Menu Close

Full Story of Seethakka Dansari – సీతక్క – కొండ దొరసాని.

ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాత్రుస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ జాడ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతని నాలుకమీద కాల్చిన ఇనపకడ్డీతో వాత పెట్టి, అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాకగానీ వాళ్ళు అతన్ని ఇంట్లోకి రానివ్వరు. అటువంటి తెగలో పుట్టిన ఆమె ఓ కొండ దొరసాని.

ఆదివాసుల సాధికారతను కాలరాసిన మధ్యయుగాలనాటి రాజ్య దురహంకారంమీద వీరోచితంగా పోరాడి తమ స్వాభిమానాన్ని చాటిన సమ్మక్క, సారలమ్మల పోరు వారసత్వం ఆమెది. ఆమె ‘రణధీర’ తనకి యుద్ధం కొత్త కాదు, ధిక్కారం తన రక్తంలోనే వారసత్వంగా తెచ్చుకుంది. అందుకే చిన్నతనంలో కత్తిపట్టి అడవి బాట పట్టినా ఎమ్మెల్యే అయ్యాక తన మనుషుల ఆకలి తీర్చడానికి కొండలు కోనలు దాటినా జనం కోసమే‼️

ఆమె పేరు ధనసరి అనసూయ అలియాస్ ‘సీతక్క’. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన సీతక్కకి కష్టాలు, కడగండ్ల గురించి పుస్తకాలలో చదవాల్సిన పనిలేదు. గ్రంధాలయాలలో వుండే పుస్తకాలకు మించిన జ్ఞానం ఆమెకి అనుభవాలనుంచి అబ్బింది.

పట్టణాలకు, గ్రామాలకు దూరంగా విసిరేసిన కోయ గూడెంలో అరకొర సౌకర్యాలు, అగచాట్లమధ్య పెరిగిన తనకి ఆకలి రుచి తెలుసు. అలాగే, సాయుధ దళాలలో అడవి లోతట్టు ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు కనీసం తినడానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా లేక పస్తులతో నడిచినరోజులు, పాచి పట్టిన అన్నాన్ని ఎండబెట్టుకుని తిన్నరోజులూ తెలుసు.

అడవిలో దొరికే ఆకూ, అలమా ఏరుకొచ్చుకుని, పోడు వ్యవసాయంలో పండిన రాగిగింజలతో అంబలి కాసుకుతాగే ధనసరి సమ్మక్క, సమ్మయ్యల రెండవ సంతానం ‘అనసూయ’. తనకంటే ముందు అన్న ‘సాంబయ్య’ వున్నాడు. సమ్మక్క, సమ్మయ్యల బిడ్డగా మొదలైన అనసూయ ‘సీతక్క’ గా మారడం వెనకవున్నది బతుకునుంచి వచ్చిన తిరగబడే తత్వమే‼️

వుమ్మడి వరంగల్ జిల్లా, (ప్రస్తుత ములుగు జిల్లా) ములుగు మండలం, జగ్గన్నపేటలో పుట్టింది. అటవీ గ్రామమైన తమ గూడెంకి తరచూ ‘అన్నలు’ వచ్చి కరపత్రాలు పంచి, పాటలు పాడి, జనానికి దొరల దౌర్జన్యాలను ప్రశ్నించే చైతన్యాన్ని అందించేవారు. అనసూయ మేనమామ ఆమె బాల్యంలోనే అన్నలలో కలసిపోయాడు. ఆమె అన్న ‘సాంబయ్య’ కూడా జనశక్తి పార్టీ కొరియర్ గా వున్నాడు.

హైస్కూలు రోజులనుంచే విద్యార్ధి ఉద్యమాలలో క్రియాశీలకంగా వుండే అనసూయ పదో తరగతి అయ్యాక జనశక్తి పార్టీ ఉద్యమకారిణిగా సాయుధదళాలలోకి వెళ్ళింది.అక్కడే ఉద్యమ తరగతులకు హాజరై సిద్ధాంతపరమైన పుస్తకాలు, సాహిత్యం చదివింది. ఆయుధాలు ఉపయోగించడం, దళాలను ఆర్గనైజ్ చెయ్యడంలో నేర్పుగలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందడంతోపాటు తక్కువ సమయంలోనే దళ కమాండర్ స్థాయికి ఎదిగి మూడు జిల్లాలకు తన కార్యక్రమాలను విస్తరింపజేసింది.

A Story of Seethakka Dansari

దళ కమాండర్ గా వున్నప్పుడు తన మారుపేరు రణధీర్’. నల్లగా, పొడుగ్గా, చలాకీగా ఖాకీ యూనిఫారంలో అచ్చం అబ్బాయిలాగే వుండేది. అయితే అక్కడ వుండే పితృస్వామిక ధోరణి ‘రణధీర్’ ని ‘సీత’ని చేసింది. ఉద్యమ పెద్దలు ‘కుంజా రాము’ అనే నాయకుడితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించి, పార్టీ పద్ధతుల్లోనే పెళ్లి జరిపినా, ఆ రాముడికి సహచరిగా ఆమె ‘సీత’, ‘సీతక్క’ అయ్యింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వాడైన రాము కూడా కోయ జాతికి చెందిన తన దూరపు బంధువు కావడం విశేషం.

సీత గర్భవతిగా వున్నప్పుడు పోలీసులకి చిక్కి అరెస్టై, జైలు జీవితం గడిపింది. ప్రసవం సమయానికి బైటికొచ్చి పుట్టిన రెండునెలల బాబుని బంధువులకు అప్పగించి మళ్ళీ రసహ్య జీవితంలోకి వెళ్ళింది. తర్వాత బంధువుల నుంచి బాబుని ఆమె తల్లి తీసుకెళ్ళి పెంచి హాస్టల్ లో చేర్చింది.‼️

సుమారు ఎనిమిదేళ్ళు జనశక్తి నక్సలైట్ గా, దళ కమాండర్ గా ఉద్యమానికి అంకితమై చావైనా, బతుకైనా జనం కోసమే అనుకున్న సీతక్కకి పార్టీలో ఏర్పడిన సిద్ధాంత పరమైన విభేదాలు, చీలికలు ఆమెని జనజీవన స్రవంతిలోకిరాక తప్పనిస్థితి కలిగించాయి. ఈలోపల తన భర్త రాముతో కూడా విభేదాలు వచ్చి విడిపోయింది. రాము జనశక్తి పార్టీలోనే కొనసాగి కొన్నాళ్ళ తర్వాత ఎన్కౌంటర్ లో చనిపోయాడు.

తన ఉద్యమ సహచరులంతా తలోదారి చూసుకున్నప్పుడు సీతక్క కూడా బైటికొచ్చి మధ్యలో ఆగిపోయిన చదువుని కొనసాగించింది. హైదరాబాద్ లో ఒక చిన్న రూమ్ తీసుకుని ఐదు సంవత్సరాల L.L.B పూర్తి చేసింది. తన ఖర్చులు, చదువు కోసం ఆదివాసుల సమస్యలమీద పనిచేసే ‘యక్షి’ అనే ఒక ఎన్.జి.ఓలో ఉద్యోగంలో చేరింది. నక్సలైట్ గా తెలంగాణలో బాగా గుర్తింపు పొందిన సీతక్క బైట ‘లా’ స్టూడెంట్ ‘ధనసరి అనసూయ’గా మళ్ళీ రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అయినా పాత కేసులు ఆమెని ప్రశాంతంగా బతకనివ్వలేదు.

ఎప్పుడుబడితే అప్పుడు పోలీసు స్టేషన్లకి పిలిపించేవారు. ఒకవైపు ఆర్ధిక ఇబ్బందులు, మరోవైపు కేసులు… ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు ఆమె రాజకీయాలను అనూహ్యమైన మలుపు తిప్పాయి.

‘లా’ పూర్తయ్యాక వరంగల్ వెళ్లి గతంలో తన కేసులు వాదించిన సీనియర్ అడ్వకేట్, వెంకటస్వామి గారి దగ్గర జూనియర్ లాయర్ గా చేరి కొన్ని నెలలు పనిచేశాక 2004 ఎలక్షన్లకు ముందు కొందరు మిత్రుల ప్రోద్బలంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆ బూర్జువా పార్టీకి కూడా జన సామాన్యంలో పాపులారిటీ వున్న ‘సీతక్క’ అనే మాజీ నక్సలైట్ ఇమేజ్ మీదనే మక్కువ కాబట్టి మళ్ళీ ‘ధనసరి అనసూయ’ ప్రజా నాయకురాలు ‘సీతక్క’ అయ్యింది.

తెలుగుదేశం పార్టీ(TDP) తరపున పోటీ చెయ్యడానికి పార్టీలో ఎప్పటినుంచో కొనసాగుతున్నా సీటు దక్కని వాళ్ళున్నప్పటికీ ప్రజాజీవితంలో మమేకమై గుర్తింపు పొందిన సీతక్కకి ములుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ(TDP)అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో షెడ్యూలు ట్రైబ్స్ కి రిజర్వు అయిన ములుగు అసెంబ్లీ నియోజకవర్గం సీటు రావడం సులభతరం అయింది. కానీ, 2004 లో రాజశేఖర్ రెడ్డి ప్రభావంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్ధి ‘మోదం వీరయ్య’ చేతిలో ఓడిపోయింది.

అయినప్పటికీ ఆమె వెనుకంజ వెయ్యకుండా అటు జనంలోనూ, ఇటు పార్టీలోనూ తన ప్రభావం పెంచుకుంటూ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అదే మోదం వీరయ్య మీద బంపర్ మెజారిటీ తో గెలిచింది. అయితే అప్పటికే మలి దశ తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తమ పార్టీ ఓడిపోవడంతో ప్రజలకు సీతక్క ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే స్థితి లేకపోగా తాను తెలంగాణా బిడ్డగా తన ఆంధ్రా పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాల్సి రావడం ఆమెని తీవ్ర ఘర్షణకు లోను చేసింది.

అయినప్పటికీ తన తెలంగాణా అస్తిత్వ ప్రకటన చేస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధుల సమ్మెకి మద్దతు పలికి వారితో పాటు ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్ష లో పాల్గొని అరెస్టై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించింది. 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా సీతక్క తెలుగుదేశం పార్టీలో వుండడం వలన ఆమెకి రాజకీయ లబ్ది జరగలేదు.

A Story of Seethakka Dansari

తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆమెకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవైపు, తెలంగాణా రాష్ట్ర సమితి (TRS) నుంచి ఒకవైపు ఆహ్వానాలు రావడం, ఆమె తెలంగాణాని ఇచ్చిందనే అభిమానం వల్ల, TDP రేవంత్ రెడ్డి కుటుంబంతో సీతక్కకి వున్న సాన్నిహిత్యం వల్ల ఆమె కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపింది.

మళ్ళీ ములుగు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ఈసారి కాంగ్రెస్ ప్రభావం తగ్గి పోవడం వలన తన ప్రత్యర్ధి TRS అభ్యర్ధి చందూలాల్ చేతిలో ఓడిపోయి 2018 అసెంబ్లీ ఎన్నికలలో అదే చందూలాల్ మీద కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయింది సీతక్క. మొదట తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలి స్థాయికి ఎదిగిన ఆమె తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై జనబాహుళ్యంలో గొప్ప ప్రాబల్యం, చరిష్మా కలిగిన నాయకురాలిగా, తనపార్టీలోనేకాక తెలంగాణా రాష్ట్రంలోనే ఒక ప్రజామోదం పొందిన మేటి నాయకురాలిగా గుర్తింపు పొందుతుంది.

పట్టుదలకు, పోరాట పటిమకు మారుపేరైన సీతక్క విప్లవ పార్టీలలోనే కాక బూర్జువా పార్టీల ప్రత్యక్ష రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె విప్లవ పార్టీలో నక్సలైట్ గా సీతక్క బాగా సాహసోపేతమైన నాయకురాలిగా, రెబల్ గా పేరుతెచ్చుకుంది. తన నాయకత్వంలోని దళం ఆడవాళ్ళమీద దౌర్జ్యన్యాలు చేసే మగ వర్గశత్రువులకు మర్మాంగాలను తెగ్గోయడం, గుండు కొట్టించి ఊరేగించడం వంటి శిక్షలు విధించేవారు.

ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఆదివాసుల సమ్మక్క, సారలమ్మ దేవతల మేడారం జాతరలో కోయ తెగవారికి భాగస్వామ్యం లేకపోవడంపై ప్రభుత్వ అధికారులతో చర్చించి ఆ దేవతల వారసులకు జాతరలో చోటు కల్పించడానికి కృషి చేసి సాధించింది. అలాగే ఆదివాసుల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ‘వన్ ఆఫ్ సెవెంటీ’ చట్టంపై అసెంబ్లీలో తరచుగా ఆలోచనాత్మకమైన చర్చ లేవనెత్తుతూ వస్తుంది.

ఆదివాసీ తెగల ప్రధాన సమస్యలైన మౌలిక వసతులు లేకపోవడంపైన అసెంబ్లీలో గళమెత్తింది. ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు, రోడ్లు, మంచినీరు, పాఠశాలలు, హాస్పటళ్ళు లేకపోవడం పైన ఆమె నిత్యం అధికారులతో చర్చించి కొంతమేరకు సాధించగలిగింది. అడవి లోపల గూడేలలో జీవించేవారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేకపోవడంపై ఆమె ఆందోళన చేస్తుంది.

ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన రెండుసార్లూ తానున్న పార్టీలు గెలవక ఆమె ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చినా ఎప్పుడూ బాధ పడలేదు. తన స్వభావమే అధికార, ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకమైన ప్రతిపక్ష ధోరణి కాబట్టి ఎక్కడున్నా ప్రజాసమస్యల మీద గొంతెత్తి మాట్లాడడాన్ని కొనసాగించింది.

తెలంగాణా రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు పరిష్కారమౌతాయని ప్రజలకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ రాష్ట్రం, ఇచ్చిన వారితోపాటు ప్రజల్ని కూడా వంచించి తమ కుటుంబ పాలనని కొనసాగిస్తున్నదని సీతక్క ఆరోపణ. నీళ్ళు, నిధులు, నియామకాలు వస్తాయని చెప్పే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు వాటిని గాలికి వదిలెయ్యడమే కాక ప్రజా సమస్యల మీద మాట్లాడేవారిని నేరస్తులని చేసి శిక్షిస్తున్నారని, హైదరాబాద్ లో ఒకప్పుడు ప్రజలు తమ నిరసనని వ్యక్తం చేసుకునే ధర్నా చౌక్ కూడా లేకుండా పోవడమే ఆ పరిస్థితికి చక్కటి తార్కాణం అని ఆరోపిస్తుంది. ప్రజలు ఆశించిన తెలంగాణా రాలేదని, ఇది దొరల పాలన అని ఆమె విమర్శ.

A Story of Seethakka Dansari

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నా ఇక్కడి పాలకులు ప్రజలకు కనీసం మాస్కులు కూడా పంపిణీ చెయ్యడం లేదని, బైట వ్యాపారులు మాస్కులను అధికరేట్లకు అమ్ముతున్నారని అసెంబ్లీలో సీతక్క మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఇంతమంది మంత్రులకు లేని బాధ ఈమెకెందుకని ఆమె మాటలకు ఎగతాళిగా నవ్వి హేళన చేసినప్పుడు సీతక్క అవమానంగా భావించింది.

నవ్విన నాపచేనే పండుతుంది అనుకుని లాక్దౌన్ ప్రకటించినాక తన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన ఆర్ధిక సహకారంతో ములుగు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలకు, ముఖ్యంగా రవాణా సౌకర్యాలు లేని ఆదివాసీ తండాల ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలుపెట్టింది. గత మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు నాలుగొందలు గ్రామాల ఆదివాసులకు, దళితులకు సరుకులు పంచింది.

మాస్కులతోపాటు బియ్యం, కూరగాయలు, నూనె సబ్బులు ట్రాక్టర్, జీపులలో వేసుకుని అటవీ ప్రాంతంలో వెళ్ళగలిగినంత మేరకు వాహనాలలో వెళ్లి ఇంకా లోతట్టు గూడేలకు తన సహచరులతోపాటు స్వయంగా తానుకూడా సరుకుల మూటలు మోస్తూ ఎగుడు దిగుడు అడవి బాటల్లో, వాగులు, వంకలు దాటుకుని వెళ్తుంది. అడవి బిడ్డలకు పౌష్టికాహారం గురించి, కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతలను వివరిస్తుంది.

ఆడవాళ్ళను, పిల్లలను కూర్చోబెట్టుకుని నేను కూడా ఇటువంటి గూడేలలో సరైన తిండి, వసతి లేకుండా పెరిగినదాన్నే అని వారిలో ఒకదానిగా వివరిస్తుంది సీతక్క. ఆమె సేవ గురించి పత్రికలూ, సోషల్ మీడియా వేనోళ్ళ కొనియాడుతుంటే అధికార పార్టీకి అక్కసుగా ఉండి ఆమె మీద అవాకులూ, చవాకులూ పేలుతుంది. మరికొందరు గిట్టనివాళ్ళు ఆమె తన సొంత డబ్బుతో సరుకులు ఇస్తుందా⁉️అని విమర్శిస్తున్నారు.

సీతక్కకి మోతాదు మించి ప్రచారం లభిస్తున్నదని అసూయతో తప్ప ఆమెలా జనంతో మమేకమయ్యే నాయకులు దాదాపు లేరనే చెప్పాలి. ప్రధాన స్రవంతి రాజకీయాలలో వున్నప్పుడు కొన్ని ఎత్తుగడలు వెయ్యాల్సి రావడం ఎవరికైనా తప్పదు. అంతమాత్రాన తన నియోజకవర్గ ప్రజలపట్ల, ఆదివాసీ బిడ్డల పట్ల ఆమెకున్న శ్రద్ధ, ప్రేమలను సీతక్క పనితీరును దగ్గరగా గమనించినవారెవరూ కాదనలేరు. సీతక్క అంటే ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి కనీస సౌకర్యాలకు నోచుకోని అభం శుభం తెలియని ఆదివాసీ ప్రజలకు తమ జాతిలోంచి ఉద్భవించిన ఒక మణి మాణిక్యం.

సీతక్క చైతన్యవంతమైన సాహిత్యాన్ని చదవడమేకాక ‘వెన్నెల’ అనే కలం పేరుతో కవిత్వం రాసేది. ‘యక్షి’ అనే సంస్థలో పనిచేస్తున్నపుడు ఆదివాసీల ఉనికిమీద వ్యాసాలు కూడా రాసింది. ‘వన్ ఆఫ్ సెవెంటీ’ చట్టంమీద, ఆదివాసుల హక్కులమీద ఆలోచనాత్మకమైన వ్యాసాలు, కవితలు రాసింది. ఆమెకి కష్టపడి పనిచెయ్యడం ముందునుంచీ అలవాటే‼️

నక్సలైట్ గా బైటికొచ్చి హైదరాబాద్ లో చదువు కొనసాగించేటప్పుడుకూడా తన సొంత ఊరెళ్ళి తునికాకు పనికి, వ్యవసాయ పనులకి వెళ్లి వచ్చిన కూలి డబ్బులతో ఫీజులు కట్టుకునేది. బాబు ‘సూర్య’ ని కష్టపడి ఎం. టెక్ దాకా చదివించింది, తను కూడా తల్లి కష్టం చూసి బాగా పట్టుదలతో చదివి నాగపూర్ ట్రిపుల్ ఐటి లో సీటు తెచ్చుకున్నాడు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్లో సైన్స్ లో ఎమ్మే పూర్తిచేసి, అదే యూనివర్సిటీలో గొత్తికోయల జీవనప్రమాణాలు, స్థితిగతుల మీద పీహెచ్.డీ పూర్తి చేసింది.

A Story of Seethakka Dansari

సీతక్కది అచ్చమైన ఆదివాసీ స్వాభిమానం, స్వయం పాలనని, స్వేచ్ఛని ప్రేమించే గుణం. నగరంలో వుండి ఎమ్మే, ఎల్.ఎల్.బి చేసినా, ఎమెల్యే అయినా ఆదివాసి సంస్కృతి అంటే తనకి సహజాతంలా వచ్చిన ప్రేమ వెలిసిపోలేదు. రెండేళ్లకోసారి వచ్చే వనదేవతల మేడారం జాతరతో పాటు ఆదివాసుల గూడేలలో జరిగే పండగ పబ్బాలకు, శుభకార్యాలకు, చావులకు ఆమె తప్పకుండా హాజరవ్వడమే కాక వారి సంస్కృతిలో భాగమైన ఆట, పాటలలో పాల్గొంటుంది.

పెళ్ళికి, చావుకీ తప్పనిసరిగా మోగే డోలు వాయిద్యమంటే ఆమెకి ఇష్టం, డోలు శబ్దం వినగానే అప్రయత్నంగానే తనకాళ్ళు చిందేస్తాయి. అందుకే, తన కొడుకు ‘సూర్య’ వివాహానికి చత్తీస్ ఘడ్ నుంచి డోలు వాయిద్య కారులైన గొత్తికోయలను పిలిపించింది. నక్సలైట్ గా తను తిరిగిన అటవీ గ్రామాలే కాదు, మైదాన ప్రాంతాలలో కూడా ప్రతి వూరు, పల్లె, వాగు, వంకా తనకి పరిచయమే.

తన నియోజకవర్గం లో వుండే సుమారు వంద ఏజెన్సీ గ్రామాలలో ప్రతి చిన్న ఆదివాసీ గూడెం పేరును గుర్తు పెట్టుకుంటుంది. అగ్రకుల బూర్జువా పార్టీలలో చేరినప్పటికీ సీతక్క జనంతో తనకున్న ప్రత్యక్ష సంబంధాలను మాత్రం వదులుకోలేదు. ఆమెని తమ బిడ్డగా భావించే ములుగు ప్రాంతపు గ్రామాలలో ఆమె జనంలోకి చొచ్చుకుని పోతుంది. అందరితో ప్రేమగా వారి పరిస్థితులను లోపలి వ్యక్తిగా అర్ధం చేసుకునే సీతక్కకి తనని ఎవరన్నా ‘మేడం’ అని సంబోధిస్తే ఇష్టం ఉండదు, ‘మేడం’ అంటే దూరం పెట్టినట్టుగా, ‘అక్క’ అంటే ఇంట్లోవాళ్ళం అన్నట్టు వుంటుంది అని తను కూడా తన పార్టీ కార్యకర్తలను, అనుచరులను ‘అన్నా, అక్కా’ అనే పిలుస్తుంది.

తనకి మామూలు అర్ధంలో దేవుడు, మతం అనేవాటి పైన నమ్మకం లేదు, గుళ్ళూ, గోపురాలకు వెళ్ళదు. కానీ, ఆదివాసీ అస్తిత్వాన్ని చాటే ఆదివాసుల పితృ దేవతారాధన, ప్రకృతికి సంబంధించిన జాతరలలో ఇష్టంగా పాల్గొంటుంది. సీతక్కది అసలైన ఆదివాసీ రూపం; నల్లని రంగుతో సాదాసీదా ముతక చీరలు కట్టుకుని జనంతో కలసిపోయే సీతక్క అంటే అడవి బిడ్డలకు ఒక సమ్మక్కనో, ఆమె బిడ్డ సారలమ్మనో చూసినట్టుంటుంది.

జనం ప్రేమలను గెలుచుకున్న కోయ దొరసాని ఆమె. ఆమె ఆదివాసీ సాధికారతకు ప్రతీక. ముందు నుంచీ స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు ఆమెకి పెట్టని ఆభరణాలు. తాను గన్ పట్టినా, గన్ మెన్ తో వున్నా ఆమెది పోరాట దృష్టే! ఒకపుడు తనవెంట పడిన పోలీసులు ఇప్పుడు తనకి రక్షణగా వెంట నడవడం చూసి నవ్వుకుంటుంది ఈ అడవి చుక్క. ఆమె మాటల్లోనే ‘ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ పుట్టడం, ఎన్నిసార్లు పడినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడం’ ఆమె నైజం.

చల్లపల్లి స్వరూపరాణి గారు

గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగితే మమ్మల్ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images