Menu Close

నా ఇల్లమ్మి పెడతావా ప్రసాద్‍!-జీవిత చరమాంకంలో పీవీ నరసింహారావు-Telugu Stories

‘‘ప్రసాద్‍. నాకోచిన్న సహాయం చేయాలయ్యా!’’ అంటూ హైదరాబాద్ రాజ్‌భవన్‌లో పివి నన్ను అడిగారు.
‘జార్ఖండ్‍ ముక్తి మోర్చ పార్టీ ఎం.పీలకు ముడుపులు’ కేసు వాదోపవాదాలు ముగిసి, ఆ కేసులో కూడా పి.వి.నరసింహారావుని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఈ తీర్పు వచ్చిన కొన్ని రోజులకే పి.వి.గారు హైదరాబాద్‍ వచ్చారు. అప్పుడు నాతో అన్నమాటలివి.
‘‘ఇక్కడ జూబ్లీహిల్స్‌లో నాకో ఇల్లుంది. తెలుసుగదా! ఆ ఇల్లు అమ్మిపెట్టాలయ్యా’’
‘‘అంత అవసరం ఏమొచ్చింది సర్‍! మాజీ ప్రధానమంత్రిగా మీకు నివాస గృహాన్నీ, నౌకర్లనీ ప్రభుత్వమే ఇస్తుంది. వైద్యసదుపాయం ఉంటుందీ. నెలనెలా పెన్షన్‍ వస్తుంది….’’ అంటూ నసిగాను.
ఆయనకేమీ పెళ్ళికావలసిన కూతుళ్ళూ లేరు. నాకు తెలిసి ఆయన ఎవరిదగ్గరా భారీగా అప్పుచేసిన దాఖలాలు లేవు. ఏదన్నా ఇబ్బంది పడివుంటే ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పడ్డారు.


కొడుకుని చదివించటానికి అల్లుడు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. కూతుర్ని మెడిసన్‍ చదివించడంకోసం ఫీజుకట్టడానికి ఇబ్బంది పడాల్సివచ్చింది. కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయటానికి కూడా చాలా అవస్థలు పడాల్సివచ్చింది. … పోనీ, ముఖ్యమంత్రిగా చేసిన నాటికి అంత రాజకీయపరిణతి లేదు అనుకున్నా, ఆ తరువాత కేంద్రంలో చాలా పదవుల్లో వున్నారు కదా! అవి కూడా ఏదో పనికిమాలిన పదవులూ కాదు, సహాయమంత్రి, ఉపమంత్రి పదవులూ కాదు. క్యాబినెట్‍ హోదావున్న మంత్రి పదవులే. దేశీయాంగశాఖ, విదేశాంగ శాఖ, మానవవనరులశాఖ. ఇంకా కాంగ్రెసు పార్టీలో కార్యదర్శి, ప్రధానకార్యదర్శి పదవులు కూడా చేశారు. 1991 నుండి అయిదేళ్ళపాటు ప్రధానమంత్రి పదవి కూడా చేశారు. ఇన్ని పదవులు అనుభవించిన వ్యక్తికి తనకున్న ఒకేఒక్క ఇల్లు అమ్ముకోవాల్సిన అగత్యం ఏమిటి?
‘‘… అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటపడ్డానంటే నాకోసం ఎవరెవరో వకీళ్ళు నా తరఫున కోర్టుల్లో వాదిస్తేనే గదా! వాళ్ళెవరూ నా దగ్గర ఫీజు అడ్వాన్సు అడగలేదు. నేనెప్పుడు ఏమిస్తే అదే పుచ్చుకున్నారు. అదైనా ఎలా ఇచ్చాను. పదవిపోయాక ‘ఇన్‍సైడర్‍’ పుస్తకం రాస్తే, దానిమీద వచ్చిన రాయల్టీని వాళ్ళకిచ్చేస్తూ వచ్చాను. ఇంకా ఇవ్వాల్సింది – నా అంచనాల ప్రకారం లక్షల్లో ఉంది. వాళ్ళకి ఫీజు ఇవ్వకుండా, బాకీ తీర్చకుండా చనిపోతానేమోనని భయంగా ఉందయ్యా…’’
నిర్ఘాంతపోయాను. ఎలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు?


ఆయన అయిదేళ్ళలో ఆర్థిక దుస్థితి నుంచి ఈ దేశాన్ని గట్టెక్కించి, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో ప్రపంచం అంతా అబ్బురపడేలా వినూత్న ప్రగతిమార్గంలో నడిపించాడు. భారతదేశాన్ని ఈ 60కోట్ల జనాభా గర్వపడే ఒక వైభవదశలోకి మలుపుతిప్పాడు. అలాంటి మేధావి, రాజనీతివేత్త నన్ను అభ్యర్థిస్తున్నారు – ప్లీడర్లకి ఫీజులు చెల్లించటం కోసం తనకున్న ఒకే ఒక ఇల్లు అమ్మిపెట్టాలని!!
ఆయన సొంత విషయాలు ముఖ్యంగా కుటుంబసభ్యుల విషయాలు, రాబడీఖర్చులూ వగైరా విషయాలన్నీ ఆయన దగ్గర ఆఫీసర్‍ ఆన్‍ స్పెషల్‍ డ్యూటీ (••ణ) గా వున్న ఎ.వి.ఆర్‍.కృష్ణమూర్తి చూసుకుంటూండేవాడు. నేనెప్పుడూ ఈ ఇంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
‘‘వున్న ఒక్క ఇల్లూ అమ్మేస్తే శేష జీవితం గురించి కూడా ఆలోచించాలి గదా…’’
‘‘ఏముంది ఆలోచించటానికి! పిల్లలందరికీ వాళ్ళ వ్యాపకాలు వాళ్ళకున్నాయి. వాళ్ళెవరూ నాతో వుండనఖ్కర్లేదు. నేనొక్కణ్ణీ ఉండటానికి ఎన్ని గదులు కావాలి? తినాలన్నా ఎన్ని తినగలను? పప్పు, అన్నం చాలు… మాజీప్రధానమంత్రి హ•దాలో అవెలాగూ లభిస్తాయి కదా! అయినా ఒంటరిగా ఉండటం అలవాటై పోయింది. నా అనుభవాలన్నీ పుస్తకాల రూపంలో రాయాలను కుంటున్నానయ్యా. ఒకవేళ ఏదన్నా జబ్బు చేసినా మాజీ ప్రధాని అనే ముద్ర ఒకటి ఉంది కాబట్టి, నడిచి పోతుందిలే…’’


ఎంత సులువుగా చెబుతున్నాడీయన…. నేనిలా ఆలోచిస్తుంటే మళ్ళీ ఆయనే అందుకున్నారు.
‘‘అమ్మేస్తే మంచి రేటు వస్తుందంటావా? … రాకపోయినా ఫరవాలేదయ్యా. ఏదో ఒకరేటుకి అమ్మేసి ప్లీడర్లందరి బాకీలు తీర్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్రస్తుతం మన కృష్ణమూర్తి కొడుకు ప్రసాదే ఆ ఇంటి విషయం చూస్తున్నాడు. నువ్వుకూడా పూనుకుంటేనే త్వరగా అవుతుందనిపిస్తోంది. …ఇప్పుడు నేను రాసిన రెండు పుస్తకాలు రెడీగా ఉన్నాయి. అవి ఎప్పటికి అచ్చయి మార్కెట్లోకి వెళ్ళి, మనకి రాయల్టీ వస్తుందో తెలీదుకదా! అప్పటిదాకా వాళ్ళ ఋణం తీర్చకుండా వుంటామా? ఈలోపలే నాకేమైనా అయితే…?’’
పి.వి.నరసింహారావుగారి మాట నిజాయితీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. కాని ఎందుకో ఆయన చెబుతున్న బీదకబుర్లు నమ్మలేకపోతున్నాను. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఎన్నెన్ని అనధికార కార్యక్రమాలకి లక్షలకి లక్షలు ఎలా ఖర్చయ్యేవి? అవన్నీ ప్రభుత్వనిధులు కావు. పార్టీ నిధుల రూపంలో వచ్చేవి, ఖర్చయ్యేవి. పార్టీ నిధుల సేకరణ, వ్యయం, జమాఖర్చుల నిర్వహణ వగైరా ‘నిధి నిర్వహణ’ పనులన్నీ పార్టీ కోశాధికారి సీతారాంకేసరి చూసుకునేవారు. కాకపోతే ఆయన ఏం చేసినా పి.వి.గారికి చెప్పకుండా చేసేవారు కాదు.


నేను అయోధ్య రామాలయంకోసం ట్రస్టు ఏర్పాటుచేసే పనిమీద దేశంలో ఎక్కడెక్కడికో వెళ్ళాల్సివచ్చేది. అనేక సందర్భాలలో నా విమానం టిక్కెట్లు నాపేరుమీద ఉండేవికావు. కొన్నిసార్లు ప్రత్యేక విమానాలు కూడా నాకోసం ఏర్పాటయ్యాయి.
ఇవి ఇలా ఉంచి, ప్రధానికి మీడియా సలహాదారు అంటే పత్రికల వాళ్ళతో సత్సంబంధాలు వుండేలా, నేను కూడా వాళ్ళ ‘బాగోగులు’ కొంత పట్టించుకోవాలి కదా? ఇక, పార్టీ పరంగా అనేక వీడియో ప్రకటనలకి, పత్రికాప్రకటనలకీ అయ్యే ఖర్చు అంతా కోట్లల్లోనే ఉండేది. పార్టీకి కోశాధికారి సీతారాంకేసరే అయినా పార్టీ అధ్యక్షుడి ఆమోదం లేకుండా కోట్లరూపాయలు ఖర్చు ఎలా జరుగుతుంది?
కొంతమంది పారిశ్రామిక వేత్తలకి పార్టీ విరాళాల్ని అధ్యక్షునిద్వారా అందజేస్తేనే సంతృప్తి ఉంటుంది.
మరి అలా వచ్చిన విరాళాలన్నీ కోట్లల్లోనే ఉంటాయే! ఇవన్నీ నా కళ్ళముందు మెదిలాయి. ఉండబట్టలేక అడిగేశాను.
‘‘సర్‍, మీ చేతుల మీదుగా కోట్లాదిరూపాయల నిధులు ఖర్చయ్యేవికదా! మీరు మరీ అడ్వకేట్లకివ్వాల్సిన ఫీజులు కూడా ఇవ్వకుండా…’’ అని తటపటాయిస్తూనే అడిగాను.


పి.వి గారు నావంక విచిత్రంగా చూశారు.
‘‘అదేంటి ప్రసాద్‍, అదంతా పార్టీ ఫండయ్యా. పార్టీకోసమని ఇచ్చిన డబ్బుని మన సొంతానికి ఎలా వాడుకుంటామయ్యా? ఎవరు తెచ్చి ఏమిచ్చినా దాన్ని నేరుగా సీతారాంకేసరికే పంపించేస్తూ వచ్చాను… (కొంచెం ఆగి) ఇవ్వాళ ఇలాంటి సొంత అవసరం వస్తుందనీ, అందుకోసం అప్పుడా డబ్బు దాచుకోవాలనీ అనిపించలేదయ్యా…’’
నాకు మనస్సు చివుక్కుమంది. ఎందుకు అడిగానా అనుకున్నాను.
సుప్రీంకోర్టు దాకా ‘ఎక్కేకోర్టు, దిగేకోర్టు’ అయిపోయింది ఆయన పదవీ విరమణానంతర జీవితం. అదే ఆయనలో ఆందోళన పెంచేసింది. వయసు పెరుగుతోంది. ఆరోగ్యం క్షీణిస్తోంది. ఉత్సాహం తగ్గిపోతోంది. తనకంటూ ఏమీ చేసుకోలేదు. తనవాళ్ళకీ ఏమీ చేసిపెట్టలేదు. (ఈ మాటని ఆయన కొడుకు ఒకరు బాహాటంగానే పత్రికల ముందు వెళ్ళగ్రక్కాడు). కనీసం తన అధికార బలంతో ఆశ్రిత పక్షపాతం చూపించి అయినా తన వర్గం అంటూ ఎవర్నీ కూడగట్టుకునే ప్రయత్నం చేయలేదు.


ఆయనవల్ల లాభం పొందిన కొందరు ముఖ్యమంత్రులుగానీ, ఇతర నాయకులు గానీ పదవీవిరమణ తరువాత ఆయన్ని పట్టించుకొనే ప్రయత్నం చేయలేదు. పట్టించుకోకపోయినా ఈయన ఏమీ అనుకోడు అన్న భరోసాతో కొంతమంది, ఈయన్ని పట్టించుకుంటే ఈయన తరువాత వచ్చిన పార్టీ నాయకత్వం దృష్టిలో నేరం చేసినవాళ్ళమవుతామన్న భయంతో కొంతమంది … మొత్తంమీద ఆయన ఏకాకి అయిపోయాడు
చివరిరోజుల్లో ఆయనకి ఆప్తులుగా ఆయన పరిగణించిన వాళ్ళంటూ ఎవరన్నా మిగిలివుంటే – బహుశా – ఆయన వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తూ వచ్చిన ఎ.వి.ఆర్‍. కృష్ణమూర్తి, రామూ దామోదరన్‍, ఖండేకర్‍, ఐఏయస్‍ అధికారి రతన్‍ వట్టల్‍, నేనూ మాత్రమే. ఆయనకి పరిచయంలేని అనేకమంది దేశభక్తులు మాత్రం ఆయనకి సానుభూతిపరులుగా మిగిలిపోయారు.
నేను అతిగా మాట్లాడాననిపించిన వెంటనే ఆ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాను.
‘‘సర్‍, సర్‍… అంటే నా ఉద్దేశ్యం, మీ వల్ల ఉపకారం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, మీకీ అవసరం వచ్చిందంటే ఎవరుమాత్రం సహాయం చేయరు!’’ అన్నాను.


‘‘కాని నేనెప్పుడూ వాళ్ళకి సహాయం చేయటం వెనకాల వాళ్ళు నాకు రుణపడి ఉండాలని భావించ లేదే! కనీసం ఆ భావాన్ని వాళ్ళకి కలిగించే ప్రయత్నం కూడా చేయలేదే! ఇవ్వాళ ఏమని అడుగుతానయ్యా? ఏనాడైనా నేను అధికారాన్ని ఒక బాధ్యతగా భావించానే తప్ప భవిష్యత్‍ కోసం ఉపయోగించుకునే అవకాశంగా కాదు. దుర్వినియోగం చేయగలిగిన వాళ్ళకి అధికారం ఒక వరం. నాలాంటి వాళ్ళకి అదొక శాపం. ఆ శాపం వల్లనే ఇప్పుడు ఆర్థికంగా నేనూ బాగుపడలేకపోయాను, నన్ను నమ్ముకున్నవాళ్ళకీ ఏమీ చేయలేకపోయాను… ఎవరైనా ఇప్పుడు ఎందుకు వచ్చి, నా అవసరాలు కనిపెట్టి పలకరిస్తారయ్యా! నా ప్రారబ్ధం నేనే అనుభవించాలి గదా…’’
నా కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. అప్పటికింకేమీ మాట్లాడలేకపోయాను. ఆయన తన ఇంటి పత్రాల గురించి ఏదో చెప్పారు, వెళ్ళిపోయారు.
నేను ఆ ఇల్లు అమ్మకం గురించి తీవ్రంగా ప్రయత్నం చేసే లోపల – ఇది జరిగిన కొన్ని మాసాలకే – 2004 డిసెంబరు 23 న ఆయన ఢిల్లీలో కన్నుమూశారు.
ఆయన తన వకీళ్ళకి ఫీజుల బకాయిలు చెల్లించారో లేదో నాకు తెలీదు!
Sathya.T

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images