Emotional Stories in Telugu
Emotional Stories in Telugu – అమ్మాయి చాలా చక్కగా ఉంది. నువ్వు కోరుకున్నట్లే డిగ్రీ వరకూ చదువుకుంది. ఏవో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతుందని అంటున్నారు. కాబట్టి ఉద్యోగం కూడా చేయవచ్చు. ఏమంటావ్’ కొడుకు సురేష్ ముఖం చూస్తూ పెళ్ళి సంబంధం గురించి మాట్లాడసాగాడు తండ్రి. ఒక్కసారి ధ్యానంగా తండ్రిచేతుల్లో అమ్మాయి ఫొటో చూశాడు సురేష్.
కోలముఖం, చిరునవ్వు నవ్వుతున్నట్లు బిగించిన పలుచని పెదవులు, గట్టిగా బిగించికట్టిన వతైన ఉంగరాల జుట్టు, పొందికగా ధరించిన చున్నీ.. చూడగానే చక్కని, విద్యావంతురాలైన, సంస్కారవంతులైన మధ్య తరగతి లేదా నిమ్న మధ్య తరగతి ఆడపిల్లలా కనిపిస్తున్న ఆ అమ్మాయి పేరు కనకవల్లి. అమ్మాయికి తండ్రిలేడు. తల్లి ఆంగన్వాడీ టీచరుగా పనిచేస్తుందట. ఆ చిన్న ఉద్యోగమే ఆధారం. అమ్మాయికి ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్పారట. ఇంకా స్కూల్లో చదువుకుంటున్నారు. మంచి సంప్రదాయమైన కుటుంబమే. కానీ చాలా బీదరికంలో ఉన్నారు. కట్నకానుకలు,చీరెసారెలు, లాంఛనాలు గట్రా ఇవ్వలేరు..
అమ్మా, నేను ముందే మీకు చెప్పాను కదా. నాకు ఈ కట్నకానుకలు తీసుకోవడం అసలు నచ్చదని. నాకు ఏవిధమైన కట్నం అవసరం లేదు. అమ్మాయి మాత్రం చదువుకుని ఉద్యోగం కూడా అవసరమైతే చేయగలగాలి. ఇదే నా కోరిక. ఈ సంబంధం నాకిష్టమే.. కబురు పెట్టండి వారికంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు సురేష్.
పెళ్లి కుదిరిపోయింది. సురేష్,కనకవల్లుల ఇళ్ళల్లో పెళ్ళి సందడి మొదలయింది. కనకవల్లి ఇంట్లో డబ్బు సమస్య అన్నిటికి అడ్డం వస్తుంది. ఆఖరికి వారి కులంలో ధనవంతులైన కొంతమంది పెళ్ళి ఖర్చు, సారె లాంఛనాలు ఖర్చు భరించడానికి సిద్ధమయ్యారు. ఇదంతా కనకవల్లి మౌనంగా చూస్తూ, లోలోపల ఏదో తెలియని బాధ, ఆత్మ న్యూనత మనసుని వికలం చేస్తుంటే, పెళ్ళి అనే ఆనందం కూడా కలగడం లేదు.
ఈ డబ్బున్న బంధువులు తన పెళ్లి కి సాయం చేస్తున్నారు కానీ వారీ విషయాన్ని అందరిముందూ పదేపదే చెప్పి తమ గొప్పతనం చాటుకుంటారు. తమని జీవితాంతం తల దించుకుని బ్రతికేలా చేస్తారు. అభిమానవతి యైన తల్లి తన పెళ్లి గురించి ఛ.. అందరి ముందు చేయిచాపుతూ ఎంత దీనంగా కనిపిస్తుందో తలచుకుంటుంటే మనసు కృంగిపోతుంది. ఈ దానాలు తీసుకుని పెళ్ళి చేసుకోపోతేనేం? కానీ తమలాంటి వారికి సురేష్ సంబంధం చాలా అదృష్టం మీద దొరికింది, జారవిడుచుకోరాదని తల్లి తపన.
ఆఖరికి మధనపడి పడి ఒక ఉత్తరం వ్రాసింది సురేష్ కి. అందులో తమ పరిస్థితి అంతా తెలియజేసింది. ఆ ఉత్తరం చదివాక సురేష్ లో ఎన్నో ఆలోచనలు చెలరేగాయి. రెండురోజులు గడిచాక కనకవల్లి ఇంటికి సురేష్ వచ్చాడు. ఇంట్లో బంధుజనం, హడావిడి చూస్తూ అందరితో అన్నాడు. నేను పెళ్ళి చాలా సింపుల్ గా చేసుకోదలచుకున్నాను కనుక మీరేమీ పెద్ద ఏర్పాట్లు చేయకండి, ఇంకా చీరెసారె సామాను ,లాంఛనాలు ఏవీ నాకు అవసరం లేదు.
భోజనాలు మేమే పెట్టుకుంటాం. కేవలం మీరు పెళ్ళికి వచ్చి మాకు ఆశీర్వదించండి చాలు.. అన్న సురేష్ మాటలకి అందరూ ఆశ్చర్యంగా, మెచ్చుకోలుగా చూశారు. కనకవల్లి కి సురేష్ మాటలు పన్నీటి జల్లులా సేద దీర్చింది. గుండెల్లో గూడుకట్టిన దైన్యం పటాపంచలయింది. అందరూ వెళ్లి పోయాక కాబోయే అత్తగారు,భార్యతో ‘ దానం గా ఇవ్వబడిన వస్తువులు వాడుతున్నపుడల్లా మనని వెంటాడే చిన్నతనం నేను భరించలేను.
కష్టపడి సంపాదించి కావలసిన వస్తువులు సమకూర్చే బాధ్యత నాది. మీ అందరిదీ కాదు. మీ అమ్మాయి కేవలం తన విద్యార్హత సర్టిఫికేట్లు తీసుకుని అత్తవారింటికి రావాలని నా ప్రార్ధన. ఆ సర్టిఫికేట్లు తనకి అవసరం వచ్చినపుడు ఆదుకునే ఆపద్భాంధవులు కనుక, ఇక నేను వెళ్ళి పెళ్ళి ఏర్పాటలన్నీ చేసి మీకు కబురుపెడతాను.. అంటూ సెలవుతీసుకుని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ వెళ్లి పోతున్న సురేష్ ని కళ్ళనిండా చూసుకుంటుంటే నిజమైన పెళ్ళిసందడి మొదలయినట్లనిపించింది ఆమెకి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.