ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక అడవిలో ఓ చెట్టు మీద గూడు కట్టుకుని ఒక కాకి సుఖంగా ఉండేది. ఒక రోజున ఓ సరస్సు మీదగుండా ఎగిరి వెళ్తూ కిందన ఒక చక్కని పక్షిని చూసింది. సన్నటి పొడుగాటి నాజూకైన మెడ, విశాలమైన రెక్కలు, అంతకంటే విశాలమైన పాదాలు – తెల్లగా వెన్నముద్దలా ఉంది.
దాని నడకలో రాచ ఠీవి ఉంది. అది గాలిలోకి ఎగురుతున్నప్పుడు కూడా చూసింది కాకి. మెడ ముందుకు సాచి రెక్కల్ని విసనకర్రల్లా ఆడిస్తూ ఏమి వయ్యారాలు పోయిందో! కిందకు దిగి చూసింది. ఎవరో కాదది రాజహంస.
‘అది అంత తెల్లగా ఉంటే, నేను చూడు ఎలా ఉన్నానో నల్లగా’ అనుకుంది కాకి. బాధపడింది. ప్రపంచంలోని పక్షులన్నిట్లోకి హంస అదృష్టవంతురాలనుకుంటూ హంస దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంది. హంసకు అభినందనలు తెలిపింది.
‘అవును, ఇన్నాళ్లూ నేనూ నా అంత అదృష్టవంతు రాలు లేదనుకున్నాను. నిన్న ఓ చిలకను చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఆ చిలక ఎంత బాగుందో! చిత్రంగా అది రెండు రంగులతో ఉంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది. అది ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు ఎగురుతూంటే కళ్లార్పకుండా చూశాననుకో! సృష్టిలోకెల్లా అదే అందమైన పక్షి. సందేహం లేదు’ అంది.
కాకి ఎగురుకుంటూ పోయి చిలక ముందు వాలింది. రెక్కలు రెపరెపకొట్టుకుంటూ అడవంతా మారు మోగేట్టు అల్లరి చేస్తోంది చిలక. కాకి దాన్ని చూస్తూ ‘ఏమందమే చిలకా నీది’ అంది.
‘ఔను. నేనూ అలాగే అనుకున్నాను. ఒక పిట్టయితే మొన్న నా దగ్గరకొచ్చి ‘నువ్వు నృత్యం నేర్చుకుంటే ఎంత బాగుంటుందో. నీ మాటకు ఆట కూడా జతైతే అడవికి పండగొచ్చినట్టే’ అంది. మురిసిపోయాను.
కాకికి కాలు నిలవలేదు. రివ్వున ఎగురుకుంటూ వెళ్లి ‘జూ’ ముందు వాలింది. నెమలిని వెతుక్కుంటూ వెళ్లింది. ఒకచోట నీలం, ఆకుపచ్చ, ఎరుపు, బంగారం ఇలా ఎన్నెన్నో రంగులతో మెరిసిపోతూ కనిపించింది నెమలి. అప్పుడది పురి కూడా విప్పి ఉందేమో. ఇంద్రధనస్సులా కాంతులీనుతూ ఉంది. కళ్లు చెదురుతున్నాయి. కాని, నెమలి అందచందాలను ఆస్వాదిస్తూ నెమలి దగ్గరకు వెళ్లి ‘ఎంత అందంగా ఉన్నావో! చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. నిన్ను చూసేందుకు రోజూ ఇంత మంది వస్తున్నారంటేనే నువ్వెంత అందగత్తెవో అర్థమౌతోంది. నేనూ ఉన్నాను. జనాభా లెక్కకి. నన్ను చూస్తూనే విదిలించి కొడతారందరూ’ అని వాపోయింది.
నెమలి విరక్తిగా నవ్వింది. ‘నా అందమే నాకు శాపం. అద్భుత రూప లావణ్యంతో ఉన్నాను కనుకే నన్నీ ‘జూ’లో బంధించారు. చాలా రోజులుగా ఈ ‘జూ’ అంతా పరిశీలించి చూస్తున్నాను. ఇక్కడ అన్ని రకాల జంతువులూ పక్షులూ బందీ అయి ఉన్నాయి. నాలా చాలా ఏళ్లుగా – ఒక్క నువ్వు తప్ప. నీలా కాకిలా పుట్టి ఉంటే ఎంత స్వేచ్ఛో గదా అనుకుంటున్నాను. నేనూ నీలా కాకినైతే నీతో చెట్టాపట్టాలేసుకుని అన్ని చోట్లకూ వచ్చుండేదాన్ని. అన్ని ఊళ్లూ చూస్తుండేదాన్ని. నాకా అదృష్టం లేదు. ఈ జన్మంతా బానిస బతుకే’ అని కన్నీళ్లు పెట్టుకుంది.
నెమలి బాధ విన్నాక కాకికి తెలివొచ్చింది. మనందరి సమస్య కూడా ఇదే. ఎవరెవరితోనో పోల్చుకుని బాధపడుతుంటాం. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడటం తెలీదు మనకు. అసంతృప్తే అన్ని దుఃఖాలకు కారణం. మనకు ఏవి లేవో వాటిని తలచుకుని పొర్లి పొర్లి ఏడ్చే బదులు, ఏవి ఉన్నాయో వాటితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ప్రపంచమన్నాక హెచ్చు తగ్గులెప్పుడూ ఉంటాయి. ఉన్న వాటిని హాయిగా స్వేచ్ఛగా తృప్తిగా అనుభవించే వాడి బతుకే బతుకు. వాడు నిత్య సంతోషి.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children