ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu
నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి
అబ్బబ్బా…!!! ఎంత అందంగా ఉందో చూడండి ఆరుబయట వెన్నెలకాంతి, మాఘమాసపు ఈ శుక్లపక్ష చంద్రుడ్ని చూస్తూంటే కాళిదాసు రాసిన ” కుమారసంభవం ” లోని చంద్రోదయ వర్ణన రాయాలనిపిస్తోంది నాకు….
పార్వతీదేవితో వివాహం అయ్యాక పరమశివుడు అత్తవారి ఇంటినుంచి వీడ్కోలు తీసుకుని సురతక్రీడకై పార్వతీదేవితో కలిసి ” మలయపర్వతం” పై విహరిస్తూ ఉంటాడు…
అక్కడా చంద్రశేఖరుడు ఆ పర్వతరాజ పుత్రికతో క్రీడిస్తూ ఒకనాటి సాయంసంధ్యావేళ ” గంధమాదవనం ” లో ప్రవేశించి బంగారుశిలలపై కూర్చుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తాడు ఆమెతో కలిసి… ఆ తర్వాత ఆయన సంధ్యావందనం చేసుకోడానికని బయటకువెళ్ళి కాసేపటి తర్వాత తిరిగి పార్వతీదేవి దగ్గరకు వచ్చే సమయానికి పార్వతిదేవి ఆయన తనని ఒంటరిగా వదిలి ఎడబాసివెళ్ళాడని అలిగి కోపంతో మాట్లాడకుండా కూర్చుని ఉంటుంది… అప్పుడు శంకరుడు ఆమెను పలకరించి అనునయంగా,, ప్రేమగా మాట్లాడుతూ ఆ మాటల మధ్యలో ఎదురుగా కనిపించిన చంద్రోదయాన్ని చూసి ఇలా వర్ణిస్తాడు…
” రాత్రి చీకటిని పారద్రోలడానికై తూర్పు దిశన చంద్రుడు ఉదయిస్తున్నాడు. మొగలిపూలు విచ్చినట్లు ప్రాగ్దిశన తొలిరేకులు విచ్చుకుంటున్నాయి.
నక్షత్రయుక్తమైన ఈ రాత్రి, ఇంతవరకూ మందరపర్వతంలో దాగిఉండి ఇప్పుడే ఉదయించిన చంద్రునితో కలిసి, నీవు నీ సఖులతో కూడి నాతో ముచ్చటిస్తున్నట్లు కనిపిస్తున్నది !
చంద్రుడు వెన్నెల నవ్వు నవ్వుతున్నాడు చూశావా? ఈ లేత వెన్నెల వెలుగులు కొనగోళ్ళతో త్రుంచి నీకు కర్ణాభరణాలు చేయవచ్చు సుమా ! వ్రేళ్ళతో కురులను సవరిస్తున్నట్లు చంద్రుడు తన కిరణాలతో చీకటిని తొలగత్రోసి, ముకుళిత పద్మలోచన అగు రాత్రి ముఖాన్ని ముద్దాడుతున్నాడు !!
పార్వతీ ! ఆకాశంవంక ఒకమాటు చూడు ! చంద్రుని లేత వెన్నెలలో చీకటి తెరలు తొలగిపోగా ఆకాశం, ఏనుగులు కలచివేసిన పిమ్మట నిశ్చలంగా ఉన్న మానససరోవరంలా కనిపిస్తున్నది ! ఉన్నత ప్రదేశాలలో వెన్నెల వెలుగులు అలముకున్నాయి. పల్లపు ప్రాంతాలలో చీకట్లు పరుచుకున్నాయి, అవునుమరి, గుణదోషాలను బట్టి సృష్టికర్త ఉచ్చనీచలు కల్పిస్తూ ఉంటాడు !!!
చెట్టు కొమ్మల సందులగుండా,ఆకుల మధ్యగుండా పువ్వులవలే నేల వ్రాలుతున్న చంద్రకిరణ కోమలరేకలను, వ్రేళ్ళతో పట్టి నీ మ్రుంగురులకు కట్టివేయవచ్చు సుమా !!!! “
అని అంటూ మెల్లమెల్లగా ఆమె కోపాన్ని తగ్గించి తనతో ఆమె ప్రియంగా మసులుకునేట్లు చేస్తాడు – ఆ తర్వాత కధను కూడా ఇంకా చక్కటి వర్ణనలతో వివరిస్తాడు కాళిదాసు మొత్తం అ కావ్యంలో…
ప్రస్తుతానికి ఇంత వరకూ వర్ణనే పోస్ట్ చేస్తున్నాను… ఇలాంటి చక్కని ఘట్టాలు ఇంకెప్పుడైనా వివరంగా రాస్తాను
కాళిదాసు రాసిన ఈ వర్ణన చదువుతూంటే ఆ చంద్రోదయం మన కళ్ళముందే కనపడుతున్నట్లు, దానిని ఆస్వాదిస్తునట్లు ఉంది కదూ?
అదీ కాళిదాసు గొప్పదనం… కవిత్వం రుచి మరిగేట్లు చెప్పడంలో ఈయనను మించిన కవిలేడంటే అతిశయోక్తి కాదుకూడా…. సాహిత్యంపై అభినివేశం కల్పించుకోవాలనుకునే ప్రతీ వ్యక్తీ తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు ఆయనవి
అవకాశం ఉంటే తప్పకుండా చదవండి ఆయన రచనలను
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com