Menu Close

Best Stories in Telugu – తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండవచ్చు

Best Stories in Telugu

ఒక వీధులు ఊడ్చే వ్యక్తికి రోజూ పని చేసి చేసి ఆ పని మీద విసుగొచ్చింది. ఊడ్చే చోట రోడ్డు పక్కన ఓ గుడి ఉంటే ఆ మెట్లపైన కూర్చుని ప్రతి రోజూ ఓ దేవుడా…

“నువు రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు. నా బతుకు చూడు ఎంత కష్టమో… ఒక్క రోజు… ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా” అని దేవుడితో మొరపెట్టుకునేవాడు,

అయినా దేవుడు ఏమీ స్పందించలేదు రోజూ ఇలాగే అంటూ కొన్నాళ్ళకి విసిగిపోయి, నా పని చేయటం ఆ దేవుని వల్ల కూడా కాదు అంత శక్తి ఆయనకుంటే గనక ఈపాటికి ఎప్పుడో స్పందించేవాడు అని సవాలు విసిరాడు.

దేవుడు కూడా ఇతని మాటలు వినీ వినీ ఓ రోజు సరేనన్నాడు, నా పని నువ్ చెయ్ నీ పని నేను చేస్తా కానీ ఒక్క షరతు అన్నాడు దేవుడు,

షరతు ఏమిటంటే నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించ కూడదు, నోరు మెదపకూడదు.” అన్నాడు దేవుడు. “సరే” అన్నాడు మనోడు.

తెల్లారే సరికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. “దేవుడా… నేను మరో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు” అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు.

దాంతో ధనవంతుని ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్లిపోయాడు. మనోడు “ఒరేయ్… పర్సు వదిలేశావు చూసుకోరా…” అందామనుకున్నాడు.

కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు. “దేవా… నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అది నీకు సమర్పించు కుంటున్నాను. దయచూడు తండ్రీ” అంటూ మోకరిల్లాడు.

కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. “ఇలా దయ చూపించావా తండ్రీ” అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు. “ఒరేయ్ దొంగా ఆ పర్స్ నీది కాదురా…. ” అని అరుద్దామనుకున్నాడు మనోడు.

కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు. “దేవుడా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ” అన్నాడు.

అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు.”నా పర్సు ఈ గదిలోనే పోయింది, నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును తీసుకుని ఉంటాడు, పట్టుకొండి” అన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే, మనోడు సహించలేక పోయాడు, ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నాడు, దాంతో ఉండబట్టలేక పోయాడు.

Lord Tirupati Balaji god Best Stories in Telugu

దేవుడు పెట్టిన షరతు మర్చిపోయాడు, వెంటనే “ఒరేయ్ ఆగండ్రా… ఈ నావికుడు నిర్దోషి. పర్సు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు. వాడు(పేదోడు) పర్సును తీసుకెళ్లాడు” అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే, ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు.

దేవుడు కూడా వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.”దేవుడా… ఇవ్వాల నేను ఎంత మంచి పని చేశానో తెలుసా… నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను.

ఒక దోషిని అరెస్టు చేయించాను” అన్నాడు మనోడు పెద్ద తోపులా “ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నాను కదా… ఎందుకలా చేశావు” అన్నాడు దేవుడు నిష్ఠూరంగా.

“అదేమిటి దేవుడా, మంచిపని చేసిన నన్ను నువ్వు మెచ్చుకుంటావనుకున్నాను” అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా…. అప్పుడు దేవుడు మాట్లాడుతూ “ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసిన మహా పాపాత్ముడు” వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే ధనవంతుడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను.

అలాగే ఆ పర్స్ లోని డబ్బులతో పేదోడి కష్టాలు కొన్నైనా తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు.

విధి లిఖితం ప్రకారం రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు, అదే నావికుడు అరెస్టై జైల్లో ఉంటే సముద్రయానం ఆగిపోయేది వాడితో బాటు ఇంకొందరు ప్రయాణీకులు కూడా బతికిపోయేవారు.

ఇప్పుడు చూడు… పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావయ్యా నువ్వు… అన్నాడు దేవుడు. దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.

కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండవచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం మానవ మాత్రులకు సాధ్యం కాదు.

అందుకే ఏది జరిగినా మనమంచికే అనుకుంటూ భారమంతా భగవంతునికే అప్పగించి ఆయన స్మరణ లో ఉండాలి అంతే….

Best Stories in Telugu

అతి పెద్ద కవితా ప్రపంచం – https://kavithalu.in/

Like and Share
+1
2
+1
1
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading