Galli Chinnadi Lyrics In Telugu – Goreti Venkanna
గల్లీ చిన్నది… గరీబోళ్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇండ్లు… కిళ్ళీ కొట్ల కన్నా సిన్నగున్నవి
గల్లీ చిన్నది… ||2||
ఆ ఇండ్లకన్న మేలురా… ఫలకునామ బండ్లు రా
పాత రైలు డబ్బలోలె… పడాఉన్నవేందిరో
గల్లీ చిన్నది… ||గల్లీ||
తుమ్మై కడుపలూ… తుప్పు పట్టిన సిలుకులు
పుచ్చుతోని తలుపులేమో… పెచ్చులూడి ఉంటయీ
గల్లీ చిన్నది… ||గల్లీ||
ఎత్తు మనిషి సుట్టమై… కొత్త ఇంటికొస్తే రా
పైన కడప తగిలి… నెత్తి బొప్పికట్టి పోతదో
గల్లీ చిన్నది… ||గల్లీ||
దరువాజలిరుకు దగ్గర… జరిపి కట్టుకుంటరో
లావుగున్న కోడి పుంజు… కూర కష్టమైతదో
గల్లీ చిన్నది… ||గల్లీ||
కలిగినోల్ల కాలనీల… వరద మురుగు నీల్లురా
వీల్ల నల్లపైపు తోనె… వియ్యమందుకుంటయో
గల్లీ చిన్నది… ||గల్లీ||
వెలుగుతున్న బలుబులా… వెలుతురెంత ఉందిరా
నూటిక్కొక్క ఇంట్ల కూడ… ట్యూబ్ లైటు లేదురో
గల్లీ చిన్నది… ||గల్లీ||
సెకండ్ హ్యాండ్ టీవీ రా… దాని శబ్దమేందొ చూడరా
లోటల రాల్లేసినట్టు… లొడలొడ వినిపిస్తదో
గల్లీ చిన్నది… ||గల్లీ||
ఇంటిక్కొక్క గాధ రా… విచారిస్తే బాధ రా
ఆ గాధలన్ని తెలుసుకుంటె… గుండె గావరైతదో
గల్లీ చిన్నది… ||గల్లీ||
పాత పంపు ఇనుప టెంకి… రోడ్డు మీద పెట్టుకోని
గాలి కొట్టె పోరడేమో… జాలిగ చూస్తుంటడో
గల్లీ చిన్నది… ||గల్లీ||
పర్సుకున్న పట్టపై… పాణాలు పెట్టుకుంటడో
డొక్కు స్కూటరొస్తదని… దిక్కులు చూస్తుంటడో
గల్లీ చిన్నది… ||గల్లీ||
నడుములొంచి దొబ్బేటి… నాలుగు గిర్రల బండిరా
ఉల్లిగడ్డ అమ్మితేనే… కడుపుల కునుకొస్తదో
గల్లీ చిన్నది… ||గల్లీ||
మూడు జానల పోరడు… వాని బాధలేమో బారెడు
వాడు జేసె దంద సారెడు… వానికేడ తీరు బాధలు
గల్లీ చిన్నది… ||గల్లీ||
కాలేకడుపుకాసరా గాలి బుడుగలమ్ముడు…
పిన్నీసులు రిబ్బన్లు… కన్నీరును తూడ్సునా
గల్లీ చిన్నది… ||గల్లీ||
కల్లుపాక, ఎల్లమ్మ గుడి… కలుసుకోని ఉంటావీ
తాగినోళ్ళు ఊగుకుంట… రాగమెత్తుతుంటరో
గల్లీ చిన్నది… ||గల్లీ||
ఇరుకుఇంట్ల నరకమై… వీధులల్లకొస్తరో
పోరలేమో దుమ్ములోన… పొర్లాడుతుంటరో
గల్లీ చిన్నది… ||గల్లీ||
కోరి కోరి వారముల… కూర తెచ్చుకుంటరో
పుదీనా కొత్తిమీర… దాంట్ల కలుపుకుంటరో
గల్లీ చిన్నది… ||గల్లీ||
అల్లమెల్లిపాయ దంచి… మసాల దట్టించిన
మోరి గాలి వాసనకు… కూర కంపు కొడ్తదో
గల్లీ చిన్నది… ||గల్లీ||
దువ్వుకునే దువ్వెన… పళ్లిరిగిపోయి ఉంటది
ఎవ్వరింట్ల చూసినద్ధము… ఎందుకో పగిలుంటది
గల్లీ చిన్నది… ||గల్లీ||
సిత్తు బొత్తు బతుకులూ… సిన సిన దందలు
సిల్లర కొట్లల్ల వాళ్ళు… చిన్న ఖాతా పెడ్తరో
గల్లీ చిన్నది… ||గల్లీ||
ఏండ్లకేండ్లు గడిసెరా… ఎడ్డి బతుకులింతేరా
ఎవరేలినగాని గల్లి రూపమేమి మారేరా…
గల్లీ చిన్నది…
గల్లీ చిన్నది… గరీబోళ్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇండ్లు… కిళ్ళీ కొట్ల కన్నా సిన్నగున్నవి
గల్లీ చిన్నది…