Menu Close

డబుర ధన లక్ష్మి కథలు – Best Stories in Telugu

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Best Stories in Telugu

నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి

మదినంటిన మౌనం తూర్పున సూర్యుడు ఉదయించే సమయం అయింది. బోద కొట్టం ముందు నులక మంచం పై నిద్ర బోతున్న శీనయ్య తన మంచం పక్కనే శబ్దం చేస్తూ తిరుగుతున్న పిల్లల కోడి అరుపులకు మెలకువ వచ్చి మంచం నుండి కిందకు దిగాడు. పిల్లల కోడికి దగ్గరగా వస్తున్న చిన్న నాగు పాము పిల్లను చూసి వెంటనే తన మంచం పక్కనున్న పొడుగాటి కర్రతో పామును దూరంగా చెట్లలోకి విసిరేశాడు.

నిమిషాల్లో పాము జర జరా పాక్కుంటూ చెట్లలోకి వెళ్లి కనుమరుగైంది. నవ్వుకుంటూ పిల్లల కోడి వైపు చూసాడు, తన కేమి సంబంధం లేదన్నట్టు ఠీవిగా రెక్కలు విదిలించుకుని ఇంటి ఆవరణలో పాత చెక్క పెట్టెకు పట్టిన చెద పురుగులు తినడానికి వెళ్లిపోయింది…

ఆ కోడి వెంటే పిల్లలు కూడా….

అప్పుడే దూరంగా…డైరీకి పాలు పోసి ఖాళీ స్టీలు చెంబు తీసుకుని వస్తూ కనిపించింది శీనయ్య భార్య రాగిణి. వస్తూనే నిద్ర లేచిన భర్తను చూసి… “ఇదిగో…బాబు ఫోన్ జేశాడు…పైసలు అయిపోయినాయి అంట….చానా గుర్తొస్తన్నవంట..ఎప్పుడు వెళ్తావో చెప్తే..కజ్జికాయలు చేసిస్త…చెనిగ్గింజల పొడి రోట్లో వేసి కమ్మగా దంచి డబ్బా కెత్తి పంపిస్తా…నా బిడ్డ హాస్టల్ తిండికి ఎట్టా వున్నాడో ఏమో… అంది నిష్టూరంగా….ఇంట్లోకెళ్తు..

“మొన్ననే కదే ఎల్లొచ్చింది……మూడు రోజులు కూడా కాలేదు..అంటూ దగ్గర్లోని నీటి తొట్టెలోని నీళ్లను మొహానికి చల్లుకుని ..నోట్లో నీటితో పుక్కలించుకుని…భార్య ఇచ్చిన వేడి కాఫీ తాగి ..స్నానానికి వెళ్లిపోయాడు…స్నానం చేసొచ్చి కంచం ముందు కూచున్నాడు. సద్దన్నం లో పెరుగు, పచ్చిమిరపకాయ నంజుకుని తిని చేను వైపు బయల్దేరాడు…..

దారిలో రావి చెట్టు కింద కి రాగానే చల్లటి గాలి..ఒక పక్కగా చెరువు…చెరువు ఆవలి గట్టు ఆనుకుని తన పొలం…చెట్టు కింద కూర్చున్న పెద్ద మనుషుల్ని పలకరిస్తూ, చెట్టును దాటి పొలాన్ని చేరుకున్నాడు. మూడెకరాల పొలం…చక్కగా రెండు ఎకరాల్లో వేరుశనగ…ఇంకో ఎకరం లో కూరగాయలు వేశాడు. పాతకాలం నాటి బావి వుంది…ఇంకా చెరువు నీళ్ళు కూడా వుండడం, పైగా తను కష్ట పడి పనిచేసే వాడు కావడం వల్ల… కొద్దో గొప్పో…బతుకు దెరువుకు సరిపోతుంది…

ఇంట్లో వున్న మూడు ఎనుము లను శీనయ్య నాన్న మేతకు తోలు కెళ్తాడు…వాటితో వచ్చే పాలు కొన్ని ఇంటికి మిగిల్చుకుని మిగిలినవి డైరీ కి వేస్తారు….శీనయ్య తల్లి దండ్రులు వేరుగా వుంటూనే..శీనయ్యకు చేదోడు గా వుంటారు…శీనయ్య పొలం లోకి రాగానే మొక్కలను పరిశీలిస్తూ….మోటార్ ను ఆన్ చేసి మొక్కలకు నీళ్ళు పార గట్టాడు. అదే చేను కు ఆనుకుని వున్న అయిదెకరాల పొలం కూడా ఇంతకు ముందు తనదే. తమకు మొత్తం ఎనిమిది ఎకరాల పొలం వుండేది.

తన కూతురు స్వప్న …పెళ్ళప్పుడు కట్నం కింద మూడు ఏకరాలు రాసిచ్చారు. పెళ్లి ఖర్చులకు రెండు ఎకరాలు అల్లుడి తండ్రికి అమ్మాడు. ఉన్నంతలో కూతురికి ఘనంగా పెళ్లి చేశాడు. కొద్దిసేపటికే..రాగిణి వేడి వేడి రాగి సంగటి, వంకాయ కూర ను వండుకుని తీసుకెళ్ళింది. ఇద్దరు పొలంలో కలుపు తీసి పొలం పనులు పూర్తి చేసుకుని మిట్ట మధ్యాహ్నం వేళ పొలం లో వుండే పెద్ద వేప చెట్టు కింద భోంచేసి నులక మంచం పై నడుం వాల్చాడు శీనయ్య.

రాగిణి మాత్రం ఒక పెద్ద సంచి నిండా బీరకాయలు కోసింది, ఇంకో చిన్న గోనె సంచికి బెండకాయలు కోసింది. శీనయ్య నిద్రపోతూ వుండడంతో బెండకాయలు వున్న సంచిని శీనయ్య మంచం పక్కనే పెట్టి బీరకాయలు వున్న సంచిని నెత్తిన పెట్టుకొని ఇంటికి బయల్దేరింది. తర్వాత కాసేపటికి పొలం పనులు చేసుకుని చీకటి పడుతుండగా ఇంటి దారి పట్టాడు శీనయ్య.ఇంట్లోకి అడుగు పెడుతుండగా, తన ముద్దుల కూతురు తొమ్మిది నెలల నిండు గర్భిణీ అయిన స్వప్న ఎదురొచ్చింది.

నవ్వుతూ పలరించాడు, అత్తింటి విషయాలు అడిగాడు, అత్త మామ వచ్చి ఇంట్లో విడిచి వెళ్లారని చెప్పింది. ముభావంగా మారిపోయింది, ఏదో విషయం వుంది అనిపించింది శీనయ్య కు…రాత్రి భోజనాలయ్యాయి. ఇంటి బయట నిద్ర పోవడానికి మంచాలు వాల్చింది రాగిణి. స్వప్న కు ఇంట్లోనే నిద్రపోయే ఏర్పాట్లు చేసింది. నిండు గర్భిణి ఆరుబయట నిద్రించకూడదు పక్షులు పైన తిరుగుతుంటాయి అని.స్వప్న అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. స్వప్న మొహం లో లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతోంది.

“చెప్పమ్మా…ఎందుకలా వున్నావు…”అదీ..నాన్నా….ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాన్నా..”పర్లేదు…చెప్పు చిన్ని…”నాన్న…మరిది చదువు ఆగిపోయింది, ఇంకా రెండేళ్లు చదివితే కానీ డాక్టర్ కోర్సు పూర్తి అవదంట…మన కున్న మూడు ఎకరాల్లో రెండు ఎకరాలు మా వూరి రామనాథం బాబాయికి ఇస్తే అతను మా మరిది చదువు పూర్తయ్యే వరకు ఖర్చంతా భరిస్తాడు అంట. తర్వాత మరిదికి ఉద్యోగం వచ్చాక..ఆ డబ్బంతా తీర్చేస్తే మన పొలం పత్రాలు మీకు తిరిగి ఇచ్చేస్తారంట…నసుగుతూనే విషయాన్ని తండ్రికి చెప్పింది స్వప్న.

స్వప్న విషయం అయితే చెప్పింది కానీ… దాని వలన వచ్చే పరిణామాలు ఏమిటో అనే ఆలోచనలో పడిపోయింది. తన మెట్టినింటి కోసం పుట్టింటిని కష్టల్లో పడదోస్తున్నానా అన్న ఆలోచన… ఈ రోజుల్లో డబ్బు విషయంలో ఎవరిని నమ్మడానికి లేదు. మరి తన అత్త మామలు మాట మీద నిలబడతారా… ఆలోచనలో స్వప్న మౌనంగా ఉండిపోయింది.ఇంటి లోపల నుండి వీరి మాటలు వింటున్న దల్లా…కోపం గా బయట కొచ్చింది రాగిణి…”ఉన్న పొలం లో సగం కంటే ఎక్కువే నీకు ఎప్పుడో ఇచ్చేశాం…ఇంకా బాబు గానికి ..ముందు ముందు కు ఏమియ్యాలే…ఆడు.. ఆడి కి రాబోయే భార్య ఎట్ట బతకాలే చిన్ని…

ఓ…అందుకేనా మీ అత్త మామ అంత నవ్వుతా నిన్ను ఈడ ఇడిసి పోయారు…” అంది ఆవేశంగా….వెంటనే శీనయ్య తన భార్యను వారిస్తూ..” నువ్వు ఆగవే…బిడ్డ చెప్తాంది కదా అంటూ వుండగానే…శీనయ్య తల్లి రాములమ్మ చేతిలో చిన్న స్టీలు బాక్స్ లో ఏదో తెస్తూ కనిపించింది.రాములమ్మ ను చూస్తూనే ప్రేమగా వెళ్లి రాములమ్మ చేతి ని పట్టుకుని ప్రేమగా పలకరించింది స్వప్న…రాములమ్మ నవ్వుతూ “యెట్టున్నవే….బాగున్నావా…ఇదిగో…మీ తాత నువ్వొచ్చావని తెలిసి…సాయంత్రం జిలేబి లు చేయించాడు. ఇంద…తీసుకో” అంటూ ప్రేమగా అందించింది.రాములమ్మ శీనయ్య పక్కనే కూర్చుని స్వప్న చెప్పిన విషయం మొత్తం వింది…స్వప్న కూడా చెప్పడం మొదలు పెట్టింది…

పెళ్ళయినప్పటి నుండి దాచిన విషయాలు, పెళ్లప్పుడు ఇచ్చిన డబ్బు కాకుండా, స్వప్న పేర రాసిన భూమిని కూడా అమ్మి వచ్చిన మొత్తంతో ఆరు నెలల క్రితం ఆడపడుచు పెళ్లి చేశారని, ఇంకా మరిది చదువుకు అవసరం అని స్వప్న కు శీనయ్య పెట్టిన బంగారాన్ని అదే ఊరిలో వుంటున్న దేవమ్మ కు తాకట్టు పెట్టారని చెప్పింది. ఈ విషయాలు తెలియకుండా వుండడం కోసమే శీనయ్య దంపతులు ఎప్పుడు తమ ఇంటికొచ్చినాస్వప్న అత్త గొడవ పెట్టుకుని త్వరగా వాళ్ళు వెళ్లిపోయేలా చేసేదని చెప్పుకొచ్చింది.అంతే కాకుండా ఉదయం లేచిన దగ్గర్నుంచి పనులు చేయడంతోనే సరిపోయేది అని, సమయానికి భోజనం కూడా పెట్టకుండా సతాయిస్తున్నరు అని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు ఆ పొలం పత్రాలు తెస్తేనే ఇంటికి కాన్పు తర్వాత రమ్మన్నారు అని లేకుంటే శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండి పొమ్మన్నారు అని చెప్పారు అని కంట నీరు పెట్టుకుంది స్వప్న.వింటున్న అందరిలో కూడా బాధ. రాగిణి, రాములమ్మ కళ్ళల్లో కూడా నీటి పొరలు. శీనయ్య గుండె బాధతో నిండి పోయింది. స్వప్న ను సముదాయించి ఇంట్లోకి తీసుకెళ్ళింది రాగిణి. స్వప్న పక్కనే…స్వప్న నిద్ర పోయే వరకు పడుకుంది రాగిణి.ఇంటి బయట శీనయ్య తల్లి “నేను అప్పుడే చెప్పాను..వద్దు శీనయ్య..

ఆ పిల్లకు ఇప్పుడే పెళ్లి చేయద్దు అని చెప్పిన. నువ్వు వినలేదు. అసలే చిన్ని అత్త చూడ్డానికి మాటలు రాని దాని లా వుంటుంది కానీ దాని కథలు చాలా జాస్తి. ఇంకా దాని మొగుడు ఎప్పుడు ఆ కల్లు పాక దగ్గరే వుంటడు. ఇక చిన్ని మొగుడేమో దూరంగా ఉద్యోగం. ఆ అబ్బాయి అక్కడుంటే మన చిన్ని ఏమో అత్తగారింట్లో గొడ్డు చాకిరీ చేయాలా..? ఇచ్చిన డబ్బు తినేశారు, ఆస్తి అమ్మేశారు. చిన్ని మొగుడ్ని మొన్న జాతర లో కలిసినప్పుడు అడిగా…” ఏం సంతోష్….చిన్ని ని నీతో పాటు తీసుకెళ్ళు అక్కడే నీతో వుంటుంది కదా” అంటే….” ఇప్పుడు నాకు తక్కువ జీతం బామ్మా…ఇంకో రెండు సంవత్సరాలు కష్టం. తర్వాత తీసుకెళ్తాను” అన్నాడు.

చూడ్డానికి ఎర్రగా బుర్ర గా ఉన్నాడు. చిన్నదో..పెద్దదో ఉద్యోగం చేస్తున్నాడు, పైగా అమ్మాయిని ఇష్ట పడుతున్నాడు అని ఇంటర్ చదివే పిల్లను చదువు ఆపి మరీ పెళ్లి చేస్తివి. చూడు నా మనవరాలు ఎంత కష్ట పడ్తోందో ఆ ఇంట్లో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రాములమ్మ.ఆ లోపు శీనయ్య తండ్రి రాయుడు కూడా వచ్చాడు.”చిన్ని ఎక్కడ…భోంచేసి పడుకుందా” అని అడిగాడు పక్కనే వున్న ఇంకో మంచం పై కూర్చుంటూ…”పడుకుంది మామయ్య…ఇదిగో మజ్జిగ” అంటూ రెండు గ్లాస్ ల మజ్జిగ తెచ్చి అత్తకు, మామయ్యకు ఇచ్చి కూర్చుంది. రాములమ్మ విషయం మొత్తం చెప్పింది…రాయుడు ” సరే సరే…ఆలోచిద్దాం లే…కాలికి చిన్న గాయం అయిందని కాలు నరికేసుకుంటామ..మందు రాసుకోవాలి గాని అంటూ…శీనయ్య వైపు తిరిగి”నువ్వేం ఆలోచించావు శీన” అని అడిగాడు.”ఏముంది నాన్న…వున్న పొలం అమ్మే ఏర్పాట్లు చేద్దాం” అన్నాడు.

మరుసటి రోజు స్వప్న, శీనయ్య కలిసి హాస్టల్ లో చదువుతున్న కొడుకుని చూసి రావడానికి వెళ్లారు. శీనయ్య కొడుకు మహేష్ తండ్రిని, అక్కను చూసి చాలా సంతోషపడ్డాడు.అది ప్రభుత్వ హాస్టల్.”నాన్నా.. నా ఫ్రెండ్స్ అందరు ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ డబ్బు పెట్టి కాలేజీల్లో చదువుతున్నారు. నాకు ఇక్కడ నచ్చలేదు నాన్న” అన్నాడు.శీనయ్య కొడుకును పక్కకు పిల్చుకెళ్ళి స్వప్న సమస్య మొత్తం చెప్పాడు. చిన్నవాడైన మహేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా..పొలం ను అమ్మేయమన్నాడు. రెండు ఎకరాలు ఇచ్చినా ఒక ఎకరం మిగిలి వుంటుంది.

అక్క సంతోషంగా కాపురం చేసుకుంటే చాలని మహేష్ ఉద్దేశం.మహేష్ కు స్వప్న అంటే తల్లి తర్వాత తల్లి. చిన్నప్పట్నుంచీ ఎంతో ప్రేమగా చూసుకునేది. పెళ్లి తర్వాత అత్తింట్లో అక్క కష్టాలు పడుతోందని తెలుసు. అందుకే పొలం అమ్మడానికి మహేష్ అభ్యంతరం చెప్పలేదు.కొన్ని రోజులకు స్వప్న పండంటి మగపిల్లాడికి జన్మ నిచ్చింది. సంతోష్ సెలవు మీద పది రోజులు వచ్చాడు.

అప్పుడే రెండెకరాల పొలం రామనాథం గారి పేర రాసి ఆ పత్రాలను సంతోష్ చేతిలో పెట్టి వాళ్ళ అమ్మ నాన్నలకు ఇమ్మన్నాడు. సంతోష్ తల్లిదండ్రులు పత్రాలు తీసుకుని అలాగే బిడ్డ కు మూడో నెల రాగానే స్వప్న ను వారి ఇంటికి తీసుకెళ్లి పోయారు.మూడెకరాల పొలం ఒక ఎకరం అయింది.కష్టమే అయినా…పొలం ఇంకా ఎనుములు (బర్రె) తో సంసారం కొంచెం కష్టంగానే లాక్కొచ్చారు శీనయ్య దంపతులు.చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచాయి. మహేష్ డిగ్రీ లో జాయిన్ అయ్యాడు. స్వప్న మరిది డాక్టర్ అయ్యాడు.

ఇంకో డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకుని సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్నాడు. మంచి ఆదాయం కూడా వస్తోంది వారికి. స్వప్న తమ తండ్రి కి రావాల్సిన డబ్బు ఇస్తే పొలం కొని ఇచ్చెయ్యమని అత్త మామను అడిగింది. వాళ్ళు అసలు అది విషయమే కాదన్నట్టు తీసి పారేశారు.వారి మాట విన్న స్వప్నకు ఆ రోజు తన ఆలోచనలు కంటి ముందు కదిలాయి. తన వలనే తన కుటుంబం రోడ్డు మీద పడబోతుందా… ఏమిటి మా ఆడపిల్లల జీవితాలు. ఒక ఇంట్లో సంతోషం చూడడానికి ఇంకొక ఇంట్లో విషాదాన్ని నింపి రావాలా..ఆమెకు మాట రావడం లేదు ఈ క్షణం. మనసు మాత్రం ఆ రోజు నీ తండ్రికి తిరిగి ఇచ్చేస్తారు అని చెప్పిన నమ్మకం ఇప్పుడు ఎక్కడ వుంది అని ఘోషిస్తుంది.రోజులు గడుస్తున్నాయి. స్వప్న వెదికే నమ్మకం తాలూకు జాడ కనుమరుగయిపోయింది. మనుషుల్లోని రాక్షస ప్రవృత్తిని స్వప్న ముందు ఉంచుతున్న కాలం అది. స్వప్న దేవుడికి మొక్కుతుంది ఏ ఆడపిల్ల ఎదుటివారిని నమ్మి పుట్టినింటికి తనలా భారం తేకుండా చూడమని.వర్షాలు పడలేదు. ఉన్న బోర్ లో నీరు రావడం లేదు. పంట తగ్గిపోయింది. బర్రెలకు గడ్డి దొరకడం లేదు. శీనయ్య తండ్రికి ఆరోగ్యం బాగుండక పోవడంతో తక్కువ ధరకు బర్రెలు అమ్మేశారు.

పూట గడవడం కష్టం అయిపోయింది. ఒక రోజు పొలంలో రాత్రి మోటారు వేయడానికి పోయి…కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు శీనయ్య.ఉదయం ఆ దృశ్యం ఊరందర్నీ కలిచివేసింది…ఊరు ఊరంతా శోక తప్తం అయింది.అసలే తండ్రికి పొలం తిరిగి ఇవ్వలేక పోయాం అని దిగులుతో ఉన్న స్వప్నకి తండ్రి మరణ వార్త ఆమెను మనిషిగా చంపేసింది. జరిగినదంత తన వలనే అన్న కుంగుబాటు ఆమెకు మాట రాకుండా చేసింది. అవును తన నమ్మకం తనను మూర్ఖురాలిని చేసింది.

తన తండ్రి చనిపోయిన క్షణం నుండి ఆమె మాట్లాడడం మానేసింది. ఈ రోజుకి ఆమె మాటను వదిలేసి పదమూడు రోజులైంది.తండ్రికి జరుగుతున్న పెద్ద కర్మను చూస్తూ వుంది ఆమె.ఆమె కనురెప్పలు మూసుకున్నాయి. మూసుకున్న కనురెప్పల నుంచి జారిన కన్నీటి చుక్క నేలను తాకకుండా తనకు అడ్డు వచ్చిన కాగితాల పైన పడింది.వదినమ్మా… పిలుపు బాధగా వినిపించింది. స్వప్న నెమ్మదిగా కళ్లు తెరిచింది.ఆమెకు మొదట తన కన్నీళ్లకు అడ్డు పడుతున్న కాగితాలు కనిపించాయి. వాటి వెంబడి చూసిన ఆమె కళ్ళకు తలను కిందికి వాల్చి పొలం కాగితాలను తన కిస్తూ తన డాక్టర్ మరిది కనిపించాడు.

ఆమె మాట్లాడడం లేదు.వదినమ్మ మమ్మల్ని క్షమించు… జరిగిన విషయం రామనాథం బాబాయ్ నాకు చెప్పేవరకు తెలియలేదు. నా తల్లిదండ్రుల స్వార్దానికి నువ్వు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటావో నేను అర్ధం చేసుకోగలను అని ఆమె కాళ్ళకు నమస్కరించాడు.ఆమె నమ్మకం ఆకాశం అంచుల నుండి తన వద్దకు వస్తున్నట్టు వుంది. ఆమె తండ్రి నువ్వు మాకు ద్రోహం చెయ్యలేదమ్మా…

నీ కాపురం కోసం మమ్మల్ని సహాయం చెయ్యమని మాత్రమే అడిగావు అన్నట్టుగా అనిపిస్తుంది.నెమ్మదిగా కాగితాలు అందుకుని… తన తండ్రి పటం ముందు ఉంచి ముందుకు అడుగులు వేసింది. ఆ అడుగులు నమ్మకాన్ని నిలబెట్టేవో…ఆమె మానసిక క్షోభను మరిపించేవో…కాలమే చెప్పాలి…

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading