Menu Close

అత్తమ్మలో నిజమైన అభ్యుదయం – Great Telugu Stories

అత్తమ్మలో నిజమైన అభ్యుదయం – Great Telugu Stories

“అత్తమ్మా! తలుపేసుకోండి. నేను ఆఫీస్ కు వెళుతున్నా!” అప్పటికే టైం అయిపోవడం తో గబగబా బయలుదేరాను. మా వారు బండి మీద తయారుగా వున్నారు నన్ను నా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళడానికి. పొద్దున్నే అందరి ఇళ్ళలో మాదిరే నాకు కూడా ఎంత త్వరగా లేచినా రోజూ హడావుడే అయిపోతూ వుంటుంది.

పిల్లలిద్దరిని రెడీ చేసి స్కూల్ కు పంపాలి. టిఫిన్ లు, లంచ్ బాక్స్ లు అయి నేను కూడా తయారవ్వాలి. అత్తమ్మ వున్నారు కానీ వయసు అయిపోయినావిడ. నాకు ఏం పని చేసివ్వక పోయినా నా పనికి అడ్డు రాకుంటే చాలనుకుంటాను. ఆవిడా నన్ను పెద్దగ విసిగించదు. మీతో పాటు నేను పరుగెత్తలేను. నీ పనులు చేసుకుని వెళ్ళవే నేను టిఫిన్ నెమ్మదిగా తింటాను అంటుంది.

indian art love women

పనిమనిషి మేము వెళ్ళాక వస్తుంది. తన దగ్గర పనులు చేయించటం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం ఆవిడ వంతు. ఈ మధ్య పని మనిషి కూడా అప్పుడప్పుడు ఎగ్గొడుతోంది. సాయంత్రం వచ్చే సరికి ఆమె వచ్చి వెళ్ళిందా సరే సారి. లేదా నా పని గోవిందా. ఆఫీస్ లో పని చేసి చేసి అలిసిపోయి వస్తే ఇంట్లో నా కోసం అంట్లు ఎదురు చూస్తూ వుంటాయి.

ప్రాణం వుస్సూరుమంటుంది. పోనీ పనిమనిషిని మార్చేద్దామా అంటే దొరకడమే గగనం అయిపోతోంది. అందుకే వాళ్ళు రావడమే అదృష్టం అన్నట్టు పని చేయించు కోవాలి.ఇదంతా ఒక ఎత్తు అయితే వారి కులం ఇంకొక ఎత్తు అయిపోయింది నా ప్రాణానికి. మా అత్తమ్మ కు ఈ పట్టింపు ఎక్కువ. మాదేమీ నిప్పును కడిగే వంశం కాకపోయినా ఏ రిజర్వేషన్లు వర్తించని ఒక అగ్ర కులం.

పల్లెటూర్లలో ఇంకా ఇలాంటివి పట్టించుకుంటూ వుంటారేమో గాని పట్టణాల్లో ఎక్కడ కుదురుతాయి? నేను చెప్పినా ఆవిడ వినదు. ఇలా నాకు, ఆవిడకు కూడా నచ్చిన పనిమనిషిని చూస్తే అదేమో నా సహనాన్ని పరీక్షిస్తూ వుంటుంది.ఆలోచనలు ఆగిపోకముందే మా ఆఫీస్ వచ్చేసింది. మా వారికి బై చెప్పి ఆఫీస్ లోకి వెళ్లి పోయాను.

అది నా మరో ప్రపంచం. పనిలో పడితే ఇక సాయంత్రం వరకు ఇంకేం గుర్తు వుండదు. సాయంత్రం అవుతోంది. పని ముగించి ఒక్కొక్కరే బయలు దేరుతున్నారు. పక్క సీట్ పావని బాగ్ సర్దుకుంటూ రండి ఇక వెళదాం అంటూ వచ్చింది. ఇద్దరం ఆఫీస్ లోంచి బయట పడ్డాం. “ పావని! నీకు తెలిసిన పని మనిషి వుంటే చెప్పు. ఈ మధ్య మా పనామె మరీ అద్వాన్నం అయిపొయింది.

వారంలో మూడు రోజులు రావటం లేదు.” అన్నాను. “చూస్తాను లే “ అని అంటూ ఉండగానే ఆమె భర్త రావడం తో వెళ్ళిపోయింది. వెనుకాలే మా వారు కూడా వస్తు కనిపించారు. ఇద్దరం ఇల్లు చేరాం. ఏముంది…. ఈ రోజు కూడా పనామె రాలేదు. అత్తమ్మ మోకాళ్ళు నొప్పులని పడుకుని ఉంది. ఉదయం ఎలా వదిలి వెళ్ళానో అలాగే ఉంది ఇల్లు. చేసేదేం లేక బట్టలు మార్చుకుని రంగం లోకి దిగాను.

మరుసటి రోజు ఆదివారం కావటం తో కొంచెం రిలాక్స్ గానే ఉన్నాం. ఉదయమే వచ్చిన పనిమనిషిని నిన్న ఎందుకు రాలేదని అడిగితే ఏదో నిర్లక్ష్యం గా సమాధానమిచ్చింది. నాకింక ఓపిక నశించింది. ఆమెకు రావాల్సిన డబ్బు లెక్క కట్టి ఇచ్చేసి ఇక రావక్కర్లేదు అని పంపేసాను. ఏదేదో శపించు కుంటూ వెళ్ళిపోయింది.

ఆమె రాదు అని తెలిస్తే పని చేసుకోవటం లో నా ప్లానింగ్ ఏదో నేను చేసుకుంటాను. అలా వారం రోజులు గడిచాయి. కానీ ఇంటి పని, ఆఫీస్ పని తో నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరో ఆదివారం వచ్చింది. ఇలా ఎన్ని రోజులు రా భగవంతుడా అనుకుంటూ వున్నాను. అక్కడికీ నా స్నేహితులకు, ఇరుగు పొరుగు వాళ్లకు అందరికి చెప్పి పెట్టాను ఎవరైనా పనిమనిషి దొరికితే పంపమని.

ఆ రోజు ఎవరో ఒక దేవుడు నా మొర ఆలకించి నట్లున్నాడు. గుమ్మం ముందు ఒక ఆమె ప్రత్యక్షం అయింది. ఓ 35 ఏళ్ళు ఉండచ్చు. పాత చీర అయినా ఉతికినదే కట్టుకుంది. తల నున్నగా దువ్వుకుంది. పనిమనిషి ఆహార్యం లో వున్న ఆమెని ఎవరని ఆరా తీస్తే ఆ వీధి లోనే చివరింటి వాళ్ళు మా సంగతి తెలిసి వాళ్లకు తెలిసిన పనామె ను పంపారుట.

హమ్మయ్యా అనుకుని ఆమె వివరాలు తెలుసుకుంటూ ఉండగానే మా అత్త గారు రంగప్రవేశం చేసారు. ఆవిడకూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉందిగా.
“ నీ పేరేంటి?” అడిగారు.
“లక్ష్మి అండి” వినయం గా చెప్పిందామె.
“ అమ్మాయ్ ! మీరు ఏ కులం” అనడిగింది.
“ ………….” ఆమె చెప్పింది.
మా అత్తగారు తృప్తిగా తల పంకించి “సరే ఈ రోజు నుండే పని మొదలు పెట్టు మరి “ ఛార్జ్ ఇచ్చేసింది.
పని కూడా చాలా నీట్ గా చేసింది. చెప్పిన పనులే కాక చెప్పని పనులు కూడా చేసింది. పిల్లలు చిందర వందర చేసిన వస్తువులు కూడా ఎక్కడివక్కడ పొందికగా సర్దింది. రోజు ఉదయాన్నే రావాలని చెప్పి పంపేసాను. అమ్మయ్యా……. నాకొక చింత తీరిపోయింది.

లక్ష్మి వచ్చాక నా ప్రాణానికి చాల హాయిగా ఉంది. ఎప్పుడూ పనికి నాగా పెట్టదు. ఒక వేళా అత్యవసరం అయితే ముందుగా చెప్పేది లేదా లేట్ గా అయినా వచ్చి పనులన్నీ చేసి వెళ్ళేది. నమ్మకం అయిన మనిషి. ఏదీ ఆశించదు. బలవంతం గా ఇస్తే తీసుకునేది తప్ప అడిగేది కాదు. విలువైనవి కళ్ళ ఎదురుగా వున్నా తాకేది కాదు.

indian art love women

అత్త గారికి కూడా లక్ష్మి బాగా మాలిమి అయిపొయింది. ఆమె మోకాళ్ళ నొప్పులకు అప్పుడప్పుడు తైలం పూసి మర్దన చేస్తూ వుంటుంది మరి. తనకు ఇద్దరు పిల్లలుట. భర్త పగలల్లా ఆటో నడిపి, రాత్రి అయ్యేసరికి మందు కొట్టేస్తాడట. మందు ఎక్కువైతే లక్ష్మిని కూడా కొడుతూ ఉంటాడట.

ఈమె అక్కడ ఇక్కడ పనులు చేస్తూ పిల్లలని చదివించు కుంటూ ఉంది. తన కథ విని జాలి కలిగి నేను కూడా చేతనైనంత సహాయం చేసేదాన్ని. పిల్లల బట్టలు, పుస్తకాలు, నా పాత చీరలు అన్ని ఇచ్చేదాన్ని. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇలా సాగిపోతున్న తరుణంలో ఒక రోజు నా కొలీగ్ పావని మా ఇంటికి వచ్చింది. మేము ఏదో మాట్లాడుకుంటూ హాల్లో కుర్చుని వున్నాం.

అంతలో కాఫీ పట్టుకుని లక్ష్మి వచ్చింది. పావని ని చూడగానే లక్ష్మి ఒకింత కంగారు పడింది. గబగబా కాఫీ ఇచ్చేసి అమ్మా! నాక్కొంచెం పని ఉంది, వెళుతున్నా అంటూ వెళ్ళిపోయింది. పావని ని చూసి లక్ష్మి ఎందుకంత కంగారు పడిందో నాకు అర్థం కాలేదు. విషయం ఏమిటని తననే అడిగాను.

“నీవు ఈమెను ఎలా పనిలో పెట్టుకున్నావ్? వాళ్ళు దళితులు. మా ఇంట్లో కూడా వేరే కులం అని చెప్పి చేరింది. నాకు నిజం తెలియగానే వెంటనే పనిలోంచి తీసేసాను. ఇప్పుడు నీకు కూడా నిజం చెప్తానని పారిపోయింది.” అంది పావని.

నాకు ఒక్క క్షణం చేదు తిన్నట్లు అయిపొయింది. ఇన్నాళ్ళూ మా ఇంట్లో తిరుగాడింది ఒక నిమ్న కులస్తురాలా? ఇన్నాళ్ళూ నేను ఇలాంటివి పట్టించుకోను అనుకున్నాను కానీ నాకు ఇంత వరకు అలాంటి అవసరం గాని, అవకాశం గాని రాలేదు. ఇక అత్తమ్మకు ఈ విషయం తెలిస్తే……..

పావని వెళ్ళిపోయాక కూడా నేనిదే విషయం ఆలోచించాను. కొంత సేపు గడవగానే నా వివేకం నన్ను మొట్టికాయ వేసింది. నా చదువు, సంస్కారం ఏమైపోయాయి? నేనింతగా దిగజారి ఎందుకు ఆలోచిస్తున్నాను? చివరికి ఒక నిర్ణయానికి వచ్చాను. తరువాతి రోజు నేను అనుకున్నట్టుగానే లక్ష్మి పనిలోకి రాలేదు. ఫోన్ చేసాను.

“ లక్ష్మీ! ఎందుకు పనికి రాలేదు? నువ్వు రాకపోతే నాకు ఇబ్బంది అని తెలిదా?” దబాయించాను.
“ రమ్మంటారా అమ్మా?” ఆశ్చర్యం గా అడిగింది లక్ష్మి.
“నీకెందుకు వచ్చింది అనుమానం? రమ్మని చెప్తున్నాగా!” ఫోన్ పెట్టేసాను.

అరగంట గడిచాక లక్ష్మి మెల్లగా వచ్చి నా ఎదురుగా నిలబడింది. ఆమె కళ్ళలో తప్పు చేసి దొరికిపోయి నప్పటి భీతి. “క్షమించండి అమ్మా! నా కులం పేరు చెప్తే ఎవరు పని ఇవ్వడం లేదు. పిల్లలు పస్తు పడుకోవడం చూసి తట్టుకోలేక అబద్దం చెప్పాను. ఇప్పుడు మీకిష్టం లేక పోతే పని మానేస్తాను.” అంది దీనంగా.
“ఏం మానేయ్య నక్కర్లేదు. వెళ్లి నీ పని చేసుకో.” అన్నాను.

లక్ష్మి ఆనందం గా లోపలికి వెళ్ళిపోయింది. ఇంతకు ముందు పనిమనిషిని కులం చూసి పెట్టుకున్నాం గాని ఎం ప్రయోజనం? పని చేసినంత సేపు దానికి కాపలా వుండాల్సిందే. టీ లు, టిఫిన్లు మాకు తక్కువైనా తనకు తగ్గకూడదు. విలువైన వస్తువులు కాస్త అజాగ్రత్త అయితే చాలు మాయం అయిపోయేవి. ఏమైనా మాట్లాడితే గొడవ పెట్టుకునేది లేదా పని మానేసేది. ఆమె కంటే లక్ష్మి ఎంత నయం.

అలాంటి లక్ష్మి ని కేవలం కులం కారణంగా వెళ్ళగొట్టడం ఎంత వరకు సబబు? కానీ అత్తమ్మ గారికి ఈ విషయం తెలియనంత వరకు పర్వాలేదు. తెలిస్తే….అమ్మో….అనుకున్నాను. కానీ ఆమెకు నిజం చెప్పెయ్యడమే మంచిది. లేకపోతే తర్వాత ఎక్కువ గొడవ చేస్తుంది అనిపించింది. లక్ష్మి పని ముగించి వెళ్ళిపోయాక మెల్లగా అత్తమ్మ గది లోకి వెళ్ళాను.

indian art love women

“ అత్తమ్మా! మీరేం అనుకోనంటే మీకు ఒక విషయం చెప్పాలి” అన్నాను నసుగుతూ.
“ నీవేం చెప్పాలను కుంటూ ఉన్నవో నాకు తెలుసు.” అంది ఆవిడ గంభీరంగా.
నేను అవాక్కయ్యాను.
“లక్ష్మి గురించేగా. నిన్న నువ్వూ, నీ స్నేహితురాలు మాట్లాడుకుంటూ వున్నపుడు నేనూ విన్నాను. మొదట నాకు కూడా కోపం వచ్చింది. కానీ తర్వాత ఆలోచించాను. లక్ష్మి గురించి తెలియనపుడు తన పనితనం గురించి మనం మెచ్చుకున్నాం. నాకు కూడా ఎంతో సేవ చేసేది. తానెవరో తెలియగానే అవన్నీ తప్పెలా అవుతాయి?

మనిషికి గుణమే గాని కులం ముఖ్యం కాదు అని తెలుసుకున్నాను. అందుకే లక్ష్మి మన ఇంట్లో పని చెయ్యడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.” అంది ఆవిడ.
అత్తమ్మలో నిజమైన అభ్యుదయం చూసాను నేనా క్షణంలో.

(ఈ కథ ఎవరిని ఉద్దేశించి గాని, మనోభావాలు కించపరిచేందుకు గాని రాయలేదు.)

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Great Telugu Stories, Moral Stories in Telugu, Best Stories in Telugu

Like and Share
+1
2
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks