Menu Close

Moral Stories in Telugu Text – మోరల్ స్టోరీస్

చీర అంచులు అటూ ఇటూ తగలకుండా కుచ్చిళ్ళు పట్టుకొని ఆ సెకండ్ క్లాస్ బోగీలోకి ఎక్కింది డాక్టర్ భావన. చిలకాకుపచ్చ మైసూర్ సిల్క్ శారీ ఆమెకు మరింత అందాన్ని తెస్తున్నది. సన్నగా, నాజూగ్గా ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత అందంగా ఉంది. డ్రైవర్ ఆమె హ్యాండ్ బ్యాగ్, సూట్ కేసు పట్టుకొని సీటునంబర్ చూస్తూ ముందు నడుస్తున్నాడు.

ఆమె సీటు నంబరు మధ్యలో ఉంది. ఇటు ఎవరో పల్లెటూరి అమ్మాయి కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చుని ఉంది. అటు కిటికీ దగ్గర ఓ పెద్దావిడ కూర్చొని ఉంది. ముఖం నిర్మలంగా ఉంది. మనిషి సాధారణంగా ఉన్నది. భావన విసుగ్గా డ్రైవర్ ముఖం చూసింది..

భావన తనకారులో వైజాగ్ బయల్దేరింది. ఏలూరు దగ్గర్లో కారు పాడయింది. “కారు ఎలావుందో ముందు చూసుకోవద్దా?” అని డ్రైవర్ ను కేకలేసింది. సడన్ గా జరిగిన దానికి అతను మాత్రం ఏం చేస్తాడు? మెకానిక్ వచ్చి చూసి ఇంజన్ డౌన్ రెపైర్ చేయాలి అన్నాడు. ఏలూరు స్టేషన్ లో డ్రైవర్ కు తెలిసినవాళ్ళుంటే వైజాగ్ వెళ్లే ట్రైన్ లో అప్పటికప్పుడు సీటు సంపాదించాడు.

ఏసీ లో సీటు దొరకనందుకు చికాకు పడుతూ ట్రైన్ ఎక్కింది భావన. తప్పదు మరి. వైజాగ్ లో రేపటినుండి సాహితీ సమావేశాలు. రేపటి సమావేశానికి తానే అధ్యక్షురాలు. రైళ్లు, బస్సులు ఎక్కాలంటే భావనకు చిన్నతనంగా ఉంటుంది. “తనలాంటి మహారచయత్రి, పైగా డాక్టర్ – జనం మధ్య తిరగటమేమిటి? తనకోసం వాళ్లే రావాలి” అనుకుంటుంది భావన.

డ్రైవర్ ఆమె భావం గ్రహించి కిటికీ దగ్గర కూర్చున్న ఆవిడతో “మేడం ! ప్లీజ్ . మీరిటు జరుగుతారా? మా మేడం కిటికీ పక్కన కూర్చుంటారు” అని రిక్వెస్ట్ చేశాడు. ఆమె చిరునవ్వుతో పక్కకు జరిగింది. భావన ఆమెను తగలకుండా కిటికీ దగ్గర కూర్చుంది. డ్రైవర్ ఆమె సూట్ కేసు పైన సర్ది కదులుతున్న రైల్లో నుంచి గబగబా దిగాడు. “నా పేరు లలిత. ఎక్కడిదాకా వెళ్తున్నారు?” పక్కావిడ అడిగారు.

“నేను డాక్టర్ భావన” ఇంకా ఎక్కువ మాట్లాడే పని లేదన్నట్లు కిటికీ వైపు తిరిగింది భావన. చాయ్, కాఫీల అరుపులు వినబడుతున్నాయి. జామకాయల బేరాలు సాగుతున్నాయి. పల్లెటూరి అమ్మాయి అదే పనిగా వచ్చినవన్నీ కొనుక్కు తింటుంది. భావనకు కంపరంగా ఉంది. మధ్యాహ్నమైంది, లలిత సీటు కిందనుంచి బుట్ట తీస్తూ” మీరు భోజనం తెచ్చుకున్నారా?” అని భావనను మృదువుగా అడిగింది.

” ఆ” అంటూ భావన తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది. వంటమనిషి చపాతీ, కూర ప్యాక్ చేసి ఇచ్చింది. వాటర్ బాటిల్ తీసి భావన టిఫిన్ తినటం మొదలుపెట్టింది. లలిత తనబుట్టలోనుండి నాలుగు పేపర్ ప్లేట్స్ తీసి తాను తెచ్చిన దిబ్బరొట్టెలు, కొబ్బరి పచ్చడివేసి ముందుగా భావనకు ఇస్తూ “తీసుకోండి ” అంది చనువుగా.

“వద్దండీ ! నేనూ తెచ్చుకున్నానుగా” నిర్లక్ష్యంగా అంది భావన. ఆవిడ మరి మాట్లాడలేదు. తన పక్కనున్న అమ్మాయికి, ఎదురుగా ఉన్నవాళ్లకు పెట్టి తానూ తిన్నది. ఇంతలో పక్క కంపార్ట్మెంట్ నుండి పెద్దగా ఏడుపులు వినపడ్డాయి. ఎవరో చైను లాగమంటున్నారు. నీళ్లు చల్లమంటున్నారు. ఆ పల్లెటూరి అమ్మాయి గబుక్కున లేచివెళ్ళింది.

తిరిగి వచ్చి సంచిలో ఏదో వెతుకుతుంటే ఏమైందని అడిగింది లలిత. “చిన్నపిల్లండీ. పడిపోయింది. నోటిలోనుంచి నురగలొస్తున్నాయి” చెబుతూ సంచిలోనుండి తాళాలగుత్తి తీసుకొని వెళ్ళింది. “అయ్యో!” అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లలితకూడా వెళ్ళింది. భావన తనకేమీ పట్టనట్లు సెల్ చూసుకుంటున్నది.

పాపకు తనదగ్గరున్న ఇంజక్షన్ చేసి, మందులు వేసింది లలిత. ఏడుస్తున్న తల్లిదండ్రులకు ఏమీ పర్వాలేదని ధైర్యం చెప్పింది. ఈ మధ్య కాలంలో ఫిట్స్ రావటంలేదని మందులు వెంటబెట్టుకు రాలేదని చెప్పింది తల్లి. ” లేదమ్మా ! మీరెప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడిక పర్వాలేదు” అంటూ ధైర్యం చెప్పింది లలిత.

ఆ పసిపిల్ల తల్లిదండ్రులు లలిత కాళ్లు పట్టుకు దండాలు పెట్టారు. ఆమె వారిని విడిపించుకొని తనసీటులోకి వచ్చి కూర్చున్నారు. పల్లెటూరి అమ్మాయి భక్తిగా లలితను చూస్తూ కాళ్ళు కిందకు పెట్టుకొని దూరంగా జరిగి కూర్చుంది. “ఏమైంది ?” కుతూహలంగా అడిగింది భావన.

“ఈయమ్మ సూది మందేయంగానే పిల్ల లేచికూచుంది” ఆత్రంగా చెప్పింది పల్లెటూరి పిల్ల. ” ఉహూ” అని భావన లలితతో “మీరేంటీ? ఆరెంపీ నా” అని చులకనగా అడిగింది. లలిత చిరునవ్వు నవ్వింది. జవాబు చెప్పలేదు. అక్కడున్న వాళ్ళందరూ లలితను గౌరవంగా చూడటం భావనకు బొత్తిగా నచ్చలేదు.

“నేను ఎండి , పీడియాట్రిక్స్ , విజయవాడలో “వాత్సల్య” సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాదే. వైజాగ్ లో సాహిత్య సభలకు అటెండ్ అవుతున్నాను. నా అభిమాన రచయిత్రి నీలాంబరిగారు కూడా వస్తున్నారు. నాపుస్తకం ఆవిష్కరణ కూడా ఉంది ” గర్వంగా చెప్పింది భావన .

పల్లెటూరి అమ్మాయికి సరిగా అర్ధంకాక వెర్రిమొహం వేసింది. లలిత “అవునా” అన్నట్లు చూసి “నీలాంబరి మీకెలాతెలుసు?” అని నెమ్మదిగా అడిగింది. “ఆమె రచనలే నాకు ప్రేరణ. ఆమె కథలన్నా, నవలలన్నా నాకు ప్రాణం. ఆమె రాసిన పుస్తకాలన్నీ నాదగ్గరున్నాయి. ఆమె ఈ సభలకు వస్తారని, కలవవచ్చని అనుకుంటున్నాను” అని చెప్పుకుపోతూ భావన ఓ సారి లలితవైపు చూసి ” నీలాంబరిగారు మీకు తెలుసా?” అని అడిగింది.

“లేదు లేదు” నేను ఆమె రచనలు అప్పుడప్పుడూ చదువుతాను. అందుకే అడిగాను అన్నది లలిత. ఆమె కూడా నీలాంబరిగారి రచనలు చదువుతుందని తెలిసి భావన సంతోషించింది. కాస్త ప్రసన్నంగా “మీసంగతేమీ చెప్పలేదు!” అన్నది లలితతో. ” మేము పుట్టిపెరిగింది పల్లెటూరిలో. నేనూ, మావారూ వైద్యం చేస్తున్నాం. మాకు ఓపిక తగ్గేసరికి మాబాబు వస్తాడు.. ” అన్నది లలిత.

“మీ బాబు ఎక్కడ?” కుతూహలంగా అడిగింది భావన. “బాబు ఎం డి అయిపోయి అమెరికాలో స్పెషలైజేషన్ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం వస్తాడు. మాకు కాస్త విశ్రాంతి” చెప్పింది లలిత. “అదేమిటి! అమెరికానుండి వచ్చి పల్లెటూళ్ళో ప్రాక్టీస్ పెడతాడా?” భావన ఆశ్చర్యంగా అడిగింది. “అవును. బాబుకు మాతృభూమి మీద, అందునా తాను పుట్టిపెరిగిన ఊరంటే చాలా ఇష్టం” లలిత గర్వంగా చెప్పింది.

“ఏమిటో ఈ పిచ్చి?” మనసులో అనుకుంది భావన. కబుర్లలోపడి టైము తెలియలేదు. వైజాగ్ స్టేషన్ వచ్చింది. లలిత తనబ్యాగు సర్దుకుంద. పల్లెటూరిపిల్ల “నేను అందిస్తానమ్మా” అంటూ ఆమె బుట్ట పట్టుకుంది. భావన లేచి సూట్ కేసు, హ్యాండ్ బ్యాగు పట్టుకొని కాస్త ముందుకు వెళ్ళింది. ఎవరో తెలిసినవాళ్ళు ఎదురువచ్చి ఆమె సూట్ కేస్ అందుకొని చాలా గౌరవంగా తీసుకెళ్లారు.

మొదటిరోజు సాహిత్య సమావేశం భావన అధ్యక్షతన బాగా జరిగింది. రెండవరోజు సమావేశం మొదలైంది. ఆనాటి సభకు నీలాంబరిగారు అధ్యక్షులు. హాలంతా కళకళ లాడుతుంది. మైకులో పరిచయాలు మొదలైనాయి. గులాబీరంగు పట్టుచీర, దానిమీద ముత్యాలదండ – భావన అందం ద్విగుణీకృతమైంది. ఆమె తన తోటి రచయిత రామారావు గారితో చిన్నగా మాట్లాడుతోంది.

“ఏమండీ ! నీలాంబరిగారు వస్తారని మొన్న మీరు నాకు ఫోనులో చెప్పారు. నాపుస్తకం ఆమె చేతుల మీదుగా ఆవిష్కరింప చేద్దామని అనుకున్నాం కదా? ముందుగా చెప్పాలంటే.. వారు కనబడలేదు మాస్టారూ!” అంది భావన. “ఆమె వచ్చారమ్మా. డయాస్ మీదకు వచ్చిన తర్వాత చెప్పినా పర్వాలేదు. పుస్తకం ఆవిష్కరిస్తారు.

అందుకేగా స్లాట్ ఖాళీగా ఉంచాం. నువ్వావిషయంలో నిశ్చింతగా ఉండు” అన్నారు అయన. “మరి ఇప్పటివరకు ఆమె రాలేదు?” సందేహం వెలిబుచ్చింది భావన. పాడేరులో గిరిజనులకు ఓ హాస్పిటల్ కట్టించారు. దానికి నీలాంబరిగారు ఆర్ధిక సహాయం చేశారు. దాని ఓపెనింగుకు ఆమెను పిలిచారు. దానికి వస్తున్నారు కనుకనే ఈ సభలకు రావటానికి ఒప్పుకున్నారు.

ఆ భార్యాభర్తలిద్దరూ డాక్టర్లు. ఆ పల్లెటూళ్ళో పేదలకు వైద్యం చేయటమే వాళ్ళకిష్టం. రచనలు ఆమె ప్రవృత్తి. ఆమెకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు. “అంటూ ఆయన లేచివెళ్లారు. ఎదురుగా లలిత వస్తూ కనపడింది. ” ఏమిటి? ఈవిడ ఇక్కడకు వస్తున్నారు. ఎవరన్నా తెలిసినవాళ్ళు ఉన్నారేమోలే. “అనుకుంది భావన. అంతలో రామారావుగారు, ఆహ్వాన సంఘం సభ్యులంతా లలితకు ఎదురువెళ్ళి గౌరవంగా తీసుకు వచ్చారు. “భావనగారూ ! వీరే నీలాంబరిగారు” లలితను పరిచయం చేసారు రామారావుగారు.

ఆశ్చర్యపోవటం భావన వంతయింది. నమస్కరించడం కూడా మర్చిపోయింది. లలిత కాస్త ముందుకు వచ్చి “భావన గారు నాకు రైల్లోనే పరిచయమైనారు” అన్నారు అదే చిరునవ్వుతో. “ఆవిడ పుస్తకం మీరు ఆవిష్కరించాలి..” అన్నారు రామారావుగారు. “తప్పకుండా..” భావన భుజంమీద చేయివేసి ఆప్యాయంగా అంది లలిత.

భావన మనసులో రైలు ప్రయాణం గిర్రున తిరిగింది. తానెంత అహంకారంగా ప్రవర్తించింది. ఆ పిల్లకు ఫిట్స్ వస్తేకూడా పట్టించుకో లేదు. పైగా ఆమెవి పిచ్చిపనులుగా లెక్క గట్టింది. ఆమె రచనలలో పాత్రలు సంఘ సేవకులు, దేశభక్తులు, ధైర్యవంతులు, ఆదర్శమూర్తులు. తానూ ఆమె నవలలు చదివింది. చాలా ఇష్టపడింది.

ఆ పాత్రల్లాగా ఊహల్లోనే ఉండగలిగింది. నిజ జీవితంలో వాటికి దూరంగానే ఉంది. పైగా పేదరికాన్ని అసహ్యించుకుంది. అందుకే రాజాని ఇష్టపడి చేసుకున్నా వాళ్ళ కుటుంబానికి దగ్గర కాలేకపోయింది. వాళ్లను వదలలేకపోయిన రాజాని తానే వదిలివేసింది. తానేపాత్రలు సృష్టించిందో వాటికి దగ్గరగా జీవిస్తున్న నీలాంబరిని భావన ఆరాధనా భావంతో చూసింది.

ఆమెను అనుకరించలేక పోయినందుకు సిగ్గు వేసింది. ఆలోచనలతో భావన ముఖం మ్లానమైంది. ఇంతలో లలిత లేచి భావన చేయి అందుకుంది. ” రామ్మా !” అంటూ రామారావుగారు పిలిచారు. నీలాంబరి ( లలిత ) చేతులమీదుగా భావన పుస్తకం ఆవిష్కరింపబడింది. కృతజ్ఞతలు చెప్పటానికి వెళ్ళబోతూ భావన మనస్ఫూర్తిగా లలితకు పాదాభివందనం చేసింది.

పరాశరం శారదాప్రసాదు

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
1
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks