Menu Close

దుష్టశక్తులు ప్రభావాలు – Negative Energy


మనుషులందరకు మెలకుగా ఉన్నప్పుడు ఏవో ఒక ఆలోచనలు ఉండడం సహజమైన విషయం.. మనం నిరంతరం పాజిటివ్ ఆలోచనలనే చేస్తున్నామంటే పవిత్రంగా జీవిస్తున్నా మని అర్థం. మనలో నెగిటివ్ ఆలోచనలు అధికమౌతున్నాయి అంటే ఏదో అపవిత్రత మన జీవితంలోకి ప్రవేశించిందని అర్థం.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
three godess lakshmi durga sarasvathi

పురాణ గ్రంథాల ప్రకారం మన మనసులో పాజిటివ్ – నెగిటివ్ ఆలోచనలు ఉన్నట్లుగానే ఈ సృష్టిలో కూడా పాజిటివ్ పవర్స్ – నెగటివ్ పవర్స్ ఉంటాయి. పాజిటివ్ పవర్స్ ను దైవశక్తులని.. నెగటివ్ పవర్స్ ను దుష్టశక్తులని పిలుస్తుంటారు.

పురాణాల ప్రకారం ఈ శక్తులకు నివాస స్థానాలున్నాయి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ దైవ శక్తులు నివసిస్తాయి.. అందుకే మనం పవిత్రంగా జీవించే మహాత్ములకు, భక్తులకు, సాధువులకు నమస్కరిస్తూ ఉంటాము.

ఆదే విధంగా “ఒక పెంటలో ఈగలు, దోమలు, పురుగులు నివసించినట్లు” “ఒక పాడుబడిన ఇంట్లో గబ్బిలాలు నివసించినట్లు.. “అపవిత్రంగా జీవించే మనషులనూ, సోమరిపోతులను ఆశ్రయించుకుని కొన్ని దుష్టశక్తులు నివసిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

తామస సృష్టిక్రమాన్ని వివరిస్తూ ఆ యా దుష్టశక్తులు మరియు అవి ఆవహిస్తే చేయవలసిన శాంతి ప్రక్రియల గూర్చి ఒక ఆసక్తికరమైన వృత్తాంతం మనకు “మార్కండేయ పురాణం” లో కనిపిస్తుంది.

నిరృతిశ్చ తథా చాన్యా మృత్యోర్భార్యాభవన్మునే
అలక్ష్మీర్నామ తస్యాంచ మృత్యో : పుత్రా శ్చతుర్ద
తథైవాన్యోగృహే పుంసా “దు: సహో ” నామ విశ్రుత:

మృత్యువు అనే యక్ష్మునికి నిరృతి అనే భార్య ఉంది. ఈమెకే లోకం లో “అలక్ష్మీ” అని పేరు. ఈ మృత్యువుకు “అలక్ష్మీ” యందు 14 మంది పుత్రులు జన్మించారు. పాపం పెరిగి ఏదో రకంగా అపవిత్రమైన మనుషుల శరీర అంగాలలో వీరు నివసిస్తారు.

ఈ అలక్ష్మీ పుత్రులలో చివరి వాడు అంటే 14 వ యక్ష్ముని పేరు “దుస్సహుడు”. ఇతడు మహా భయంకరుడు. ఇతనికి ఎప్పుడూ ఆకలే! అధోముఖుడు అంటే క్రిందికి ముఖం వేసుకుని ఉండేవాడు. నగ్నుడు. కాకి వలె శబ్దం చేసేవాడు. ఇతడు తనకున్న భయంకరమైన ఆకలిచే ఈ సృష్టిలోని జీవులన్నింటిని తినడం మొదలు పెట్టాడు.

అది చూచి బ్రహ్మ “ఓరీ! నీ విట్లు అన్నింటిని మ్రింగరాదు. నువ్వు తినడానికి పదార్థాలనూ, ఉండదగిన చోట్లను చెబుతాను విను! “అంటూ ఇట్లు
చెప్పడం ప్రారంభించాడు.

శ్లో|| బ్రహ్మో వాచ :

తవాశ్రయో గృహం పుంసాం జనశ్చాధార్మికో బలమ్
తత్ర యక్ష్మ తవ వాస స్తథాన్యేషాం చ రక్షసామ్

(అంటూ ఈ దుస్సహుని నివాసం – ఆహారం.. మొ॥ లైన బ్రహ్మ నిర్దేశించిన విషయాలు ఒక ఆధ్యాయమంతా వివరించ బడ్డాయి. వాటిని సంక్షిప్తంగా ఇస్తున్నాను.)

“ఓరి దుస్సహా! నువ్వు అధర్మంగా – అపవిత్రంగా జీవించే మనుషుల ఇంటిలోకి వెళ్లి నివసించూ ! సాలె పురుగులు – కుక్క – పిల్లి ముట్టిన పదార్థాలనూ,
నిలువ ఉన్న అన్నాన్నీ, ఊదిన పదార్థాలనూ, దేవునికి నివేదన చేయక జిహ్వ చాపల్యం చేత వండుకున్న ఆహార పదార్థాలనూ, ఎంగిలైన పదార్థాలనూ నీవు తింటూ ఉండుము.

చీకట్లో మరియు సంధ్యా సమయాలలో ఎవరు భోజనం చేయుదురో వారి పుణ్యం నీకు చెందుతుంది. శ్రద్దలేకుండ చేయు పూజాహోమాలు, భర్త అనుమతి లేకుండా చేసే ఉపవాస వ్రతాదులు, స్నాన సంధ్యాదులకు ముందే అపవిత్రంగా చేయు దాన ధర్మాదులు, జలధార లేకుండ ఇచ్చిన దానాలు ఇచ్చిన వారికి పుణ్యాన్ని ఈయవు. ఆ పుణ్యం నీకు చెందుతుంది.

ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టని యిండ్లలోనూ, పుట్టలు పెట్టిన యిండ్లలోనూ, రాత్రి దీపము పెట్టనియిండ్లలోనూ, తమ పరిసరాలను చిందరవందరగా అపరిశుభ్రంగా ఉంచుకునే ఇండ్లలోనూ, అధర్మకామ సంబంధాలను నెరిపే వారి ఇండ్లలోనూ, భర్తనూ – అత్తమామలనూ – తల్లిదండ్రులనూ – గురువులనూ – బ్రాహ్మణులను అవమానించు ఇండ్లలోనూ, వృథాగా ఉపవాసం చేసే ఇండ్లలోనూ, ఎవరైతే రోలు మీద – రోకలి మీద – గడప మీద కూర్చుని ఉంటారో వారి ఇండ్లలోనూ నీవు నివాసం ఎర్పరుచుకో!

ఇంకా – శ్లో || పంక్తి భేదే వృథాపాకే పాకభేదే తథా కృతే | నిత్యం చ గేహ కలహే భవితా వసతి స్తవ ॥

పంక్తి భేదం జరిగే చోట్లలో, వృథాగా వండి పారవేసే ఇండ్లలో, ఎప్పుడూ కలహాలు ఉండే ఇండ్లలో నువ్వు నివాసం ఏర్పరుచుకో ! సాయంకాల సంధ్యా సమయం కన్న ముందు ఏ ఇల్లు చీపురుతో శుభ్రం చేయబడదో ఆ ఇంట్లో నువ్వు నివసించు!

నువ్వు నివసించే ఇండ్లలో నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుము. నీవలన వారికి మహా భయం ఉత్పన్నమగును. నువ్వు నివసించే ఇండ్లలో “అలక్ష్మీ” తాండవించును. వారి పేర్లు, వారు చేయు పనుల గూర్చి మార్కండేయ పురాణం ఇలా వివరిస్తుంది.

కొడుకులు:

  1. దంతాకృష్టి :

అపవిత్రమైన ప్రదేశాలకు వెళ్లినపుడు వీడు అంటుకుంటాడు. వీడు ఎక్కువగా చిన్న పిల్లలను పీడిస్తాడు. పిల్లలు పండ్లు కొరుకుటకు కారణం వీడే. పిల్లలు పడుకునే శయ్యపై తెల్ల ఆవాలు చల్లి, సువర్చల అను మూలిక కలిపిన నీటితో పిల్లలకు స్నానం చేయిస్తే వీని పీడ తొలగుతుంది. కొద్దిగా తెల్ల ఆవాల పొడిని నిద్రిస్తున్న ‘పండ్లు కొరికే పిల్లల’ దంతాలకు రాయాలి. ఆ పిల్లలకు పట్టు వస్త్రం ధరింపజెయ్యాలి.

  1. తథోక్తి :

ఇంటిలోని వారు అశుభ వాక్యాలు – తిట్లు ఉచ్చరించినపుడు ‘తధాస్తు’ అంటూ వాటిని నిజం చేస్తుంటాడు. ఇంట్లో చెడు మాటలు మాట్లాడవద్దు! ఒకవేళ ఎప్పుడైనా అనుకోకుండా అశుభ వాక్యాలు పలికినప్పుడు శ్రీ కృష్ణనామ స్మరణ లేదా తమ తమ ఇంటి దేవుని స్మరణ చేస్తే వీని పీడ ఉండదు.

  1. పరివర్తకుడు :

గర్భ స్రావాలకు వీడే కారణం. అంతే కాక ఒకరి గర్భమందు ఇంకొకరి గర్భాన్ని స్థాపిస్తూ గర్భస్థ పిండాలను పీడిస్తూ వుంటాడు. తెల్ల ఆవాలను చల్లి గర్భ రక్ష గూర్చిన వేద మంత్రాలను పఠిస్తే వీనిపీడ తొలగుతుంది.

  1. అంగధ్రుకుడు :

గాలిరూపంలో శరీరాలలో ఉండి, కన్నులు భుజాలు మొదలగు అంగాలను అదురునట్లుగా చేస్తుంటాడు. దర్భలతో అదిరిన అంగాలను తుడిస్తే వీని పీడ తొలగుతుంది.

  1. శకుని:

కాకి, గ్రుడ్లగూబ మొ॥లైన పక్షులలో నివసిస్తూ శుభాశుభాలను తెలుపుతుంటాడు. వీడు ఆవహించిన కాకి – గ్రద్ధ – గ్రుడ్లగూబలు ఇంటిలో ప్రవేశిస్తే ఆ ఇంటిలో ఒక మరణం సంభవిస్తుంది. దుశ్శకున దోష నివారణ శాంతితో వీడి దోషం తొలగుతుంది.

  1. గండ ప్రాంతరికుడు :

గండాంతం అను ముహూర్తంలో ఉండి వీడు ప్రమాదాలను కలిగిస్తూ ఉంటాడు. తెల్ల ఆవాలు కలిపిన గోపంచితం తో స్నానం చేసి దేవతల, బ్రాహ్మణుల వల్ల దీవెనలు పొందితే వీని పీడ తొలగిపోతుంది.

  1. గర్భఘ్నుడు :

పువ్వుల ద్వారా గర్భిణీ స్త్రీల గర్భాలలో జేరి పిండాలను నాశనం చేస్తుంటాడు. అందుకే గర్భిణీ స్త్రీలు పూవులు ధరించరాదనే ఆచారం ఉంది. భగవన్నామ స్మరణే దీనికి శాంతి.

  1. సస్యఘ్నుడు :

పంటలు పండే పొలాలలో జేరి పంటలనూ, కూర గాయలను పాడు చేస్తుంటాడు. దిష్టి బొమ్మలనూ – జీర్ణమైన పాదరక్షలను పొలాలలో కట్టి – పసుపు కలిపినఅన్నం తో బహిర్బలి సమర్పిస్తే వీని పీడ ఉండదు. ఇంకా దుస్సహుని కుమార్తెలు:

  1. నియోజిక :

పురుషులకు ఇతరుల ధనం మీద , పర స్త్రీలమీద వ్యామోహం పుట్టిస్తుంది. వేద పారాయణం, పురాణ పఠనం చేయిస్తే ఈమె వల్ల పీడ ఉండదు.

  1. విరోధిని :

ఆలుమగల మధ్య – కుటుంబ సభ్యుల మధ్య – బంధువుల మధ్య పోట్లాటలు, భేదాభిప్రాయాలు కలిగిస్తుంది. ఇంతకు ముందు చెప్పి నట్లు అన్న బలి సమర్పించి దాన ధర్మాలు చేస్తే ఈమె పీడ తొలగిపోతుంది.

  1. స్వయంహారకరీ :

పాడిపశువులు, స్త్రీలు, ధాన్యాలు… మొదలైన వాటిలో ఏదో రకంగా చేరి నాశనం చేస్తుంది. ఎంత సంపాదించినా డబ్బు నిలకడ లేకుండా చేస్తుంది. అగ్ని యందు దూపం వేసి నెమలి యీకలు అక్కడ ఉంచితే దీని పీడ తొలగిపోతుంది.(ఈ నెమలి ఈకల చికిత్సను ఊదు వేస్తూ కొంత మంది ఫకీర్ లు కూడా చేస్తుంటారు.)

  1. భ్రామణీ:

మగవారికి, కారణం లేకుండగనే స్త్రీల పై కామవికారాలు పుట్టిస్తుంది. భూసూక్తం పారాయణ చేసి, తెల్ల ఆవాలు చల్లినచో దీని పీడ తొలగిపోతుంది.

  1. ఋతుహారికా:

రజస్సు స్త్రీలకు సంతాన కారణం. అట్టి రజస్సును ఇది క్షీణింపజేస్తుంది.. ప్రాత:కాలంలో వేగంగా ప్రవహించే నదీస్నానాలు, ఔషధ సేవనం చేస్తే దీని పీడ తొలగిపోతుంది.

  1. స్మృతిహరిణి :

మనుష్యులలోని జ్ఞాపక శక్తిని అపహరిస్తుంది. అగ్ని హోత్రం చేయుట, తీర్థయాత్రలు చేయట ద్వారా దీని పీడ నుండి విముక్తి పొంద వచ్చు!

  1. బీజహరిణి :

స్త్రీ పురుషుల యందుండు శుక్ర శోణితములలో గల సంతాన బీజాలను నాశనం చేస్తుంది. విత్తనాలలో జేరి వానిలో మొలకెత్తు శక్తిని పోగొడ్తుంది. పవిత్రమైన ఆహారాన్ని భుజిస్తూ వ్రతాలు, అన్నదానాలు మొదలైన దాన ధర్మాల వల్ల మరియు ఉత్తమ బ్రాహ్మణులచే ఇంట్లో వేద పారాయణం చేయిస్తే ఈ పీడ పరిహారమౌతుంది.

  1. విద్వేషిణి :

ఇది దంపతుల మధ్య ప్రతిదినం కలహాలు పుట్టిస్తుంది. దీని శాంతి కొరకు తెనే – పాలు – నెయ్యి కలిపిన నువ్వులను ఆహుతిగా సమర్పిస్తూ “మిత్రవింద ” అనే యజ్ఞాన్ని చేయాలి. మళ్లి ఈ 16 యక్ష్ములకు సంతానం ఉంది. వాళ్లు 38 మంది. మళ్లి వారికి వేల సంఖ్యలో లీకులు అనే దుష్టశక్తులు జన్మించారు.వారందరు అనాచార వంతులకూ,ధర్మాన్ని ఆచరింపని వారికి, అపవిత్రంగా జీవించే వారికి, అపరిశుభ్రంగా ఉండేవారికి కీడు చేస్తుంటారు. ఇలా మార్కండేయ పురాణం యక్ష్మ (తామస)సృష్టి క్రమాన్ని – వాటికి పరిహారాలను – చేయవలసిన స్తోత్రాలను సమగ్రంగా వివరించింది.

సర్వశాంతిభి: శమయో మోహం యదిహ ఘోరం యదిహ క్రూరం యదిహ పాపం తచ్చఛాన్తం తచ్ఛివం సర్వమేవ శమస్తున:

Share with your friends & family
Posted in Hinduism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading