గాలిలో ఎగురుతున్నప్పుడు ఊడిపోయిన విమానం పైకప్పు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా – The Biggest Flight Accident in Air
The Biggest Flight Accident in Air: ఏరకమైన ట్రావెల్ ఆప్షన్‌లో అయినా ప్రమాదాలు ఉంటాయి. అయితే రోడ్లపై జరిగే యాక్సిడెంట్స్‌తో పోలిస్తే, ఆకాశంలో ఎగిరే విమాన ప్రమాదాలు చాలా తక్కువని చెప్పుకోవచ్చు.

నిజానికి ఈ ప్రపంచంలోనే ఎన్నో విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఎంతోమంది చనిపోయారు. అయితే 1988లో ఎవరూ ఊహించని ఓ భయంకరమైన సంఘటన జరిగింది. గాల్లో ప్రయాణిస్తున్న విమానం పైకప్పు విరిగి ఊడిపోయింది. ఇలా జరగడమే పెద్ద వింత అనుకుంటే, ఇంత పెద్ద దుర్ఘటనలో కేవలం ఒక్కరు మాత్రమే చనిపోవడం విశేషం.
వివరాల్లోకి వెళితే, 1988 ఏప్రిల్ 28న అలోహా ఎయిర్‌లైన్స్ (Aloha Airlines)కు చెందిన ఫ్లైట్ 243 హవాయిలోని హిలో నుంచి హోనోలులుకు ప్రయాణిస్తోంది. ఈ బోయింగ్ 737-200 విమానంలో ఆరుగురు విమానయాన సిబ్బంది, 89 మంది ప్రయాణికులు ఉన్నారు.
40 నిమిషాల ప్రయాణంలో సగం దూరం పూర్తయ్యే సమయానికి, భూమి నుంచి సుమారు 24,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, విమానం పైకప్పులోని పెద్ద భాగం ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో విమానం లోపల ఒక్కసారిగా క్యాబిన్ ప్రెజర్ తగ్గిపోయింది. అంతేకాకుండా, పసిఫిక్ మహాసముద్రంపై వీస్తున్న బలమైన గాలి ప్రయాణికులకు నేరుగా బలంగా వచ్చి తగిలింది.
ఆ సమయంలో క్లారాబెల్లె లాన్సింగ్ అనే ఫ్లైట్ అటెండెంట్ విమానంలో ప్రయాణికులకు ఫుడ్ సర్వ్ చేస్తోంది. అకస్మాత్తుగా విమానం పైకప్పు విరిగిపోవడం వల్ల ఆమె బయటకు ఎగిరిపోయింది. క్షణాల్లో పైకప్పు పగిలిపోవడం, చాలా పెద్దగా సౌండ్ వినిపించడం, క్లారాబెల్లె ఎగిరిపోవడం చూసిన ప్రయాణికులు, మిగిలిన సిబ్బంది భయంతో వణికారు.

ల్యాండ్ కాకముందుకే ఫ్లైట్ మొత్తం ముక్కలై పోతుందేమో అని అందరూ భయపడ్డారు. పరిస్థితి చాలా విషమంగా ఉన్నా, పైలట్ కెప్టెన్ రాబర్ట్ స్కోర్న్స్‌థైమర్, కో-పైలట్ చాలా ధైర్యంగా వ్యవహరించారు.
పైలట్ వెంటనే అత్యవసరంగా విమానాన్ని కిందకు దింపే ప్రయత్నం చేశారు. కేవలం 13 నిమిషాలలోనే మౌయిలోని కహులుయ్ ఎయిర్‌పోర్ట్ వద్ద దెబ్బతిన్న ఫ్లైట్‌ను సురక్షితంగా దించగలిగారు. విమానం రన్‌వే వైపు వస్తున్నప్పుడు, భూమిపై ఉన్న అత్యవసర సిబ్బంది విమానం ఎంతగా దెబ్బతిన్నదో చూసి ఆశ్చర్యపోయారు.
లాన్సింగ్ మినహా మిగతా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి కానీ, పైలట్‌లు, సిబ్బంది త్వరగా చర్యలు తీసుకోవడం వల్ల ఓ పెను విషాదం తప్పింది. పైకప్పు విడిపోయిన వెంటనే క్రూ సభ్యులు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించమని, సీట్‌బెల్ట్‌లను కట్టుకోమని ప్యాసింజర్లను అప్రమత్తం చేశారు. దాంతో ప్రయాణికులందరూ సీటు బెల్టులు టైట్‌గా కట్టుకున్నారు. ఆక్సిజన్ మాస్కులు ధరించడం వంటి సూచనలన్నీ బాగా పాటిస్తూ సురక్షితంగా ఉండగలిగారు.
కారణం ఏంటి?
యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) ప్రకారం, ఫ్లైట్ ఫ్యూజ్‌లేజ్ (విమాన ప్రధాన భాగం) మెటల్ బాగా అరుగుదలకు లోనయ్యింది. ఇందులో ఒక హోల్ లేదా క్రాక్ ఏర్పడింది. ఫలితంగా ఫ్లైట్‌లో ఎక్స్‌ప్లోజివ్ డికంప్రెషన్ ఏర్పడింది. అంటే ఫ్లైట్ లోపల ఉన్న హై ఎయిర్ ప్రెజర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఫలితంగా దాని నిర్మాణంలో చాలా బాగా విడిపోయింది. ఈ సంఘటన వల్ల ఫ్లైట్‌లోని ఒక ఇంజన్ పనిచేయకుండా పోయింది.

విరిగిపోయిన పైకప్పు బాగాలు విమానంలోని చాలా భాగాలను బలంగా ఢీ కొట్టాయి. దాంతో చాలా చోట్ల డ్యామేజ్ అయ్యింది. ఫ్లైట్ అటెండెంట్ క్లారాబెల్లె లాన్సింగ్ విమానంలో నుంచి ఎగిరి సముద్రంలో పడిపోయింది. ఆమె మృతదేహం కూడా దొరకలేదు.
కొంతమంది ప్రయాణికులు విమానంలో ఎక్కేటప్పుడు దాని మిడిల్ పార్ట్‌పై పగుళ్లు ఏర్పడి ఉండటం గమనించారు కానీ, సిబ్బందికి ఈ విషయం తెలియజేయలేదు. పైలట్లు, ఇతర ఫ్లైట్ అటెండెంట్లు చాలా తెలివిగా, ధైర్యంగా వ్యవహరించడం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత ఫ్లైట్ మెయింటెనెన్స్, చెకింగ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నారు.