ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మయూరధ్వజుని కథ – మహాభారతం లోని కథ – Telugu Stories
ధర్మరాజు చేసే అశ్వమేధయాగం లోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు అమితపరాక్రమవంతుడు శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వం విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి వచ్చారు శ్రీ కృష్ణార్జునులు. శ్రీ కృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు.
భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్దనీతి పాటించి ప్రతి బాణాం వేసే ముందు శ్రీ కృష్ణ నామ స్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణారుజునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. “ఇతన్ని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదా” అని అడిగిన అర్జునునితో శ్రీ కృష్ణుడు “ఫల్గుణా! నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. ఈతని ధర్మబుద్ధి నీకెఱిగించెద” అని అన్నాడు. మరునాడు శ్రీ కృష్ణార్జునులు విప్రవేషం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్ళారు.
అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మాఱువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు “రాజా! నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చినది. అది తీరిన తరువాతే మేము ఇతరములు ఆలోచిస్తాము”. “అయ్యా! మీ కష్టమేమిటో చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తాను” అని మయూరధ్వజుడు వేడినాడు. “రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్దపులి పట్టుకుంది.
ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది. “మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు”. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను” అని శౌరి బదులిచ్చాడు. “ఆహా! ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. దీని కన్నా నేను కోర తగ్గది ఏమీ లేదు.
నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండి” అని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చివేయమన్నాడు. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని వుంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమ్రింగుకోని మయారధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు.
మహాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులై చూస్తున్న శ్రీ కృష్ణార్జునులకు ఓ వింత కనబడింది. మయూరద్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్ళు కారుతున్నాయి. సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు “రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషముగా మనస్ఫూర్తిగా చస్తేనే అది త్యాగమవుతుంది.
ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం. మనని చూసి మనమే కన్నీరు కార్చడం నైచ్యమ్”. “అయ్యా! నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం నివియోగపడుతోంది. ఎడమ భాగ శరీరం “నాకా అదృష్టం లేదే” అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ” అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు.
ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీ కృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు. మనం ఈ కథలోని నీతిని చూద్దాము….. మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం అసామాన్యం. శ్రీ కృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషముగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగంచేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు.