Menu Close

అతను ఏ పొజిషన్ లో ఉన్నా..స్నేహితుడు స్నేహితుడే – Emotional Stories in Telugu


అతను ఏ పొజిషన్ లో ఉన్నా..స్నేహితుడు స్నేహితుడే – Emotional Stories in Telugu

Emotional Stories in Telugu: తాడేపల్లిగూడెం పెళ్లికి వచ్చాం… ఊళ్ళో ఊర్వశి థియేటర్లో ఎన్టీఆర్ “రాముడు భీముడు” సినిమా ఆడుతోంది. మా ఆవిడ సినిమాకి వెళదామంటే.. సరే అని వెళ్ళాం. టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే.. ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక, మా ఆవిడకి పరిచయం చేశాను.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
School Friends Children, Kids

నిడదవోలులో ఇంటర్లో క్లాస్మెట్ అని..! హాల్లో కూర్చున్నాక అడిగింది.. “అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు….. ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం..” అంది. “ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది” అన్నాను.

వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే… చాలా అల్లరి వెధవ…. సినిమాల పిచ్చి ఎక్కువ… ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం… ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం… సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం.. ఇదే పని.

అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి నన్ను కూడా తీసుకెళ్లేవాడు… “ఎందుకురా” అంటే.. “ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునే వాడిని.. నువ్వూ వస్తే 2 నేల టికెట్స్.. అంతే గదరా..” అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా…!

“మా పెద్దోళ్ళు, వాడితో తిరిగితే ఎక్కడ చెడిపోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు. చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు” అన్నాను. “మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు…. లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు.

అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద ఉద్యోగమా ఏంటి…. ఇప్పటి వరకు కనీసం ఓ స్కూటర్ కూడా కొనలేదు” అంటూ దెప్పింది. నాకు ఉక్రోషం వచ్చి “ఎలా చూసినా వాడికంటే బెటరే కదా” అన్నాను. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన.. ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే.. “వద్దు సార్” అని వెళ్లి పోయాడు.
ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ..

“నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ.. మీరే సరిగ్గా పలకరించ లేదు.. పోజు కొడుతూ మాట్లాడారు.” అన్నది. “కాదులే… వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదు కదా.. నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో… రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే… అదో తలనొప్పి మళ్లీ..!” అన్నాను సాలోచనగా.

“అతను ఏ పొజిషన్ లో ఉన్నా.. బాల్య స్నేహితుడు బాల్య స్నేహితుడే..! అంది. “కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి” అంది నిశ్చయంగా.. సినిమా అయిపోయింది.. మా ఆవిడ పోరు పడలేక.. ఎంట్రన్స్ దగ్గర సిబ్బందిని, వాడి గురించి వాకబు చేస్తే… అతను పై ఫ్లోర్ లోని ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు.

పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్… ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే…. హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు… ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట… మేము లోపలికి వెళ్లగానే… లేచి బయటకు వెళ్లిపోయారు.

గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా.. రారా.. అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.! మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి, ఈ స్టేజీకి ఎదిగాడుట.

ఇంకా ఏలూరులో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెప్పుకొచ్చాడు. “ఎలా వచ్చార్రా..” అని అడిగితే.. “రిక్షాలో” అని చెప్పా. డ్రైవర్ని పిలిచి, వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.

దారిలో మా ఆవిడ.. “ఇలా ఇంకెప్పుడూ, ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి…. ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను…” అంది చిరు కోపంగా.!!

“మన కళ్ళకు కనబడేవన్నీ నిజాలు కాదు, మనం చేసేదే మంచి పని కాదు, మనం సంపాదించినదే ఎక్కువ కాదు, ఎదుటివాడిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించు, వాడు మన కన్నా గొప్పవాడే.”

రచన: శ్రీ ఆచంట సుబ్రహ్మణ్యం గారు.

మంచిని పెంచడం చాలా సులువు – Great Moral Stories in Telugu

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Share with your friends & family
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading