Menu Close

ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాలు – Happy Dussehra

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాలు – Happy Dussehra – Vijayadashami

three godess lakshmi durga sarasvathi

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగల్లో ‘దసరా’ ఒకటి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆ దుర్గమ్మను మనసారా సేవించడం, ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి.

అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాల గురించి మీరెప్పుడైనా విన్నారా? కనీసం ఈ మహానగరానికి ఈ పేరు ఎలా వచ్చిందని ఆలోచించారా? లేదా? అయితే అమ్మవారి పేర్ల మీద వెలసిన అలాంటి కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి ఈ ‘దసరా’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

ముంబయి – ముంబా దేవి: భారత దేశ ఆర్థిక రాజధానిగానే ఈ నగరం చాలామందికి సుపరిచితం. అయితే మరి, అసలు ఈ మహానగరానికి ఆ పేరెలా వచ్చిందని మీరెప్పుడైనా ఆలోచించారా? అక్కడ వెలసిన ‘ముంబా దేవి’ ఆలయం పేరు మీదే దీన్ని ముంబయిగా పిలుస్తున్నారు. అయితే దీని వెనుకా ఓ పురాణ కథనం ఉంది.

పార్వతీ మాత కాళికా దేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమ శివుని ఆదేశం మేరకు ఇప్పుడు ముంబయిగా పిలుస్తోన్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించిందట. ఆ జన్మ ద్వారా పట్టుదల, ఏకాగ్రతలను అలవరచుకోవాలని, మత్స్యకారులకు ఆ రెండు లక్షణాలు ఉండడం ఎంతో ముఖ్యమని చెప్పడం కోసమే అమ్మవారు ఈ జన్మ ఎత్తినట్లు చెబుతారు. అలా ‘మత్స్య’ అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు ‘ముంబా దేవి’గా మారినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.

అలా ఆ అమ్మవారి పేరు మీదే మన ఆర్థిక రాజధానికి ముంబయి అని పేరు వచ్చిందట. దక్షిణ ముంబయిలోని బులేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు రాతి రూపంలో దర్శనమిస్తారు. అలాగే వెండి కిరీటం, బంగారు నెక్లెస్, ముక్కుపుడకతో శోభాయమానంగా విరాజిల్లే ఈ అమ్మల గన్న అమ్మను దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.

సిమ్లా – శ్యామలా దేవి: ఈ పేరు తలచుకోగానే తెల్లటి దుప్పటి కప్పుకున్న మంచు పర్వతాలే గుర్తొస్తాయి.. వేసవిలోనైతే ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. మరి అలాంటి ప్రాంతానికి ఆ పేరెలా వచ్చిందో మీకు తెలుసా? అక్కడ కొలువైన అమ్మవారు శ్యామలా దేవి పేరు మీదే! సాక్షాత్తూ ఆ కాళీ మాతే శ్యామలా దేవిగా ఇక్కడ వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది.

ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామ వర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది. ఇలా ఈ దేవాలయంతో పాటు ఆహ్లాదాన్ని పంచే ఎన్నో ప్రదేశాలు సిమ్లాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

చండీగఢ్ – చండీ మందిర్: స్విస్ – ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లి-కార్బుసియెర్ డిజైన్ చేసిన అద్భుత నగరం చండీగఢ్. అటు పంజాబ్‌కు, ఇటు హరియాణాకు రాజధానిగా విరాజిల్లుతోన్న ఈ నగరానికి 2015లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం ‘హ్యాపియెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా’ అనే పేరొచ్చింది. మరి, ఇంతటి ఫేమస్ సిటీ పేరుకు అర్థమేంటో తెలుసా?

చండీ అంటే పార్వతీ దేవి ఉగ్ర రూపమైన చండీ మాత అని, గఢ్ అంటే కొలువుండే చోటు అని అర్థం.. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు రావడానికి అక్కడ కొలువైన ‘చండీ మందిర్’ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. ఈ చండీ గుడి, మాతా మానసి దేవి ఆలయం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో గల శివాలిక్ కొండలు ఈ ఆలయానికి మరింత శోభనిస్తున్నాయి.

మంగళూరు – మంగళా దేవి: కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటి. ఆహ్లాదకరమైన తీర ప్రాంతం గల ఈ నగరాన్ని కన్నడ వాణిజ్య వ్యవస్థకు ఆయువు పట్టులా పరిగణిస్తారు. ఇక్కడ కొలువైన మంగళా దేవి అమ్మవారి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరొచ్చింది. పురాణాల ప్రకారం.. మంగళా దేవి ఆలయాన్ని మహా విష్ణు దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు స్థాపించినట్టుగా తెలుస్తుంది.

నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు 9వ శతాబ్దంలో తులునాడును పరిపాలించిన అలుపా రాజవంశస్థుడు కుందవర్మన్ అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. కుందవర్మన్ ఈ ఆలయాన్ని కేరళ శిల్ప కళా నైపుణ్యంలో కట్టించడం విశేషం. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళా దేవి మాతకు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సప్తమి రోజున ‘చండీ’ లేదా ‘మరికాంబ’గా అమ్మవారిని కొలుస్తారు.

అష్టమి రోజున ‘మహా సరస్వతి’గా, నవమి రోజు ‘వాగ్దేవి’గా పూజలందుకుంటోందా అమ్మ. అలాగే నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహిస్తారు. దాంతో పాటు చండికా యాగం కూడా చేస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది.

కోల్‌కతా – కాళీ మాత: దేశమంతా దుర్గా దేవి శరన్నవరాత్రులు జరగడం ఒకెత్తయితే.. పశ్చిమ బంగలో జరిగే దసరా ఉత్సవాలు మరో ఎత్తు. ఇక ఈ దసరా సందర్భంగా ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో అయితే ఎటు చూసినా అమ్మవారి మండపాలే దర్శనమిస్తుంటాయి. అంతేకాదు.. ఇక్కడ కాళీ మాత దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి. మరి, ఇలా కోల్‌కతాకు ఆ పేరు రావడం వెనుక ఎన్నో పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది.

కాలిక్ క్షేత్ర అంటే.. కాళికా దేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. ఎర్రటి కళ్లతో, నల్లటి రూపంతో, నాలుక బయటపెట్టి ఎంతో గంభీరంగా కనిపించే ఈ దేవి తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను కడు దయతో కాపాడుతుంది. అలాగే ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ కాళీ మాత కొలువైన ‘కాళీఘాట్ కాళీ దేవాలయా’నికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది. ఇక ఈ కాళీ ఘాట్‌లో దసరా ఉత్సవాలు ఆకాశమే హద్దుగా, అంగరంగ వైభవంగా జరుగుతాయి.

పాట్నా – పతన్ దేవి: తూర్పు భారతదేశంలో రెండో అతి పెద్ద నగరమైన పాట్నాకు ఆ పేరు రావడం వెనుక శక్తి స్వరూపిణి అయిన ‘పతన్ దేవి’ అమ్మవారు కొలువైన ఆలయమే కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం.. దక్ష యజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతైన సతీ దేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడ భాగం ఈ ప్రాంతంలో పడిందట!

అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానంద కారి పతనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు ‘పతనేశ్వరి’గా, ఇప్పుడు ‘పతన్ దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది. దసరా సమయంలో పది రోజుల పాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులతో శోభాయమానంగా ఉత్సవాలు జరుగుతాయి.

నైనిటాల్ – నైనా దేవి!: నైనిటాల్.. పేరు వినగానే చల్లని వాతావరణం, అద్భుతమైన కొండ ప్రాంతాలే కళ్ల ముందు కదలాడతాయి. అంత అద్భుతమైన పర్యావరణం కలిగిన ఆ ప్రదేశం పేరుకు ఓ దివ్యమైన చరిత్ర ఉందని మీకు తెలుసా? దక్ష యజ్ఞంలో దహనమైన సతీ దేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది.

మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనా దేవిని, మహిషపీత్ అని కూడా పిలుస్తారు. అలా మహిషున్ని సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ‘జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు అప్పట్నుంచి ‘నైనా దేవి’గా పూజలందుకుంటోందట. శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.

ఇవి కూడా..!: ఇవే కాదు.. ఆ దుర్గా మాత పేరుతో విరాజిల్లే మరికొన్ని ప్రాంతాలు సైతం మన దేశంలో ఉన్నాయి.

అవేంటంటే..
త్రిపుర – త్రిపుర సుందరి,
మైసూరు – మహిషాసుర మర్దిని (కర్ణాటక)
అంబ జోగె – అంబ జోగేశ్వరి/ యోగేశ్వరి దేవి (మహారాష్ట్ర)
కన్యాకుమారి – కన్యాకుమారి దేవి (తమిళనాడు)
తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర)
హస్సాన్ – హసనాంబె (కర్ణాటక)
అంబాలా – భవానీ అంబా దేవి (హరియాణా)
సంబల్ పుర్ – సమలై దేవి/ సమలేశ్వరి (ఒడిశా)
మరి, ఈ దసరా వేళ అమ్మవారి పేర్లతో అలరారే ఈ ప్రాంతాల గురించి తెలుసుకోవడంతో పాటు..
ఆ ఆదిపరాశక్తిని మనసారా పూజిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని మూటగట్టుకోవచ్చు.
అందరికీ దసరా శుభాకాంక్షలు!

తప్పకుండా మీ కుటుంబంతో షేర్ చెయ్యండి

Dussehra significance in Telugu
Dussehra celebrations in Telugu
Dussehra rituals in Telugu
Dussehra history in Telugu
Dussehra festival in Telugu

Dussehra wishes in Telugu
Dussehra customs in Telugu
Dussehra story in Telugu
Dussehra greetings in Telugu
Dussehra traditions in Telugu

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading