ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి. ఏదయినా సరే బేరమాడటంలో అవతలి వ్యక్తికి విసుగు తెప్పించి తను లాభపడాలని కోరుకునే మస్తత్వము గల వ్యక్తి. ఒక దినమున అరణ్యమార్గము గుండా పట్నము వెళ్తున్నాడు. తనతోపాటు ఎవరూ లేరు. అతనిని చూస్తే వర్తకులుగాని, సాటివారు గానీ, హడలెత్తేవారు. అరణ్యమార్గములో పోతూవుండగా చెట్టు పొద సమీపములో బక్కచిక్కిన శరీరముతో వున్న ఋషి పడి వున్నాడు.
అతను ‘దాహం.. దాహం’ అని వినీ వినపడనట్లుగ అంటుంటే గోవిందయ్య వెళ్ళి తన వద్దగల మంచినీళ్ళు మునీశ్వరుని నోట్లో పోశాడు. కళ్ళు తెరిచి ముని “చివరి ఘడియల్లో నాకు దాహార్తిని తీర్చినావు. నీ మేలు మరవను. నాకు ఇది చివరి నిమిషం. నిమిషంలో మృత్యువు నన్ను సమీపించనుంది. వెంటనే ఏదైనా వరము కోరుకో… నేను ప్రసాదించగలను” అన్నాడు.
గోవిందయ్య దురాశతో “మునీశ్వరా! ఒక వరమంటే నేను ఏం కోరుకోను. కనీసము మూడు వరాలైనా ఇవ్వండి స్వామీ” అన్నాడు. అప్పటికే మునీశ్వరుని కళ్ళు మూతలు పడసాగాయి. శక్తి సన్నగిల్లింది అయినా “అలా వీలుకాదు నాయనా! ఏదయినా వరం కోరుకో! ఆలస్యము చేయకు” అన్నాడు మునీశ్వరుడు తన శక్తినంతా కూడదీసుకుని.
గోవిందయ్యలో వ్యాపార సరళి ప్రవేశించింది. కనీసము రెండు వరాలైనా కోరుకోవాలనే కాంక్ష బయలుదేరింది. అతనిలో గల ఆశపోతుతనము అతన్ని వివశుణ్ణి చేసింది. వెంటనే “పోనీ కనీసం రెండు వరాలయినా ఇవ్వంది స్వామీ” అని అన్నాడు అసంతృప్తిగా..
వెంటనే మునీశ్వరుదు “అలా సాధ్యముకాదు నాయనా! నేను నీకు వరము ఒక్కటే ఇవ్వగలను. ఆలస్యము చేయక వెంటనే కోరుకో” అన్నాడు. అప్పటికే ఋషిపుంగవుని మాటలు తడబడి చివరి శ్వాస తీసుకునే ప్రయత్నములో వున్నాడు. గోవిందయ్యలో ఆశపోతు తనము చావలేదు. ఏం కోరుకోవాలా అని ఆలోచిస్తూ మునీశ్వరుని వంక చూశాడు.
అప్పటికే ఆ మునీశ్వరుని ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. తన ఆశపోతు తనమే తనకు శాపముగా మారిందని తలిచాడు. ఒక్కటైనా మంచి వరం కోరుకొని వుంటే బాగుండేది కదా తనకు దక్కిన అదృష్టము చేజారిపోయింది కదా అనే విచారముతో ఇంటి ముఖము పట్టాడు. తన దురాశే దుఃఖమునకు మూలము అని గ్రహించి అప్పటి నుంచి అందరితో సఖ్యతగా వుంటూ కాలము గడిపాడు.