిన్ను నేను చంపక తప్పదు. “ఇక భూతాన్ని బ్రతిమాలినా లాభం లేదు, అనుకున్నాడు బెస్తవాడు. వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. “ఓ భూతమా! నీమాటలు నేను నమ్మలేకుండా వున్నాను.
అంతా అబద్ధంగా తోస్తున్నది. ఇంత పెద్ద భూతానివి. ఈ కాస్త కూజాలో వున్నావంటే ఎట్లా నమ్మేది? నా కళ్లతో చూస్తేగాని నేను నమ్మ లేను.” అన్నాడు బెస్తవాడు. ఈ సారి భూతం మోసపోయింది. “అలాగా…నన్ను నమ్మలేవా! ఐతే ఉండు చూపిస్తాను.” అని ఆ భూతం మళ్లీ పొగగా మారి కూజాలోకి పోయింది. పోయి, “యిప్పుడు నమ్ముతావా నామాట?” అని అడిగింది.
“కాసేపు ఆగు…సరిగా చూడనివ్వు నన్ను” అని బెస్తవాడు గబుక్కున కూజాకు మూత పెట్టి తాడుతో గట్టిగా బిగించి పార వేశాడు. లోపలనుంచి భూతం లబలబలాడ మొదలెట్టింది – “ఓ బెస్తరాజా! నన్ను వదిలి పెట్టు. నిన్ను ఇక చంపను, నీకెంతో ధనమిస్తాను.”
” నేను నీ మాట నమ్మను, ” అన్నాడు బెస్త రాజు. “భేతాలుడి తోడు…నిన్ను ఏమీ చెయ్యను.”కూజాలోంచి మళ్లీ బయటికి వచ్చి కూజాను ఒక్క తన్ను తన్నింది. కూజా ఎక్కడో సముద్రం మధ్యనపోయి పడింది. అప్పుడు భూతం బెస్తరాజుతో అన్నది. “నీ వల తీసుకుని నా అరిచేతిలోకి ఎక్కి కూర్చో… నిన్ను మంచి చోటుకు తీసుకుపోయి వదిలి పెడతాను.
“బెస్తవాడు అలాగే అరిచేతిలోకెక్కి కూర్చున్నాడు. భూతం అతన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది. కొండలూ, నదులూ, అడవులూ ఎన్నో దాటి ఆఖరుకు ఒక లోయ దగ్గిరకి వచ్చి దిగింది. అక్కడ ఒక మంచి చెరువుంది. నీళ్లు అద్దంలాగా తెల్లగా వున్నాయి. భూతం బెస్తవాడితో, “నువ్వు రోజూ ఇక్కడ ఒక్కసారి వల వేసుకో… నాలుగు చేపలు పడతాయి అవి తీసుకెళ్లి పక్క రాజుకు అమ్ముకో. అతను నీకు బోలెడు డబ్బిస్తాడు. నీకిక దరిద్రం ఉండదు.” అన్నది.
తర్వాత భూతం నేలను ఒక్క తన్ను తన్నింది. భూమి రెండుగా బ్రద్దలైంది. భూతం దాంట్లోకి పోయింది. భూమి మళ్లీ మూసుకుంది. ఆ బెస్తవాడు రోజూ అక్కడకొచ్చి వల వేసేవాడు. నాలుగు రంగుల్లో నాలుగు చక్కటి చేపలు పడేవి. అవి తీసుకెళ్లి పక్కనున్న రాజు కిచ్చేవాడు. ఆరాజు వాటికి 400 మొహరీలు యిచ్చే వాడు. పల్లెవాడి దరిద్రం తీరింది. హాయిగా భార్యతో బిడ్డల్తో బ్రతుకు తున్నాడు.