Menu Close

శ్రీకృష్ణుడు పడ్డ కష్టాల గురుంచి మీకు తెలుసా – Life Lessons from Mahabharatham

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

శ్రీకృష్ణుడు పడ్డ కష్టాల గురుంచి మీకు తెలుసా – Life Lessons from Mahabharatham

ఎక్కువ సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు.
ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు, ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు.

Krishna-Hindu-God-Story-Birth-Festivals-temples

శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు.
శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు.
చూశారా! పురిటికందుకే ఎన్ని కష్టాలో! కేవలం కొన్నిరోజుల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన.

అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా – శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది.

కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి.
ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకరయుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ శ్రీకృష్ణుడే జయించాడు.
కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే “కాలయవనుడు” అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది.
యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు.
అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ, ఒక హత్యానేరాన్నీ మోశాడు.

ఎన్నో కష్టాలు పడి, పరిశోధించి, శమంతకమణిని సాధించి తెచ్చి, తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు.
జాంబవతిని పెళ్ళాడేముందు, ఆమె తండ్రియైన జాంబవంతునితో భయంకర యుద్ధం చేశాడు.
అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు, మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది.
జీవితమే ఒక పోరాటమయింది శ్రీకృష్ణునికి.

చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే, చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు.


తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు.
ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు.
కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా, శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె! శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. యాదవకుల నాశనానికి “ముసలం” పుట్టింది.

తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగుపెంటలైపోతున్నా,
విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి.

శ్రీకృష్ణుని జీవితం పూలపానుపేమీ కాదు; దారుణమైన ముళ్ళబాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో, అష్టకష్టాలతో గడిచిందో ఈసారి మీరే చెప్పండి.
మనకు చిన్న కష్టం వస్తే చాలు, ఎంతో బాధపడి పోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడేనని నిందిస్తాం. కాని, భగవంతుడు, శ్రీకృష్ణునిగా మానవరూపం దాల్చి, మానవులకంటే ఎక్కువ కష్టాలూ, సమస్యలూ అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాల్లో వందోవంతు కష్టాలు పడిన మానవులు ఎవరైనా ఉన్నారా?

నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే! కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే! అనుభవించడం కష్టం. కాని, శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు…..

భగవద్గీత చెప్పే జీవిత పాఠాలు – Life Lessons from Bhagavad Gita – Lord Krishna

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading