ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నేటి బంధాల్లో బలమెంత – Beautiful Post on Relationships
ప్రపంచంలో ఆడదే కరువైనట్టు
ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని
ఇది భార్య కాదు …బ్రహ్మ రాక్షసి.
ఓ భర్త ఆవేదన.
ఏ జన్మలో ఏ పాపం చేశానో
ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను.
ఓ ముద్దా…ముచ్చటా..
వీడు మనిషి కాదు వ్యసనాలకు చిరునామా.
వీడికన్నా జంతువులు నయం.
ఓ భార్య ఆవేదన.
![telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes Indian Traditional Women – Indian Traditional Women](https://telugubucket.com/wp-content/uploads/2022/02/IMG_20220224_083710.jpg)
ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది.
కానీ నాతో స్నేహం చేసినవారందరూ
నన్ను అవసరానికి వాడుకుని
అవసరం తీరాక ముఖం చాటేశారు.
స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతోంది.
ఓ స్నేహితుడి ఆవేదన.
నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు.
మధురమైనది…అమరమైనది ప్రేమ
అలాంటి ప్రేమ పేరు చెప్పి
నన్ను మోసం చేసి నా జీవితాన్ని
సర్వనాశనం చేసి
జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి
తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపోయింది లేక వెళ్ళిపోయాడు అని.
ఓ ప్రేమికురాలి లేక ప్రేమికుడి ఆవేదన.
నిజం చెప్పాలంటే ఒక మనిషి
తన జీవిత కాలంలో సగం సమస్యలు
తన ఆలోచనల వల్లో, తన ప్రవర్తనల వల్లో
“కొని” తెచ్చుకొనేవే.
ఈ ప్రపంచంలో “అవసరం” కోసం
ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా…
తమ వారి మీదున్న “అక్కసు”తో
తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ.
ఇద్దరు వ్యక్తులు (భార్య లేదా భర్త, ప్రేమికులు,స్నేహితులు) ఎవరైనా
కలిసి జీవనం సాగించాలంటే
ముందుగా వారి మధ్య ఉండాల్సింది “నమ్మకం”.
నేడు ఎంతమంది భార్యాభర్తల్లో, స్నేహితుల్లో లేక ప్రేమికుల్లో
తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు??
మనం చదువు ద్వారా సంపాదించిన జ్ఞానం,
స్వతహాగా ఉన్న తెలివితేటలు
మనకు ఏదైనా సమస్య వస్తే
ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగపడాలి.
దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,
తెలివితో సమస్యలను తెంపుకోవడం కన్నా
తెచ్చుకోవడమే ఎక్కువైపోతోంది.
ముక్కు, మొహం తెలియని పరాయి వారు
పలకరిస్తే పళ్ళికిలించుకుని
ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని
మరీ పలకరిస్తాం..
వారి తరపునుండి మనకు ఏదైనా కష్టమో, నష్టమో కలిగినా
క్షమించేసి వారి దృష్టిలో చాలా “మంచివాళ్ళం” అయిపోవడానికి ప్రయత్నిస్తాం.
అదే.. జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం
ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం..
“మన” వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి
విలయతాండవం చేస్తుంటుంది.
అస్సలు “మనసు” విప్పి మాట్లాడం.
పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో
పదోవంతు ప్రాధాన్యత మనవారికిచ్చినా బంధాలు బలపడవా??
మనసు మెచ్చిన క్షణం “నచ్చినోళ్ళు”
మనసు నొచ్చిన క్షణం “సచ్చినోళ్ళు”
అయిపోతుంటారు మనవాళ్ళు.
ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే
బంధాలకు బీటలు వారవా??
మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది…
మనం ఒకరిని ప్రేమించేది….
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?
పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?
ఎక్కడైతే … హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో
ఎక్కడైతే … చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో
ఎక్కడైతే … అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో
ఎక్కడైతే … బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో
ఎక్కడైతే … పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో
ఎక్కడైతే … తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో
ఎక్కడైతే …”అవసరానికి” కాక “ఆత్మీయతకు” మాత్రమే చోటుంటుందో
ఎక్కడైతే … చేసిన తప్పుకు క్షమాపణ అడిగే లేదా మన్నించే వీలుంటుందో
ఎక్కడైతే … మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
![telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes Great-Story-in-Telugu-about-Relationships-brother-and-sister-2](https://telugubucket.com/wp-content/uploads/2021/05/Great-Story-in-Telugu-about-Relationships-brother-and-sister-2.jpg)
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే
గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
పొరపాట్లే చేయనివారు కావాలంటే
సమాజoలో దొరకరు, సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.
ఆలోచించండి ..
దయచేసి ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి.