Menu Close

ఈ కథ చదివాక మనసంతా ప్రశాంతంగా వుంది – Devotional Telugu Stories

కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని. ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.

తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడికి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంటా, ఖాళీగా ఉన్న రోజుల్లో గుడికి వెళ్లిరా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడికి వస్తూ ఉంటాను.

ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెంసేపు గర్భ గుడికి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య M S సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొంతమంది అర్చన చేయిస్తున్నారు . కొంత మంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది తన్మయత్వం తో దేవుడిని చుస్తూ ఉండిపోయారు.

దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యంకి ఇంకొంచెం సమయమే ఉండడంతో, ప్రతి వారం గుడిలో ఉండే పూజారిగారు క్షణం కూడా తీరిక లేకుండా కంగారుగా ఉన్నారు.

అమ్మ వెళ్ళమంది అని గుడి కి రావడం మొదలు పెట్టినా, గుడికి వచ్చిన ప్రతిసారీ ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది. కాని నా మెదడు లో మాత్రం ఎప్పటిలాగే ఎన్నో ప్రశ్నలు రాసాగాయి. దేవుడి గురించి, దేవాలయాల గురించి, భక్తుల గురించి, ఎన్నో సందేహాలు, ఇంకెన్నో విశ్లేషణలు. ప్రతిసారి లాగే ఆ ప్రశ్నల ప్రవాహంలో, ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.

ఇంతలో గుడిలో నేను ఎప్పుడు చూడని పూజారి గారు ఒకరు, నన్ను చూసి, నవ్వి, నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఈయన్ని ఎప్పుడు ఈ గుడిలో చూడలేదు కదా, అన్న సందేహంతో కూడిన ఒక నవ్వు నవ్వాను.

కొత్త పూజారి గారు:
నిన్ను ఈ గుడి లో చాలా రోజులనుంచి చూస్తున్నాను బాబు. కాని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఎమన్నా ఉంటే చెప్పు పర్లేదు అన్నారు. నేను ఎప్పుడూ చూడని వ్యక్తి, నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నారా! అన్న ఆలోచన ఒకవైపు, నా ప్రశ్నలు, సందేహాలు నా మోహం మీద కనిపించేస్తున్నాయా అని కంగారు ఇంకోవైపు కలిగి,

నేను :
అబ్బే అలాంటిది ఏమి లేదండి.

కొత్త పూజారి గారు
మధ్యాహ్నం నైవేద్యానికి, గుడి ముయ్యడానికి ఇంకా సమయం ఉంది బాబు. పర్లేదు చెప్పు నీ సందేహాలు ఏంటో. నాకు తెలిసినంతలో నీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను అన్నారు. ఎందుకో నాకున్న సందేహాలు అన్నీ అడిగేద్దామని ధైర్యం తెచ్చుకుని నేను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను.

నేను: పెద్దవాళ్ళు గుడికి వెళ్తే మంచిది అంటారు కదండీ. అసలు గుడి కి ఎందుకు రావాలి? నా ప్రశ్న లో అవివేకం ఉంటే క్షమించండి.

కొత్త పూజారి గారు:
(గట్టిగా నవ్వుతూ) నువ్వు ఉద్యోగం చేయడానికి బెంగళూరులో ఉన్నావు. కానీ ప్రతి నెలా రెండు రోజులైనా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మ ని కలవాలి అనుకుంటావు కదా, ఎందుకు ? ఎందుకంటే వాళ్లతో గడిపినపుడు నీకు ఆనందం వస్తుంది. వాళ్ల ప్రేమ నీకు హాయిని ఇస్తుంది. బహుశా నీ ప్రశ్న కి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. భగవంతుడిని నాన్న అమ్మ తో పొల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయినట్టు అనిపించింది.

నేను: భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు. కాని ఎందుకు గుడికి వచ్చి దణ్ణం పెట్టుకుంటారు అందరూ ?

కొత్త పూజారి గారు:
నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరంగా వేరే ఊరిలో ఉన్నాడనుకో, నువ్వు ఫోన్లో అతనితో మాట్లాడొచ్చు. కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువ వుంటుందా? లేదా? కొంత మందికి ఫోనులో మాట్లాడినా ఆనందం కలుగుతుంది, కొంత మందికి నేరుగా కలిస్తే ఆనందం కలుగుతుంది.

నేను: కోరికలు తీరితే కానుకలు ఇస్తా అంటారు కదండీ, కానుకలు ఇస్తారని భగవంతుడు కోరికలు తీర్చడు కదా?

కొత్త పూజారి గారు:
నీకు కొత్తగా ఉద్యోగం వచ్చిందనుకో, ఆ అనందంలో మీ కుటుంబ సభ్యులకి ఎదైనా కొనిపెట్టాలని నువ్వు అనుకుంటావా? అనుకోవా? నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా? నువ్వు ఎదైనా కొనిపెడతావని ఆశిస్తారా? గుర్తుపెట్టుకో దేవుడు కానుకలు కోరుకోడు, నీ అభ్యున్నతి కోరుకుంటాడు. అందుకునే సత్యభామ వెసిన వజ్ర వైఢూర్యాలకి కాకుండా, భక్తితో రుక్మిణి వేసిన తులసీ దళంకి తూగాడు శ్రీ కృష్ణుడు.

నేను: ఎదైనా పని మొదలు పెట్టే ముందు, దేవుడికి దణ్ణం పెట్టుకోమంటారు కదండీ, దేవుడి అనుగ్రహం వలన పని పూర్తయితే, మానవ ప్రయత్నం లేనట్టే కదా?అలాకాకుండా మానవ ప్రయత్నం వలన పని పుర్తయితే, పని మొదలు పెట్టే ముందు దేవుడికి దణ్ణం పెట్టమనడంలో ఆంతర్యం ఏమంటారు?

కొత్త పూజారి గారు:
నీ ఆఫీసులో కొంచం క్లిష్టమైన పని ఇచ్చారనుకో, సాధారణంగా ఏం చేస్తావు? కొంచెం నిశబ్దమైన ప్రదేశానికి వెళ్ళి, నీకు నచ్చిన కాఫీ అయినా, టీ అయినా, తాగుతూ, ఏకాగ్రతతో ఆలోచించి, పని పూర్తి చేస్తావు. అవునా, కాదా?ఇప్పుడు కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం వీటి వలన పని పూర్తి అయ్యిందా? లేక నీ బుధ్ధి ఉపయోగించడం వలన పని పూర్తి అయ్యిందా? నిజానికి కాఫీ, నిశబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకగ్రతని పెంచి, నువ్వు నీ పని పూర్తి చెయ్యడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దొహదపడ్దాయి. అలాగే దైవ దర్శనం కూడా, నీ పని చెయ్యడానికి కావలసిన ప్రశాంతతని పెంచి, నీకు కావలసిన శక్తియుక్తులని సరిగ్గా ఉపయోగించడానికి దోహదపడేది కాదంటావా?

నేను: మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు?

కొత్త పూజారి గారు:
మీ అమ్మగారి తో నువ్వు, “ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్ కి నిన్ను తీస్కుని వెళ్తా” అని చెప్పి, తర్వాత మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్లి వచ్చావనుకో, అపుడు మీ అమ్మగారు ఏమంటారు ? స్నేహితులతో బయటకి వెళ్తే లోకం తెలీదు వెధవకి అని కోపంతో తిడతారా లేదా ? అలా ప్రేమగా కొప్పడతారు కానీ, అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని ఆశించరు కదా..!! మీ తల్లితండ్రులకే ఇంత ప్రేమ ఉంటే, లోకాలు అంతటికి ఆ దేవుడిని తల్లి తండ్రీ అంటారు. తనకి ఇంకెంత ప్రేమ ఉండాలి ?

ఇవన్ని విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాను. నాకున్న ప్రశ్నలు సందేహాలు అన్నీ తొలగిపోయినట్టు అనిపించి ఆ ఆనందం లో కళ్లలో నీళ్ళు తిరిగాయి. ఆ పూజారి గారు నవ్వుతూ నా తల నిమిరి, సరే బాబు నైవేద్యానికి సమయం అయిందని చెప్పి వెళ్లిపోయారు.

తర్వాత తదేకం గా గర్భ గుడి లోని దేవుడిని అలా తన్మయత్వంతో చాలా సేపు చుస్తూ ఉండిపోయాను. ఇపుడు దేవుడిని చూస్తోంటే ఎందుకో తల్లితండ్రులను చూస్తున్నట్టు, ప్రాణ స్నేహితులను చూస్తున్నట్టు అనిపించింది. నేను నా భావాలని నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనిపిస్తోంది.

ఆ కొత్త పూజారి గారిని కలవాలి అనిపించి, ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్లాను, కానీ ఆయన కనిపించలేదు. కొత్త పూజారి గారిని కలవాలనే కోరిక ఆపుకోలేక ప్రతీ వారం గుడిలో ఉండే పూజారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను.

నేను : పొద్దున్న ఒక కొత్త పూజారి గారు ఉన్నారు కదండీ, ఆయన సాయంత్రం రాలేదా ?

గుడిలో ప్రతి వారం వుండే పూజారి గారు: కొత్త పూజారి గారా ? ఎవరు బాబూ? పొద్దున్న కూడా నేను ఒక్కడినే ఉన్నాను బాబూ గుడిలో. నాతో పాటు ఇంకో పూజారి ఎవరూ లేరు బాబు.

నేను: లేదండి, నైవేద్యానికి ఇంకా సమయం ఉందని ఆయన నాతో మాట్లాడారు కూడా. అని అంటూ, ఆగిపోయాను నేను. నైవేద్యానికి సమయం అయిందని అన్నారు కానీ, భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం అయిందని అనలేదు కదా. ఈ విషయం స్ఫురించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, నాకేమి అర్ధం కాలేదు, అలా కూర్చుండిపోయాను.

vishnu and lakshmi

ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. గుడి నుంచి బయటకి వచ్చి ఫోన్ మాట్లాడాను.

అమ్మ: ఏరా ఏం చేస్తున్నావు ? ఇప్పుడే నాన్న నేను టీ తాగాము, నువ్వు భోజనం చేసావా ? పొద్దున్న గుడి కి వెళ్ళొచ్చావా ?

నేను: హా.. పొద్దున్న దేవుడిని కలిసొచ్చానమ్మా ..!! అన్నాను తన్మయత్వంతో కూడిన స్వరంతో….

Devotional Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker

Refresh Page
x

Subscribe for latest updates

Loading

Interesting Facts About Indian Flag in Telugu Rashmika Mandanna Images Sai Pallavi Photos Samantha Cute Photos Pooja Hegde Images