మల్లాది ‘నవల వెనుక కథ’ – ఒక ఫెయిల్యూర్ స్టోరీ
రచనలు చేసే అభిరుచి ఉన్న వారికి ఒక మాట. అలాగే ఆహ్లాద రచయిత మల్లాది గారి అభిమానులకూ గుడ్ న్యూస్. వారి కొత్త పుస్తకం వస్తోంది. దాని పేరు ‘నవల వెనుక కథ’. ఈ ఆగస్ట్ 2020కి రచయితగా మల్లాది వెంకట కృష్ణమూర్తి గారికి యాభై ఏళ్ళు. ఈ శుభ సందర్భంగా ఇప్పటివరకు వారు రాసిన 106 నవలలని ఎలా రాశారో, ఒక చిన్న ఆలోచన నుంచి వాటిని ఎలా ఒక నవలగా మలిచారో అందులో పంచుకున్నారు.
దాదాపు 760 పేజీల ఈ పుస్తకంలో నవల వెనుక కథలతో పాటు సినిమాలుగా వచ్చిన వారి నవలలు, సీరియల్స్, వివిధ పబ్లిషర్స్, రీడర్స్ లపై వారి అభిప్రాయాలున్నాయి. ‘పడి లేచిన నవల’ పేరిట అరవై ఏండ్ల తెలుగు నవల మీద వారి విశ్లేషణ కూడా ఉన్నది. అంతేకాదు, వివిధ పత్రికల్లో ప్రచురితమైన వారి ముఖాముఖిలు, ఇంకా చాలా ఆసక్తికరమైన సమాచారం ఇందులో పొందుపరిచారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ పుస్తకం వారి యాభై ఏండ్ల సాహితీ ప్రయాణాన్ని పరిపూర్ణంగా అవిష్కరిస్తుందని చెప్పవచ్చు. కాకపోతే, ఒకే ఒక లోటు. ఇందులో కూడా వారి ఫోటో లేదు.
అన్నట్టు, ఈ పుస్తకంలో నా ముఖాముఖి కూడా ఉన్నది. ఆగస్టు 2004లో అంటే పదహారేళ్ళ క్రితం రాసిన ఫెయిల్యూర్ స్టోరీ కూడా ఉన్నది.
వారి యాభై వసంతాల ప్రయాణం ఎంత విజయవంతమో మనందరికీ తెలుసు. ఐతే, తన ఎదుగుదలను, ఒక్కో మెట్టుగా పైకి రావడాన్ని మొత్తంగా ఒక వైఫల్యంగా చెప్పడం ఫెయిల్యూర్ స్టోరీలో మనల్ని విస్మయపరుస్తుంది.
‘నవల వెనుక కథ’ వస్తోన్న సందర్భంగా నా రచనా వ్యాసంగానికి ఎంతగానో స్ఫూర్తి నిచ్చిన నా అభిమాన రచయిత పట్ల ప్రేమతో, కృతజ్ఞాతాభివంధనాలతో ఆ కథనాన్ని మీతో పంచుకోవదానికి ఇది మంచి తరుణం.
అది చదివే ముందు, గోదావరి ప్రచురణలు తెస్తోన్న ఈ పుస్తకం వెల ఆరొందల రూపాయలు. తెప్పించుకోదలచినవారు గూగుల్ పే కోసం, ఇతర వివరాల కోసం లక్ష్మీనాథ్ దీవి గారిని 98494 56565 నంబర్లో సంప్రదించవచ్చు. మెయిల్ id: Lachhi@gmail.com.
వారి ఫెయిల్యూర్ స్టోరీకి ఇదీ ఉపోద్గాతం
ప్రపంచంలోని కథలు నాలుగు రకాలు. ఒకో రచయిత ఒకో తరహా కథలను సృష్టించారు.
ఒకటి ఓ హెన్రీ కథ. పాఠకులు ఊహించని విధంగా వారు అబ్బురపడేలా ముగియడం దీని లక్షణం.
రెండోది మొపాసా కథ. ఓ మనిషి పడే వేదనని కథగా మలుస్తాడు మొపసా. ఇతడి కథ చదివాక పాఠకుడి హృదయంలో స్పందన కలిగి తీరుతుంది.
మూడోది మామ్ కథ. ఇతడి కథల్లోని పాత్రల స్వభావాన్ని ఊహించుకోవడం తేలిక. మనిషిలోని తమాషా లక్షణాలను పరిచయం చేయడం కూడా ఇతడి ప్రత్యేకత.
ఇక చివరి రకం చెకోవ్ కథ. ఇతడి కథల్లో ట్విస్ట్ లుండవు. బాధ, భయాలుండవు. క్యారక్టరైజేషన్ కు ప్రాధాన్యత ఉండదు. కానీ కథ పూర్తిగా చదివాక దాని ముగింపు ఇంకేమై ఉండవచ్చనే ఆలోచన పాఠకులను చాలా కాలం వెంటాడుతుంది.
“కథలెలా రాస్తారు?” అనే పుస్తకంలో మల్లాది గారు ఒత్సాహిక రచయితల కోసం సాంఘిక కథలను పై విధంగా విడగొట్టారు. కానీ చిత్రంగా, అయన ఫెయిల్యూర్ స్టోరీ గా ఈ నాలుగు లక్షణాలను ఇముడ్చుకున్నదా అన్న సందేహం కలగుతోంది.
“నా ఫెయిల్యూర్ స్టోరీ పాఠకులకు నచ్చకపోవచ్చు” అంటూ బిగిన్ చేశారు మల్లాది.
“నా మొదటి కథ ఆగస్టు 1970లో చందమామలో ప్రచురించబడింది. అచ్చులో నా పేరు చూసుకుని ఎంతో సంతోషించాను. ఆ కథను ఒకటికి పదిసార్లు చదువుకుని, నా పేరును పదే పదే చూసుకుని ఎంతగానో మురిసిపోయాను. దిసీజ్ మై ఫస్ట్ ఫెయిల్యూర్ స్టోరీ. పందొమ్మిదవ ఏట ఎదురైనా నా మొదటి వైఫల్యమది.
నా మొదటి నవల ఆంధ్రప్రభలో 1972లో ప్రచురించబడింది. అది ‘అద్దెకిచ్చిన హృదయాలు’ పేరిట వచ్చింది. అప్పుడు నేను వరంగల్ లో అక్కౌంటెంట్ గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రభ ఎప్పుడొస్తుందా అని తహతహతో రైల్వే స్టేషన్ కు వెళ్లి, మద్రాస్ నుంచి వరంగల్ వచ్చే పార్సల్ కోసం ఎదురు చూసేవాడిని. ఆ పార్సల్ విప్పదీయగానే ఏజెంట్ దగ్గర ఒక కాపీ కొనుక్కుని నా సీరియల్ ఎంతదాకా వేశారో చూసుకునేవాడిని. ఉత్తరాలు ఏమైనా వచ్చాయేమో చూసుకుని సంతోషించేవాడిని. ఇది నా రెండవ ఫెయిల్యూర్.
తర్వాత చాలా నవలలు అచ్చయ్యాయి. ఆ పీరియడ్ లో వచ్చిన ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, యువ, అపరాధ పరిశోధన, జ్యోతి, స్వాతి వంటి అనేక పత్రికలూ నా రచనలను అచ్చేశాయి. వాటిని చూసి రచయితగా ఎదుగుతున్నానని ఎంతో ఆనందించే వాడిని. ఇది నా తర్వాతి ఫెయిల్యూర్.
ఎనభయ్యవ దశకం వచ్చింది. అప్పుడే కమర్షియల్ నవలా యుగం ప్రారంభమయింది. అప్పటికి నేను రైటర్ నే గానీ కమర్షియల్ రైటర్ ని కాదు. రాసిన వాటికి డబ్బెలా చేసుకోవాలో తెలియదు. ఆ టెక్నిక్ యండమూరి వీరేంద్రనాథ్ ను చూసి నేర్చుకున్నాను. ఆ తర్వాత రాసిందే ‘దూరం’ అనే నవల. అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. ఆ తర్వాత ‘పెద్దలకు మాత్రమే’ రాశాను. అదొక ఫెయిల్యూర్. ఇలా, నేను చెప్పేవన్నీ ఫెయిల్యూర్లే.
తర్వాత 1986-87 లో అనుకుంటాను. ‘స్రవంతి’ అనే పత్రికను ఎడిట్ చేశాను. ఆంధ్రభూమి నుంచి విడిపొయి సొంతంగా పల్లకి అనే పత్రికను పెట్టిన కందనాతి చెన్నారెడ్డి నన్ను ‘స్రవంతి’ని ఎడిట్ చేయమని కోరారు. ఆరు నెలలు పనిచేశాను. ఆ రోజుల్లో అది సెకండ్ లార్జెస్ట్ వీక్లీ అయింది. నేను బయటకు వచ్చే నాటికి దాని సర్క్యులేషన్ ఎనభై వేలు. చెప్పానుగా, ఇదీ ఫెయిల్యూరే.
తన నవల సినిమాగా వస్తే బాగుండునని ప్రతి రైటర్ అనుకున్నట్టే ఆ రోజుల్లో నేనూ అనుకున్నాను. ‘పెద్దలకు మాత్రమే’ అనే నా నవల జంధ్యాల గారి డైరెక్షన్లో సినిమాగా వచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు పదిహేడు సినిమాలు వచ్చాయి. అవన్నీ ఫెయిల్యూర్లే.
తర్వాత పోలీస్ రిపోర్ట్ అనే సినిమాకు డైలాగ్స్ రాశాను. దాంతో డైలాగ్స్ రాయాలన్న కోరిక కూడా తీరింది.
దూరదర్శన్ వదిలేస్తే ప్రైవేట్ చానల్స్ లో తొలి టెలీ సీరియల్ ‘మేఘమాల’ జెమినీలో వచ్చింది. అలా నా నవల టెలీ సీరియల్ గా రావడం మరో ఫెయిల్యూర్.
బూరుగుపల్లి శివరామకృష్ణ అనే చార్టెడ్ అక్కౌంటెంట్ ఉండేవారు. అప్పటికి అయన నిర్మాత కాలేదు. నా చేత డైరెక్షన్ చెయిద్దామనుకున్నారు. అప్పట్లో డైరెక్షన్ అంటే నాకేమీ తెలియదు. ఆసక్తి కూడా లేదు. ‘వినాయకరావు పెళ్లి ‘ అనే నా నవలను రాజేంద్ర ప్రసాద్ హీరోగా నా చేత డైరెక్ట్ చేయించాలని అనుకున్నారు. కానీ రాజేంద్రప్రసాద్ డేట్స్ దొరకలేదు. ఆ తర్వాత ‘మై డియర్ ఎనిమి’ అనే నా మరో నవల రైట్స్ కొనుక్కున్నారు.
అయన డైరెక్షన్ చేయమని అడిగారు కాబాట్టి మద్రాస్ వెళ్ళినప్పుడల్లా అమెరికన్ లైబ్రేరీ నుంచి దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్ మీద పుస్తకాలు తెచ్చుకుని థియరీ స్టడీ చేశాను. అలాగే ఇంగ్లీష్ సినిమా క్యాసెట్స్ తెచుకుని డైరెక్షన్ గురించి నోట్స్ రాసుకుని విస్తారంగా ప్రిపేర్ అయ్యాను. ఈ లోగా ఆయన చాలా పెద్ద నిర్మాత అయిపోవడంతో నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. అయన తప్ప నన్ను డైరెక్షన్ చేయమని అడిగిన వారు లేరు. దాంతో చాలా రోజులుగా నిరాశగా ఉండగా కె.ఎస్. రామారావు గారు నా నవలతో వచ్చే ఒక టెలీ సీరియల్ ను నన్నే డైరెక్ట్ చేయమని అడిగారు. ఆ సీరియల్ ‘డి ఫర్ డెత్’. అలా ఒకప్పుడు డిజప్పాయింట్ మెంట్ అనిపించినా ఈ ప్రయత్నంతో ఆ కోరికా తీరింది. సో, టీవీ డైరెక్షన్ ఈజ్ అనెదర్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్.
తర్వాత లిపి పబ్లికేషన్ ప్రారంభించాను. దాంతో నేను రైటర్ కం పబ్లిషర్ గా మారాను. ఇందువల్ల డబ్బులు వచ్చినప్పటికీ అది పెట్టడం కూడా ఒక ఫెయిల్యూరే.
సో, ఇప్పుడు మీకు అనుమానం రావొచ్చు. మామూలుగా అందరూ సక్సెస్ అని చెప్పే వాటిని నేనెందుకు ఫెయిల్యూర్ అంటున్నానూ అని! అవి ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ యే. ఎందుకో నాకు నలభై తొమ్మిదో ఏటా తెలిసింది.
“1998-99 లో అనుకుంటాను. ఆ ఏడు వర్క్ తో బాగా అలసిపోయాను. విశ్రాంతి కోసం అని ఓ నాల్రోజులు గోవా వెలుదామనుకున్నాను. పి.ఎస్. నారాయణ అనే రచయితకు చెబితే అక్కడ పక్కనే గోకర్ణం కూడా ఉంది. వెళ్లి చూసి రమ్మనారు. గోకర్ణం చూడటానికి వెళితే ఆ పక్కనే ఉన్న మారుండేశ్వర్, కొల్లూరు మూకాంబిక, ఉడిపి, ధర్మస్థలి, శృంగేరి – ఇవన్నీ కూడా చూసిరమ్మని మరొకరు సలహా ఇచ్చారు.
దాంతో నేను గోవాలో నాల్రుజులు గడిపి ఆ తర్వాత గోకర్ణం వెళ్లాను. అక్కడ ఒక రాత్రి బస చేసి మరునాడు మారుండేశ్వర్ వెళ్లాను. అది చూసుకుని కొల్లూరు మూకాంబిక ఆలయం వెళ్లాను.
కొల్లూరు వెళ్ళేటప్పటికి ఎలాంటి భక్తి లేదు. నిజానికి నాకు దైవభక్తి లేదు. అంటే నా ఉద్దేశ్యం దేవుడుంటే ఉంటాడు. అయన పని ఆయన చేసుకుంటాడు. నా పని నేను చూసుకుంటాననే!
ఇలాంటి భావనతో లోపలకు వెళ్లి దండం పెట్టుకుని బయటకు వచ్చాను.
పది రూపాయలు పెట్టి ఆవునెయ్యి కొనుక్కుని, అది తీసుకెళ్ళి వెలిగించమని ఒక ముసలాయన అంతకుముందే చెప్పారు. నేను బయటకు వచ్చాక, “అదేంటి, దీపం వెలిగించాలేదా?” అంటే, ఆయన్ని ప్లీజ్ చేయడం కోసం వెలిగించి వచ్చాను. తర్వాత మిగతా యాత్రా స్థలాలు దర్శించుకుని అక్టోబర్ మొదటికల్లా ఇంటికి వచ్చాను.”
“ఇంటికి రాగానే ఎందుకో సంధ్య వార్చాలనిపించింది. చిన్నప్పుడు ఉచ్చరించిన మంత్రాలన్నీ మర్చిపోవడంతో గుర్తున్న గాయత్రీ మంత్రం జపించాను. ఉదయం 116 సార్లు, సాయంత్రం 116 సార్లు జపించాను. అంతే. అంతకుమునుపు ఎప్పుడూ లేనంతటి ప్రశాంతత మొదటిసారి ఫీల్ అయ్యాను. ఇదివరకు గాయత్రి చేసినప్పుడు కూడా లేని ప్రశాంతత అది.
అరగంటతో మొదలుపెట్టి గంట, గంటన్నర అలా పెంచుకుంటూ పోయాను. రెన్నెల్లు చేశాను. అనుకోకుండా నాకో సిద్దపురుషుడైన గురువు లభ్యమయ్యారు. అయన గురుమంత్రం పంచాక్షరి ఇచ్చారు. ఆ పంచాక్షరి ప్రారంభించాక గాయత్రి మంత్రం కంటే దీంట్లో నాకు ప్రశాంతత ఎక్కువైంది.
మూడు నెలలు గడిచాయి. ఈ మూడు నెలల్లో పూర్వం ఉన్న చెడు అలవాట్లన్నీ తొలగిపోయాయి. ఇదివరకు ఆల్కహాల్ తీసుకునేవాడిని. మానేశాను. మాంసాహారం తీసుకునేవాడిని. అది కూడా మానేశాను. కొందరు స్త్రీలతో సాన్నిహిత్యం ఉండేది. అది కూడా కటాఫ్ చేసుకున్నాను. ఒక రకంగా ఈ మూడు నెలల కాలం నా జీవితంలోకి వచ్చాక పూర్వ ప్రపంచంలో ప్రజలకు ఏవైతే ఆనందం అనుకుంటారో వాటన్నిటిమీదా నాకు ఆసక్తి పోయింది. ఇవన్నీ నా ప్రమేయం లేకుండా వాటంతటవే జరిగిపోవడం విశేషం. “
“ఆరు నెలలు గడిచాయి. నా పూర్వ జీవితంతో కంపేర్ చేసుకుంటే నా బ్రెయిన్ కాస్త మందకొడిగా తయారైనట్టు గ్రహించాను. లోకిక వ్యవహారాలకు నేను పూర్తిగా దూరం అయ్యానని అర్థమైంది. ఎదో ప్రాబ్లెం వస్తోంది. ధ్యానంలో తమాషా అయిన ఆసనాలు వచ్చేవి. ‘నాకేమైనా పిచ్చేక్కుతుందా?’ అనే భయం కూడా కలిగింది.
ఒక స్నేహితుడి సలహా మీద సైకియాట్రిస్ట్ ని కలిశాను. ఆయన టెస్ట్ చేసి, “మీరు రావలసిన పీరియడ్ లో రాలేదు. ఇప్పుడేమీ లేదు. క్లినికల్లీ ఎవ్విరీథింగ్ ఈజ్ నార్మల్” అని చెప్పి పంపారు.
తర్వాత రెండేళ్ళు గడిచాయి. కానీ నా మనసులోంచి ఆ సందేహం పోలేదు. “యామ్ ఐ గేటింగ్ మ్యాడ్?” ఆ సందేహం వెంటాడేది.
అయితే, ఈ రెండేళ్లలో నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఉదయం ఆరింటి నుంచి నాలుగైదు గంటలు వరసగా ధ్యానం చేస్తున్నాను. ఇంకా చేయాలని ఉంటుంది గానీ లౌకిక ఇబ్బందుల వల్ల ఆపేస్తున్నాను. మళ్ళీ సాయంత్రం నాలుగు కల్లా ధ్యానానికి కూచుంటే రాత్రి ఎనిమిదిన్నర వరకూ చేస్తున్నాను. రోజుకి ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా ధ్యానం చేస్తున్నాను. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.
ఈ ధ్యానం వల్ల అంతకుముందు పంచేంద్రియాల వల్ల లభించిన ఆనందం తాత్కాలికమనే ఎరుక కలిగింది. క్రమేపీ ధ్యానం వల్ల లభించే ఆనందం, ప్రశాంతత పెరిగిపోయింది. బయట దొరికే వేటిమీదా ఆధారపడని ఈ ఆనందం, తన్మయత్వం లోపలి నుంచి వస్తోంది. ఇది నేను పూర్వం వేటినైతే ఆనందం అనుకుని అనుభవించానో వాటికీ సమానం కాదు. పోలికగా చెప్పాల్సి వస్తే నేను పొందే ఆనందం సూర్యుడైతే అవన్నీ కొవ్వొత్తి వెలుగు.
తర్వాత తర్వత పునర్జన్మ, కర్మ సిద్దాంతం నిజం అనే సమ్మతి లోపల్నుంచి బయటకు వెలువడింది. వెలువడటమే కాకుండా నాలో స్థిరపడింది.”
“నేను పిచ్చివాడిని అవుతున్నాననే సందేహం వచ్చినప్పుడు సైకియాట్రిస్ట్ అలాంటిదేమీ లేదన్నారు గానీ నాలో సందేహం ఉందన్నాను కదా. అప్పుడు బాగా ఆలోచిస్తే నాకు ఆ తీర్థ యాత్రలకు వెళ్ళినప్పుడు కలిగిన ఆలోచనలు జ్ఞాపకం వచ్చాయి.
కొల్లూరు లో మూకాంబిక ఆలయానికి వెళ్లి ఆర్టీసి బస్సులో తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు నాకు కొన్ని చిత్రమైన ఆలోచనలు కలిగాయి.
అందులో ఒకటి, ఎప్పుడూ ఆ అమ్మవారి దగ్గరే ఉండిపోవాలనిపించింది. బస్సు స్టార్టవగానే ఈ ఆలోచన వచ్చింది. ఎలా ఉండనిస్తారు! గుడి తలుపులు వేసినప్పుడు బయటకు పంపేస్తారు కదా? అనే సందేహం వచ్చింది.
రెండోది, అమ్మవారికి హారతి ఇస్తారు కదా. హారతి ఇచ్చినప్పుడు పళ్ళెంలో మసి ఉంటుంది చూడండి. ఆ మసిలాగా నైనా ఉండిపోవాలని పించింది. మసిలాగా ఉండిపోతే లోపలే ఉండిపోవచ్చని అనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, నన్ను ప్రేమించే వాళ్ళను మిస్ అవుతాను కదా అనిపించింది. అంతలోనే వారేప్పుడైనా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు చూడొచ్చు కదా అనిపించింది. ఇలాంటి ఆలోచనలు రాగానే వెర్రిగా ఆలోచిస్తున్నానని అనిపించి ఆ ఆలోచనలను అక్కడికే కట్ చేశాను.
ఈ క్షణాన నాకేమనిపిస్తున్నదీ అంటే, మూకాంబికా తల్లి ఎందుకనో అపూర్వమైన కరుణతో నన్ను క్షాళనం చేసిందని. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి నన్ను ప్రేవేశ పెట్టిందని. అందుకు నేను అర్హుడను కాకపోయినా అపారమైన కరుణతో నాకు వెలుగు చూపిందని, అందుకే గతమంతా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్. ఇదొక్కటే సక్సెస్ గా అనిపిస్తోంది నాకు. “
“మొట్టమొదట కథ పడటాన్ని ఫెయిల్యూర్ అని ఎందుకు అన్నానంటే నా మనసు ఆ కథలవైపు మళ్ళింది కనుక. కథల నుంచి నవలల వైపు, ఆ తర్వాత సీరియల్స్ వైపు, తర్వాత సినిమాల వైపు, డైరెక్షన్ వైపు మళ్ళడాన్ని ఫెయిల్యూర్స్ అని ఎందుకు అంటున్నానంటే, నా పందొమ్మిదవ ఏట నేను దైవానికి దగ్గరి ఉంటే ఇప్పుడు అనుభవిస్తున్న స్థితిని గతంలోనే అనుభవించి ఉండేవాడిని కదా అని.
దాదాపు రెండేళ్ళు ఇలాంటి పచ్చత్తాపంతో బతికాను. ఇప్పుడది కూడా లేదు. ఎందుకంటే, ధ్యానం చేస్తుండగా ఈ పచ్చత్తాపానికి సమాధానం దొరికింది. ధ్యానంలోని మహిమ అది. ఇట్లా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. రాను రాను కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు కూడా.
తమాషా ఏమిటంటే, ఒక ప్రశ్నకు సమాధానం దొరకక పోతే అప్పుడు ఆ ప్రశ్నే రద్దయిపోతుంది. అప్పుడిక సమాధానం దొరికే అవసరమే లేదు కదా! అదీ ఇప్పటి నా స్థితి” అని చెప్పడం ముగించారు మల్లాది.
హైదరాబాద్ లోని గాంధీ నగర్ లోని వారింట్లో… దాదాపు రెండు గంటలకు పైగా ఆయన తన వైఫల్యగాథ వివరించారు.
అంతసేపూ ఆయన మొహంలో ఎలాంటి బడలిక లేకపోగా మరింత ప్రసన్నంగా కనిపించడం విశేషం.
అయన చెప్పిందంతా విన్నాక, ఈయన ‘ప్రాక్టికల్ జోక్ చేయడం లేదు కదా’ అనే సందేహం వచ్చింది. అదే అంటే, చిన్నగా నవ్వి -లేదన్నారు.
“ఆధ్యాత్మక చింతనలో అభిరుచి కలిగాక మీ రచనా వ్యాసంగానికి దెబ్బ తగిలిందా?” అని అడిగితే, ఎంతమాత్రం లేదని చెప్పారు. “నిజానికి నా రచనా వ్యాసంగం అగకపోగా కొత్తగా ఆధ్యాత్మిక అంశాలను రాయడం పట్ల గురి కుదిరింది కూడా” అన్నారు.
“రచయితగా విఫలమవుతున్న సందర్భంలో మీరు ఈ ఆధ్యాత్మికత ముసుగు ధరించారనే విమర్శ ఉంది. దీనిపై మీ కామెంట్ ఏమిటీ?” అన్న ప్రశ్నకు కూడా వారు కూల్ గానే జవాబిచ్చారు.
“మీరే కాదు, ఒక ఎడిటర్ నా మొహం మీదే ఈ మాట అన్నారు. టివీ సీరియల్స్ వచ్చాక పత్రికలూ తక్కువై రాయలేకపోతున్నానని కొందరు అన్నారు. రైటర్ గా ఫెయిలైపోయి, ఆ ఫెయిల్యూర్ గురించి మథనపడి ఏం చేయాలో తోచక ఆధ్యాత్మికత వైపు వెళ్లానని అన్నవారూ ఉన్నారు. అయినా ఇలాంటి విమర్శలను నేను పట్టించుకోను. వాళ్ళలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే, వారలా అనుకోకూడదనే కోరిక నాలో లేదు. అది ఉన్నప్పుడు కదా కోపం వచ్చేది” అన్నారాయన మృదువుగా.
ఉపసంహారం
“మల్లాది గారూ…ఒక సందేహం. ఇంత వివేకం సంపాదించి ప్రస్తుతం ‘శృంగారం డాట్ కామ్’కు ఎడిటర్ గా ఎలా ఉండగలుగుతున్నారు?” అని అడిగితే ఆయన ఇలా వివరించారు.
“రెండు వారాల క్రితం ఒకరొచ్చి, శృంగారం డాట్ కామ్ అనేసరికి ఎవ్వరూ రావడం లేదు. మీరు ఎడిటర్ గా ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఆ స్వార్థంతో అడుగుతున్నాం” అన్నారాయన.
“ఓ.ఎస్” అని ఒప్పుకుని దాన్ని ఎడిట్ చేస్తున్నాను. వాళ్లకి కావలసిన పద్దతిలో, అంటే శృంగారం డాట్ కామ్ ఎలా తెస్తే బావుంటుందో అలాగే తెస్తున్నాను. అయితే పూర్వం నేను బాగా చేస్తున్నాననే ధీమా ఉండేది. ఇప్పుడది లేదు. ఎందుకంటారా? గతంలో నేను నా రచనలపై లేదా నా కర్మలపై ఒనర్ షిప్ ఉండేదని భావించాను. అందుకే గడిచిన జీవితం వేరు. ఇప్పటి జీవితం వేరు. ఇప్పుడు నా జీవితం దైవాజ్ఞతో జరుగుతోంది. నా ప్రారబ్ధ కర్మానుసారం జరుగుతోంది. ఆ డాట్ కామ్ వాళ్ళతో లింక్ ఉంది కాబట్టి వాళ్ళు నాకు డబ్బులిస్తున్నారు. నేను వాళ్లకి వర్క్ చేస్తున్నాను. ఆ మేరకు నేను క్షాళనం అవుతున్నాను” అన్నారాయన, సంతృప్తి నిండిన గొంతుతో.
ఇదీ, మల్లాది అలోకిక లోకిక వైఫల్యగాథ.
ఇది ఆదివారం ఆంధ్రజ్యోతి, 1 ఆగస్టు 2004లో సంచికలో ప్రచురితమైంది. మళ్ళీ ఈ కథనాన్ని నేడు మల్లి టైపు చేసి మీకు అందివ్వడంలో నాకు ఎంతో సంతృప్తి ఉంది. జీవితంలో ఎన్నో అనుభవాలు గడించారు వారు. అందులో పైన పేర్కొన్నవి మటుకు వారిలో పెను మార్పు. ఇప్పటికీ అలాగే ఉన్నారా లేదా అన్నది నేను కనుక్కోలేదు. కాకపోతే, రచయితగా వారు మనపై చెరిగిపోని ముద్ర వేశారన్నది వాస్తవం. మొత్తం వారి సాహిత్యం నావరకు నాకు, వారి శీర్షికతో చెప్పాలంటే, ‘జాబిలి మీది సంతకం’. వారి యాభై సంవత్సరాల వారి ప్రస్థానానికి అభినంధనలతో, నిండు నూరేళ్ళ జీవితాన్ని ఆకాంక్షిస్తూ, వారి ‘నవల వెనుక కథ’కు ఇదే సాదర ఆహ్వానం.
నాకు వారి స్వహస్తాలతో పంపిన కాంప్లిమెంటరీ కాపీ కోసం ఎదురు చూస్తూ…
కందుకూరి రమేష్ బాబు
22.10.2020
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.