ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రతిభాభారతి వాళ్ల ఇల్లు నేను క్లాసుకొచ్చేదారిలోనే ఉంటుంది. సరిగ్గా నేను బస్సు దిగి వచ్చే సమయానికి రోజూ నవ్వుముఖంతో, చంకన చిన్నతమ్ముడితో ఎదురయ్యేది. స్కూల్లో చదువుకుంటున్న పిల్లే. కిటికీ దగ్గర నుంచుని సాయంత్రం నా క్లాసులో జరిగేదంతా చూస్తుండేది. ఒక్కోసారి గుమ్మంలోకొచ్చి కూర్చునేది. ఇంతలో తల్లి పిలుపుకి పరుగెత్తి వెళ్లిపోయేది.
ఆమె పెద్ద తమ్ముడు ప్రైవేటు స్కూల్లో చదువుతాడని, హోమ్ వర్క్ స్కూల్లో చేయించేస్తారని తెలిసింది.
తనతో చదివే పిల్లలు చెబుతుండేవారు, “క్లాసులో ప్రతిభాకి మంచి మార్కులొస్తాయి టీచర్, ఎప్పుడూ చదివినట్టే ఉండదు. మన క్లాసుకి వస్తానంటది కానీ ఆమెకి ఇంట్లో బోల్డు పని. వాళ్ల మామ్మ బలే గయ్యాళిది. ప్రతిభాని చదువు మానిపించమంటదట. పుస్తకం తీస్తే గోలగోల చేస్తుందట.”
పిల్లలు చెప్పే కబుర్లతో నాకు ప్రతిభ గురించి ఆసక్తిగా ఉండేది. చదువుకునే వాతావరణం లేని ఆ ఇంట్లో తను ఎలా చదువుకుంటోందో? అంతబాగా మార్కులు ఎలా తెచ్చుకుంటోందో?! నిజమైన ప్రతిభ, పేరుకి తగినట్టు.
ఒకరోజు ఇంటి వరండాలో ప్రతిభ వాళ్ల మామ్మతో గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతోంది. పక్కనే ప్రతిభ చిన్న తమ్ముడు చేతిలో కాగితం ముక్కలతో నిశ్శబ్దంగా ఆడుతున్నాడు. నన్ను చూస్తూనే ప్రతిభ ఇంట్లోకి వెళ్లిపోయింది సిగ్గుతో, అవమానంతో.
మామ్మ అరుస్తోంది, “ఈయేళే మీ నాన్నతో చెప్పి నీబడి మానిపిస్తా. ఏదో పేద్ద సదువు సదివేస్తంది ఈవిడిగారు. చంటిపిల్లోడు పుస్తకాలు తీసేడని వాడిమీద కలబడి లాక్కుంటాంది….”
విషయం అర్థమైంది. క్లాసులో ప్రతిభ స్నేహితురాళ్లు కూడా గుసగుసలాడుకోవటం గమనించాను. ఆ తర్వాత రెండు రోజులు ప్రతిభ బడికి రాలేదని పిల్లలు చెప్పారు. తామెవరైనా ఇంటికి వెళ్ళినా వాళ్ల మామ్మ ఆమెతో మాట్లాడనివ్వట్లేదని, ఇంట్లోంచి బయటకే రానివ్వట్లేదని చెప్పారు. అసలు ఆ పిల్లని మళ్ళీ బడికి పంపుతారా లేదా అన్న సందేహం పట్టుకుంది. రోజూ ఇంటి ముందు ఆ ముసలామె కనిపిస్తోనే ఉంది.
ప్రతిభ తల్లితో మాట్లాడితే? కానీ ఆమె నా క్లాసు అయ్యే సమయానికి కూడా వచ్చినట్టు కనిపించేది కాదు. ఒకరోజు ప్రతిభ తండ్రి వాళ్ల ఇంటి వసారాలో కనిపించాడు.
“ప్రతిభ స్కూలుకి వెళ్లట్లేదట” అన్నాను ఉపోద్ఘాతంగా. ఏమిటన్నట్టు చూసాడు.
“బాగా చదివే పిల్ల, క్లాసులు పోతే మళ్ళీ అవన్నీ ఒక్కసారి చదువుకోవాలంటే కష్టం. తనని రోజూ బడికి పంపండి.”
“వెళ్లుద్దిలెండి. ఇప్పుడు ఆళ్ల అత్తకి బాలేదని సాయానికెళ్లింది” అన్నాడు. ఇంతలో ముసలామె లోపల్నించి వచ్చి చెప్పింది,
“ఇప్పుడాపిల్ల సదువుకుని ఉజ్జోగానికెళ్లక్కర్లేదులే. ఎట్టాగూ వచ్చేయేడు పెళ్లి సేసి పంపేదే.” ఆమెతో మాట్లాడటం వృధా అనిపించింది. దాదాపు పదిరోజులు గడిచిపోయినట్టుంది.
అనుకోకుండా ఒకరోజు సాయంత్రం క్లాసులో పిల్లలు చెప్పారు. ప్రతిభ చేతులు కాలాయని, ఆసుపత్రిలో ఉందని. ఏమైంది? నా ప్రశ్నకి పిల్లలెవరూ జవాబు చెప్పలేకపోయారు.
మర్నాడు గవర్నమెంటు ఆసుపత్రికి వెళ్తే ఎక్కువ శ్రమ పడకుండానే ప్రతిభ ఉన్నచోటు కనుక్కున్నాను. ఆమె తల్లి తలమీద చేతులు పెట్టుకుని కూతురి పక్కనే కూర్చుంది. ప్రతిభ చేతులు రెండింటికీ కట్టుకట్టారు. ఆమె ముఖంలో నీరసంతో పాటు నొప్పి తాలూకు బాథ ఉంది. నన్ను గమనించి సంతోషంగా తల్లికి చెప్పింది.
ప్రతిభ తల్లిని దగ్గరగా చూడటం అదే మొదటిసారి. ముప్ఫై ఏళ్లుంటాయేమో! లేచి నన్ను స్టూలు మీద కూర్చోమని చెప్పింది.
“ఎలా కాల్చుకున్నావు చేతులు?” అడిగాను.
ప్రతిభ తల్లికేసి చూసింది మాట్లాడకుండా.
“ఈ పిల్ల నాకు పుట్టకపోతే బావుండేది టీచరుగారూ. మా బతుకులన్నీ రోడ్డుమీద పడేస్తోంది మా అత్త.”
“ఈపిల్ల చేతులు ఎట్టా కాల్చుకుందని కదూ అడిగారు. అది కాల్చుకోలేదు. నా అత్త దాని రెండు చేతులమీద అట్లపుల్లతో కాల్చి వాతలు పెట్టింది. ఎందుకో తెలుసా,…” గొంతు రుధ్ధమై వాక్యం పూర్తిచెయ్యలేకపోయింది.
“నా చిన్న కొడుకు తినే మరమరాలు కోసం ఈ పిల్ల వాటా అడిగింది. స్కూలు నుంచి వచ్చిన పిల్ల నేను వచ్చేవరకు ఆకలితో ఉండాల్సిందే. ఎప్పుడైనా నాలుగు రూపాయలుంటే ఇచ్చి, ఏదైనా కొనుక్కు తినమందామంటే నా దెగ్గర ఎప్పుడుంటాయిలే. అంతా ఉత్తిమాట.” అసహాయంగా ఆమె కన్నీళ్లు తుఢుచుకుంటుంటే చూడలేక ముఖం తిప్పుకున్నాను. ప్రతిభ దిగులుగా తల్లివైపే చూస్తోంది.
తను వచ్చింది వీళ్లని ఏడిపించేందుకా? ఇలా వచ్చి పొరబాటు చేసానా అన్న సంశయంలో లేవబోయాను.
“కూర్చోలే టీచరుగారూ, నాకూ చెప్పుకుందుకెవరున్నారు? కాస్త వినిపెట్టు. మగ పిల్లలంటేనే నా అత్తకి లెక్క. ఆమెకి ముగ్గురు కొడుకులున్నారు, ఒక కూతురు కూడా ఉందిలే. మొన్నతన కూతురికి జొరం వచ్చిందంటే పన్నెండేళ్ల నా కూతుర్ని సాయానికంపింది. పోనీ తను వెళ్లచ్చుగా అంటే “కూతురింటికి నేనెట్టాబోతా” అంటది. పండగలకి మాత్రం కూతురు, అల్లుడు పిలిచేరని సంబరంగా వెళ్లి, బహుమతులు తెచ్చుకుంటది. అక్కడకెళ్లి చాకిరీ చేసేందుకు ఒళ్లు ఒంగుద్దా, అదీకాక ఇక్కడ నాకు, నాపిల్లలకి కాపలా.”
ఒక క్షణం ఆగి మళ్లీ చెబుతోంది,
“మా నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలం. మమ్మల్ని బంగారంలా పెంచారాళ్లు. కానీ మా పెళ్లిళ్లకోసం ఆయన పడ్డ బాథ నాకు తెలుసు. మాఅత్త నాపెళ్ళికి ముందే మా నాన్నతో ఖాయంగా తేల్చుకుంది. వాళ్లు పెద్దోళ్లైపోయాక మామీద ఆధారపడి బతక్కూడదని చెప్పింది. వాళ్ళు మాత్రం ఆడపిల్ల ఇంటికి ఎందుకొస్తారు టీచరుగారు? మన పెద్దోళ్లు చెప్పేరంటకదా ఆడపిల్ల సొమ్ము అమ్మా,బాబూ తినకూడదని. మరి మగపిల్లలు లేనోళ్లు ముసలాళ్లైనాక ఎట్టా బతకాలంట? అది ఎవురైనా చెప్పేరా టీచరుగారూ?
పది చదువుతుంటే ఆపించి పెళ్లి చేసారు. నా పెళ్లై పదిహేనేళ్లైంది, నా అత్తిల్లు ఇప్పటికొచ్చి మాఅమ్మోళ్లు చూడలేదు. నేను బతికే బతుకు చూడలేదు. మొదటి కాన్పుకెళ్ళాను, అంతే. ప్రతిభ పుట్టింది. నా అత్త
“నీ పుట్టింట్లో అందరూ ఆడోళ్ళే. రెండో కాన్పుకెళ్తే మళ్లీ ఆడపిల్లని ఎత్తుకొస్తావ”ని పంపలేదు.
ఈ మగపిల్లల పిచ్చేంటో నాకు అర్థం కాదు టీచరుగారూ, ఈ తేడాలెందుకు? ఆమే ఆడదేగా. ఈ పిల్లని ఇంట్లో బతకనీదు. పిల్లకి తిండి సరిగా పెట్టదు. ఏం వండినా ముందు కొడుక్కి, మనవలకీ పెట్టేస్తది. పచ్చడో, చారో ఈ పిల్లకి. పొద్దున్నెళ్తే చీకటి పడ్డాకొస్తా. ఏపూటా సరైన తిండే ఉండదు.
ఈ పిల్ల ఎక్కడా బయట పడదు కానీ, ఎప్పుణ్ణా రాత్రి నాదగ్గర పొడుకొని మా అత్తకి వినపడకుండా అడుగుతుంది, “అమ్మా, కోడిగుడ్డుకూర నాకూ పెట్టమని మామ్మకి చెప్పవే” అని. సంపాదించి తెచ్చేది నేనైనా ఆమె దగ్గర డబ్బులు అడుక్కోవాల. పిల్లకి ఒక రిబ్బను ముక్క తెద్దామన్నా, తినేందుకేమన్నా తెద్దామన్నా ఎప్పుడూ కరువే. మొన్న జెండా పండక్కి తెల్ల రిబ్బన్లు కావాలని ఏడ్చింది. కొననివ్వలే నా అత్త. మా ఆయన తల్లిముందు నోరెత్తడు. అందుకే టీచరుగారూ, నాకు ఆడపిల్లల్ని చూస్తావుంటే విసుగుపుడతంది.”
మనసులోఉన్నదంతా చెప్పుకున్నాక ఆమె ముఖం తెరిపిగా అనిపించింది.
“సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇది మీ కుటుంబం. పెరిగే వయసులో పిల్లకి సరైన పోషణ జరగటం లేదని తెలిసీ ఎందుకు ఊరుకుంటున్నారు? మీ కూతురు విషయంలో మీరు మాట్లాడకపోతే ఎలా? మీ ఆయన మాట్లాడక పోవటం కూడా తప్పే. పిల్లలందర్నీ సమంగా చూడమని ఆయన తల్లికి చెప్పాలి. తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ కూడా అమ్మాయికి అంత అనాదరణ జరుగుతోంది. ఇంట్లో మగపిల్లల్ని ఒకరకంగా పెంచుతూ, ఆడపిల్లని తక్కువగా చూస్తే ఆ పిల్లలకి తమ అక్క, చెల్లి పట్ల తేలికభావాన్ని నేర్పినట్టుకాదూ. ఇదే సరైనదని వాళ్లు అనుకోరా?”
నా ప్రశ్నకి ఆమె చటుక్కున తలెత్తింది. తన మౌనం, తన భర్త మౌనం మరో తరాన్ని ఇదే మూసలో తయారుచేస్తోందన్న విషయం స్ఫురించింది.
“మీరు సరిగ్గా చెప్పారు టీచరుగారూ, నేను, మాఆయన ఇన్నేళ్లూ పొరబాటు చేశాం. ఇంక అలా జరగదులే. నా కూతుర్నింక ఇంట్లో తక్కువగా చూస్తే ఊర్కోను. ఇన్నేళ్లూ నా అత్త నోటికి భయపడి నోరెత్తలేదు. కానీ ఇలా పిల్ల చేతులు కాల్చేసి, తిండి పెట్టక మాడ్చేసి కంటి ఎదురుగా హింస పెడతంటే ఇంక ఊర్కునేది లేదు. అమ్మా, అయ్యా బతికుండి ఈ పిల్ల ఇట్టాంటి బతుకు బతుకుతోందంటే నాకే సిగ్గుగా ఉంది. నా కొడుకులకి ముందుగా అక్కని ప్రేమగా చూసుకోటం నేర్పాలి.” అంది ఆమె పట్టుదలగా.
ప్రతిభని త్వరగా తగ్గించుకుని క్లాసులకి రమ్మని చెబుతూ లేచాను.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com