Menu Close

ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు – Moral Stories in Telugu


భక్త తుకారాం పాండురంగడి భక్తుడు. నిరంతరం దైవ నామ స్మరణలో గడిపేవాడు. దేవుణ్ణి కీర్తిస్తూ అభంగాలు రచించి గానం చేసేవాడు.
తుకారాం భక్తి ప్రపత్తులకు ఆకర్షితుడయ్యాడు ఆ వూళ్ళోని ఒక భక్తుడు. అతడు తరచుగా భక్త తుకారాంని ఇంటికి ఆహ్వానించి అతనితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవాడు.

అలా తుకారాం వచ్చి భర్తను కలవడం భక్తుని భార్యకు నచ్చేది కాదు. తన భర్త తుకారాంని కలవడం వల్ల ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ తనను పట్టించుకోటం లేదని బాధపడేది. కొన్నాళ్ళకు ఆ బాధ కాస్తా కోపంగా మారింది. భక్త తుకారాం మీద పగ తీర్చుకోవాలన్నంత కసి పెరిగింది ఆమెలో.
ఒక రోజు ఆ భక్తుని ఇంటికి వెళ్ళాడు తుకారాం. వారిద్దరూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుండగా భక్తుడి భార్యకు మనసులో అప్పటికే ఉన్న కోపం తారాస్థాయికి చేరుకుంది.

ఎలాగైనా తుకారాంని తమ ఇంటికి రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఒక గిన్నెలో నీరు నింపి పొయ్యి మీద బాగా మరిగించింది. ఆ వేడి నీరుని తుకారాం కాళ్ళ మీద పోసినట్టయితే తన పగ చల్లారుతుందని తరువాత నుండి తుకారాం బాధ తప్పి పోతుందని అనుకుందామె.

వేడి నీరున్న గిన్నెను గుడ్డతో పట్టుకుని వంటగది నుండి బయటకు వచ్చి నడుస్తుండగా అనుకోని విధంగా ఆమె కాలు జారి క్రింద పడింది. మరుక్షణం గిన్నె లోని వేడినీరు ఆమె ఒంటి మీదనే చిలికి ఒళ్ళంతా బొబ్బలెక్కాయి. బొబ్బల బాధను తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తూ అరిచింది భక్తుని భార్య.

భార్యకు ఏమైందోనని భక్తుడు ఆందోళన చెందుతుండగా అతడితో బాటూ తుకారాం కూడ లోపలకు వెళ్ళాడు. అక్కడ భక్తుడి భార్య బాధతో గిలగిలా కొట్టుకుంటోంది. ఆమెకు జరిగిన ప్రమాదం చూసి చలించిపోయాడు తుకారాం. భగవంతుని స్మరిస్తూ ఆమె శరీరం మీద స్పృశించాడు. తుకారాం చేయి ఆమెను తాకగానే ఆమె బాధ మటుమాయమై పోయింది. అంతే కాకుండా కాలిన బొబ్బలన్నీ మాయమై పోయాయి.

​తాను చేసిన తప్పుకు కుమిలిపోతూ భక్త తుకారాం పాదాలపై పడి క్షమించమని వేడుకుంది . విశాల హృదయం గల తుకారాం ఆమెను క్షమించాడు. తనను పాండురంగడే కాపాడాడని తుకారాం మనసులోనే దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఎవరు తీసిన గోతిలో వారే పడతారని తెలుసుకున్న భక్తుని భార్య తుకారాంని గౌరవించడం నేర్చుకుంది. తరువాత నుండి భర్తను తుకారంతో వెళ్లేందుకు ప్రోత్సహించింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
0
+1
0
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading