ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
విమర్శలు చేయడం చాలా సులభం – Telugu Short Stories
ఒక యువ చిత్రకారుడు, గురువుగారి దగ్గర పైంటింగ్ నేర్చుకొని తన నైపుణ్యాన్ని తెలుసుకోవాలని ఒక కళాఖండాన్ని వేసి ఆ పట్టణంలో ఒక కూడలిలో, ఒక బోర్డుతో పాటు పెట్టాడు. “నేనొక అభ్యుదయ కళాకారుడిని. ఈ పనిలో నాకు పెద్దల ఆశీస్సులు కావాలి. నా చిత్రంలో తప్పులుంటే X గుర్తు పెట్టండి. భవిష్యత్తులో నేను ఎదగడానికి ఉపయోగ పడుతుంది.”
ఆ సాయంత్రం ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చి చూసి హతాశుడయ్యాడు. చిత్రమంతా గుర్తులతో నిండి పోయింది. గురువుగారి దగ్గరకు నిరాశతో వచ్చి, “నేను పనికిరాను, నా చిత్రాన్ని ప్రజలు నిరాకరించారు. నా శ్రమంతా వృధా! మరణమే శరణ్యం.”
“భయపడకు ! నీవొక గొప్ప కళాకారుడివని నిరూపిస్తాను. మరొక చిత్రం అటువంటిదే వేసి తీసుకురా !” అన్నాడు. మూడు రోజుల తర్వాత అటువంటి చిత్రం తయారు చేసి గురుశిష్యులిద్దరూ ఇంతకు ముందు ప్రదర్శనకు పెట్టిన చోటికి వెళ్లి ఈ పటాన్ని కూడా అదే చోట పెట్టారు.
అంతకు ముందు రాసినట్లే ఒక బోర్డు మీద “నేను ఈ చిత్రకళకు కొత్త, అనుభవజ్ఞులు, కళాకారులు ఈ పైంట్లతో, బ్రష్ లతో తప్పులు దిద్ది, తమ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి,” అని రాసి కొన్ని రంగులు, బ్రష్ లు పెట్టి వెళ్లిపోయారు. రెండు, మూడు రోజుల తర్వాత పోయి చూస్తే పైంటింగ్ చెక్కు చెదరకుండా, ఒక్క దిద్దుబాటు, మార్పు లేకుండా అలాగే ఉంది.
విమర్శలు చేయడం చాలా సులభం, కానీ ఒక వ్యక్తిని మెరుగుపరచడం కష్టం.
సేకరణ – V V S Prasad