Menu Close

దేవుడు మెచ్చేది ధర్మ మార్గాన్నే – Telugu Moral Stories

తృప్తిని మించిన సంపద లేదు!

మనిషికి కోరికలు అనంతం. జీవితం నీటి బుడగ వంటిదని తెలిసీ కలకాలం బతకాలనుకొంటాడు. నిరంతరం సుఖాల్లో తేలియాడాలని తపిస్తాడు. తేలికగా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు. భగవంతుడి దయ ఉంటే తన కోరికలు తీరతాయన్న స్వార్థంతో పూజిస్తాడు. భగవంతుడు దయామయుడు. అందరి ప్రార్థనలు వింటాడు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు. నిస్వార్థంగా భగవంతుని నమ్ముకున్నవారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు.

కైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుణ్ని సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు. రావణుడు వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తికాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదో తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు.

తనకు మరణం లేని వరం ప్రసాదించమంటాడు. అలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకొమ్మంటాడు బ్రహ్మ. మానవులు తనకు గడ్డిపరకల వంటివారని, కనుక దేవతలు, గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు రావణుడు. అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు.

కుంభకర్ణుడు గ్రీష్మ రుతువులో అగ్ని మధ్య నిలబడి, వర్షరుతువులో వానలో తడుస్తూ, శిశిరరుతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీయ సంకల్పించగానే- అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు అడ్డుపడతారు.

సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే- నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిద్దుర కావాలంటాడు కుంభకర్ణుడు. తథాస్తు అంటాడు కమలాసనుడు.

విభీషణుడు ఒంటికాలిపై నిలబడి అయిదు వేల సంవత్సరాలు, సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో అయిదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకొమ్మంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని, సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మమార్గాన్ని వీడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరతాడు.

ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు. లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు. కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు. కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు.
‘భగవంతుడి శరణు వేడుతున్నవారు పరమేశ్వరుడి ప్రీతి కొరకు వేచి ఉండాలి.

తమ ఇచ్ఛానుసారం ఈశ్వరుణ్ని జరిపించమని కోరడమంటే ఆయనను శాసించినట్లవుతుంది. ఆయనను ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి తెలుసు’ అన్న రమణ మహర్షి బోధను అర్థం చేసుకున్నవారికి- భగవంతుణ్ని కోరికలు లేని శరణాగతి వేడుకోవాలని అవగతమవుతుంది.

తృప్తిని మించిన సంపద లేదు. అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడం లేదని ఆవేదన చెందేవారికి జీవితమంతా ముళ్లబాటే. భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో జీవనం సాగించేవారికి ఆనందం వెన్నంటే ఉంటుంది.
ఈనాడు అంతర్యామి

ఇంద్రగంటి నరసింహమూర్తి

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Subscribe to Our YouTube Channel

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading