Menu Close

Telugu Samethalu – తెలుగు సామెతలు వాటి అర్ధాలు

Telugu Samethalu – తెలుగు సామెతలు వాటి అర్ధాలు

భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట”

బజార్లో పెడితే ఎవరైనా దాన్ని ఎత్తుకెళ్తారు అని తెలిసి కూడా కోడి గుడ్డు పెట్టిందంటే దానికి అస్సలు భయం లేదని అర్థం. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు దాని పర్యావసానాలు ఆలోచించి చేయాలి అని చెప్తోంది ఈ సామెత.

చేతిలో సుత్తి ఉంటే ఏదైనా మేకు లానే కనపడుతుంది

మన జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యని కేవలం మనకి తెలిసిన పరిమిత జ్ఞానంతోనే ఆలోచించకుండా విశ్లేషణ చెయ్యాలి అని ఈ సామెత అర్థం.

1000 + Best Telugu Samethalu - తెలుగు సామెతలు - Telugu Proverbs

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ”

ఒక అధికారి తన కింద పనిచేసే వారిని అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు వేస్తాడు. అన్నిటికీ సమాధానము చెప్పవలసిందే లేకపోతే ఇబ్బంది. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అవుతాడు.

“కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా!”

బాధలో కాని ఆనందంలో కాని ఉన్నప్పుడు నోటికి అదుపు లేకుండా మట్లడుతుంటాం కొన్నిసార్లు మనం. దాని వల్ల కలిగే నష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరము అనుభవించే ఉంటాం. దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఊహించటం కష్టం. కనుక మన నోటి నుంచి జాలువారే ప్రతి మాట చాల ముఖ్యం అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం.

“నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది”

మన నోటి నుండి వచ్చే వాక్యాలు కత్తి కంటే పదునైనవి.. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిస్వార్థంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఒకరిని చూసి మరొకరు నిస్వార్ధంగా ఉండటం నేర్చుకుంటారో.. అప్పుడు ఆ ఊరు కూడా మంచిదవుతుంది అని ఈ సామెత యొక్క అర్థం.

ఇచ్చేవాడిని చూస్తే, చచ్చినవాడు కూడా లేచి వస్తాడు

ఉచితంగా ఏదన్నా దొరుకుతోంది అంటే దాన్ని దక్కించుకోవటానికి ఏదైనా చేస్తాం, ఎందుకంటే ఆశ అనేది సర్వసాధారణం కనుక. కాని కొంతమందిలో ఇది చాలా ఎక్కువ పాళ్ళలో చూస్తాం. అలా అత్యాశ ఉన్నవాళ్ళ గురించి చెప్పే సామెత ఇది.

డబ్బు మాట్లాడుతూంటే సత్యం మూగ పోతుంది

డబ్బు ముందు సత్యం నిలవలేదు అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం.

వసుదేవుడంతటివాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు!

“ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు” అని మన పవర్ స్టార్ సినిమాలో చెప్పినట్టు…ఎంతవాడికైనా ఒక్కోసారి కాలం కలసి రాకపోతే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. వారి జీవితం ముందుకి సాగాలి అంటే ఎంతటి స్థాయికైనా దిగాల్సి వస్తుంది. అలాంటి సంధర్భాల్లో ఈ సామెత చెప్తూ ఉంటారు.
అసలు కథ: లోకం మాటేంటంటే, పరమాత్మని తలపై బుట్టలో ఉంచుకుని తీసుకు వెళుతున్న వసుదేవుని చూసి గాడిద ఓండ్ర పెట్టిందనీ, ఆ అరుపుకు కావలివారు లేస్తే పరమాత్మని వ్రేపల్లె చేర్చడం కుదరకపోవచ్చు గనక ఓండ్ర పెట్టద్దని వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటారు.

చింతలు లేకపోతే సంతలోనైనా నిద్రపోవచ్చు!

మనిషికి మనశ్శాంతి ఉన్నప్పుడే హాయిగా ఆనందంగా ఉంటుంది. అలాంటప్పుడే కంటినిండా కునుకు పడుతుంది. చింతలు, చికాకులు, భయాలు, ఆందోళనలు అశాంతికి గురి చేస్తాయి, నిద్రను దూరం చేస్తాయి. అందుకే చింత లేకుండా హాయిగ బతికే తీరులో బతకండీ అని చెప్తుంటారు పెద్దలు.
సంతలో అంతా సందడి సందడిగా ఉంటుంది. అమ్మకందారుల కేకలూ, కొనుగోలుదారుల బేరాలు. వీటితో ధ్వని కాలుష్యంగా ఆ ప్రదేశమంతా ఉంటుంది. అయినప్పటికీ ఒక మనిషి హాయిగా అక్కడ నిద్రపొతున్నాడంటే అతనికి ఎలాంటి చింతలు లేవని అర్థం.
అంటే చింతా, చికాకులు లేకుండా ఉండటంలోనే అసలైనా ఆనందం ఉన్నదన్నది ఈ సామెత సందేశం.

కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది.

ఆశకొద్దీ ఎక్కువ పదార్థాలు వడ్డించుకున్నా తినలేకపోవటం.
ఆకలితో వున్నప్పుడు ఎంతో తినాలని ఆశ పడతారు. తీరా తినడానికి కూర్చున్నాక తన కడుపుకు పట్టినంత మాత్రమే తినగలరు. ఆ వుద్దేశముతో చెప్పినదే ఈ సామెత.

మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్టు!

వెనకటికి ఒకాయన సాము గరిడీ విద్యలు నేర్చాడట. ఆ విద్యను చూపి అందరి మీదా జబర్దస్తీ చేసేవాడట. అతని పహిల్వాన్‍ చేష్టలకు ఆ ఊరు ఊరంతా భయపడేదట. జనులు తనను చూసి భయపడటంతో అతగాడు మరింత రెచ్చిపోయి అందరిపై పెత్తనం చెలాయించేవాడట. అతగాడెంతో మొనగాడన్నట్టు ఆ ఊరివాళ్లంతా అతనికి వంగి వంగి దండాలు పెట్టే వారట. ఏ ఆపద వచ్చినా, కష్టమొచ్చినా అతనికే చెప్పుకునే వారట. అయితే అయ్యవారికి అంత ‘సన్నివేశము’ లేదు. ఏదో కాస్త కండలు చూపి పైపై ఆర్భాటం చేయటమే తప్ప నిజానికి అతనికి ఏమాత్రం వస్తాదుతనం లేదు. ఒకనాడు ఊళ్లో దొంగలు పడ్డారు. అందరికంటే ముందు ఈ వస్తాదు గారే తలుపులు వేసుకుని దాక్కున్నారు. అందరూ ఇది చూసి అయ్యో.. ఇదా నీ మగతనం అని నోళ్లు నొక్కుకున్నారు. ఒకరోజు ఊళ్లో ఒక ముసలావిడ ఇదే విషయమై దారిన వెళ్తున్న వస్తాదు గారిని ప్రశ్నించిందట. దీంతో ఎక్కడ లేని పౌరుషం పుట్టుకొచ్చిన ఆ వస్తాదు.. పట్టరాని కోపంతో వృద్ధురాలు అని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడు. ఇది చూసిన వారంతా.. దొంగలు, దుర్మార్గుల్ని ఏం చేయలేడు కానీ, బలహీనులపై ప్రతాపం చూపుతున్నాడంటూ తిరగబడ్డారు. అటువంటి వ్యక్తిని ఉద్దేశించే పై సామెత పుట్టింది.. ‘మూడు నెలలు సాము విద్య నేర్చి.. చివరకు ముసలిదాన్ని కొట్టాడు’ అని ఎవరైనా అధికుల మని, అధికారం చాటుకునే వారి గురించి దెప్పి పొడిచే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.

దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట

దయగల వాడు ఐతే పెళ్ళాన్ని కొట్టకుండా వుండాలి కాని, ఎవరకీ తెలియకుండా జాగ్రత్త పడటం ఏంటి!
కొంతమంది ఇలాగే నలుగురి ముందూ మంచిగా ఉండాలి ఇంట్లో ఎలా ఉన్నా ఫర్వాలేదు అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళను గూర్చి చెప్పే సామెత ఇది.

రోజూ చచ్చేవాడికి ఏడ్చేవారు ఉండరు

వరైనా ఒకసారికి అవసరానికి సహాయం చేస్తారు. ప్రతి సారి చెయ్యరని చెప్పేదే ఈ సామెత.

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు. కాని ఎన్ని చేసినా ఏదో ఒక కారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు.
ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు.

అక్కరకు వచ్చినవాడే మనవాడు

అక్కర అంటే అవసరం. మనకు అవసరం ఉన్నప్పుడు, ఆపద సమయాలలో సహాయపడిన వారే మన ఆప్తులు అవుతారు. అంతే కానీ, అవసరమైనప్పుడు సహాయపడని బంధువులు ఉన్ననూ వ్యర్ధమని, మనవారు కాలేరని ఈ సామెత అర్థం.

పేరు గొప్ప ఊరు దిబ్బ

ఉదాహరణకి కొన్ని దుకాణాలకు సురుచి అని, రుచి అని ప్రసిద్ధమైన వంటకాల రుచులకు ప్రసిద్ధి అని వాటి గొప్పదనాన్ని చాటుకునేలా బోర్డులు తగిలిస్తారు. విపరీతమైన ప్రచారం సాగిస్తారు. అది నమ్మి ఆ హోటల్‍కు వెళ్తే.. అక్కడి వంటకాలు రుచి చూస్తే ఆశించిన స్థాయిలో ఉండవు. అటువంటి సందర్భంలో నిట్టూరుస్తూ మనసులో అనుకునే మాటే ఇది. పేరు చూసి నమ్మి మోసపోయాం.. ఇంకెప్పుడూ ఆ హోటల్‍కు వెళ్లకూడదు అనుకునే సందర్భంలో ఈ సామెతను వాడతారు.

తూర్పుకు తిరిగి దండం పెట్టు!
ఎవరికన్నా ఎదన్నా ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ మనిషి తిరిగి మళ్ళీ మనది మనకి ఇవ్వలేని పరిస్తితి వచ్చిన సందర్భంలో ఈ సామెత వాడతారు.
సరే తూర్పుకే ఎందుకు తిరిగి దండం పెట్టాలి? వేరే దిక్కులు లేవా అంటే!!! తూర్పుని మనం పుణ్యమైన దిక్కుగా అభివర్ణిస్తాం. ఇంద్రుడు దానికి అధిపతి. సూర్యుడు కూడా తూర్పు నుండే ఉదయిస్తాడు. అందుకే ఇళ్ళల్లో కూడా ఎదన్నా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నా తూర్పు ముఖంగా కూర్చోమని అంటారు. కనుక తూర్పుకి తిరిగి దండం పెడితే, ఇక నీ పోయిన సంపద వల్ల కనీసం నీకు పుణ్యం అయినా దక్కుతుంది అని అలా సరదాగా అంటారు.

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట

ఏదైనా పని చేయడానికి ఎంచుకున్నపుడు ఆ జట్టులో ఎవరికీ సరైన అవగాహన లేకపోతే ఈ సామెతను వాడతారు.
పూర్వకాలంలో సన్యాసులు తమ ఒంటికి బూడిద రాసుకోవడం మీకు తెలిసిందే!

పొరుగింటి పుల్ల కూర రుచి!”

పొన్నగంటి కూర, చుక్క కూరలను పుల్ల కూరలంటారు. పులుపు చాలామందికి పడదు కారణం దగ్గును తెస్తుంది కనుక. ఆలాంటి పుల్ల కూరలు కూడ పక్కింటి వాళ్ళు చేస్తే రుచికరంగా ఉంటాయి. ఇంట్లో భార్య ఎంత అందంగా ఉన్నా, ఎంత రుచికరంగా వంట చేసినా, వంకలు పెడుతూ పొరుగు లేదా పరాయి స్త్రీల పట్ల వ్యామోహం పెంచుకొని శరీర ఆరోగ్యం చెడగొట్టుకోవద్దని మర్మ గర్భంగా మనకి చెప్పడం ఈ సామెత ఉద్దేశం. ఇంటి ఇల్లాలిని విమర్శించడానికి పుట్టిన సామెత ఇది.

తెగించి దానం చేస్తా తేరా పిడికెడు రాళ్ళు అన్నాడట!

నేను ఉదారవాదిగా ఉండాలని నిర్ణయించుకున్నాను, చేతినిండా ధాన్యం తీసుకురండి అన్నాడట ఒక రాజు. వారి ఉదారత అంతా ఆ గుప్పెడు ధాన్యం పంచటంలోనే ఉందన్నట్టు!!
మాటలు కోటలు దాటటం” లాంటిదే ఇదీనూ. కొందరు చేసే హడావిడి అంతా ఇంతా కాదు, కాని అసలు చేసేది శూన్యం.

“తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కొరకు అన్నాడట!”

అబద్ధం చెపితే అతికినట్టుండాలి. అలా చేత కాని వారికి ఈ సామెత వాడతారు.

ముందొచ్చిన చెవులకన్నా వెనక వచ్చిన కొమ్ములే వాడి

ఇది చాలా విషయాల్లో మనం వినేదే!
ఏ మనిషైనా ముందు నుంచి తన జీవితంలో ఉన్నవారికంటే కొత్తగా వచ్చిన వారికీ కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే ఈ సామెత వాడతారు!

“నిండా మునిగిన వాడికి చలేంటి!”

చన్నీళ్లలో దిగేటప్పుడు మొదట్లో చలిగా వుంటుంది. పూర్తిగా దిగాక చలి వుండదు. అలాగే కష్టాలు ఒకటి రెండు వస్తే మనిషి తమాయించుకోగలడు. అన్ని కష్టాలు ఒక్కసారిగా వస్తే అతనికి తెగింపు వచ్చేస్తుంది. ఆ అర్థంతో ఈ సామెత పుట్టింది.

రాజ్యాలు పోయినా కిరీటాలు వదలేదని

పరిస్థితులు ఇంతకముందులా విలాసవంతంగా బతికినట్టు లేకపొయినా, తాము మాత్రం అలాగే బతకాలి అనుకుంటారు కొంతమంది. ఎక్కడా “తగ్గేదే లే” అన్నట్టు. అది వారి ఇష్టానికి సంబంధించినది అయినప్పటికీ, అలాంటి వారిని గూర్చి హాస్యం గా చెప్తుంది ఈ సామెత.

“అంతా తెలిసినవాడూ లేడు ఏమీ తెలియనివాడూ లేడు!”

మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసిన వాడున్నూ, ఏవిషయము కొంతైనా తెలియని వాడున్నూ లేడని దీని అర్థము.

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు!

దుత్త అంటే కడవ. కోడలు అత్తగారి మీద కోపంతో ఆవిడని ఏమీ అనలేక దుత్తని పగులగొట్టిందట. ఆ విధంగా ఆవిడపై కోపాన్ని తీర్చుకుంది.
ఇలా ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీద చూపిస్తున్న సందర్భంలో ఈ సామెత వాడతారు.

Telugu Samethalu meaning
Telugu Samethalu proverb
List of Telugu Samethalu
Popular Telugu Samethalu

Telugu Samethalu with explanation
Telugu Samethalu in English
Benefits of learning Telugu Samethalu

Examples of Telugu Samethalu in use
Telugu Samethalu for kids
Funny Telugu Samethalu

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading