Menu Close

పల్లెటూరు పెళ్ళి కూతూరు – Telugu Stories about Wife and Husband

భార్యంటే భాదించేది కాదు ….. బంధాన్ని బ్రతికించేది – Telugu Stories about Wife and Husband

మూర్తి కి ముప్పై ఐదేళ్లు వస్తున్నాయి, ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తే ఏమీ.. అనాకారి కాడు, గవర్నమెంట్ ఉద్యోగం మంచి జీతం, మంచి నడవడిక, కానీ మనిషికి చాదస్తం పాలు కాస్తా ఎక్కువ, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం, దానికి తోడు కొంచం నోటి దూల కారంరణంగానే వచ్చిన సంబంధాలన్ని కుదరకుండా పోతున్నాయి.

ఈ రోజు ఇరవై తొమ్మిదొవ పెళ్లి చూపులు, ఇదైనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి…. మొక్కని దేవుడు కట్టని ముడుపు గాని లేదు. ఈ సారి మూర్తి కూడా కాస్తా మెత్త బడ్డాడు…

తల్లి మేనమామ మూర్తిని నోరెత్త వద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు ,కాస్త దూరపు బంధుత్వం కావడం, తాననుకున్నట్లు పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరి అమ్మాయి కావటంతో మూర్తి కూడా సరే నన్నాడు.

మూర్తికి వాళ్లు, వీళ్లు చెప్పిన మాటలు విని, చెత్త చెదారం చదివి, పనికిరాని సీరియళ్లలో..అడోళ్ల పెత్తనాలు చూసి… పెళ్ళెంటే భయం పట్టింది..అమ్మో భార్య… అనే ఫీలింగ్ వచ్చింది.

అందుకే ఓ పల్లెటూరి బైతు..పనికిరాని మొద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది…. అలాంటి సంబంధమే కావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి.

మూర్తి తన తల్లి అలాగే మేనమామతో కలసి పెళ్ళిచూపులకు రావడం జరిగింది. అమ్మాయి..అందరికి ‘టీ’ లు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు, చక్కని కుందనపు బొమ్మ లక్ష్మీ ,తెల్లని మేని ఛాయా,చక్కటి ముఖ వర్ఛస్సు, పెద్ద జడ..ఈ కాలం పిల్లల్లా కాక చక్కగా..పుత్తడి బోమ్మలా….అచ్చం పల్లె ముద్దబంతిలా, ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మీ. “బాబు అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి” అన్నాడు అమ్మాయి తండ్రి.

ఆ మాటతో మూర్తి తల్లి..మేనమామ హడలిపోయి “అడిగేది ఏమి లేదు అన్నారు ముక్త కంఠంతో” అవకాశం ఇస్తే మూర్తి అడిగే తల తిక్క ప్రశ్నలకు ఈ సంబంధం కూడా జారిపోవడం పోవడం ఖాయం అనే భయంతో. కానీ అప్పటి దాకా అణిగి మౌనంగా వున్న మూర్తికి “ఏదైనా అడగాలంటే అడగండి” అన్న మాటలు వినపడగానే…. అసలు మూర్తి బైటికి వచ్చాడు..

ఇంకా అంతే ఎవరు చెప్పిన వినడని.. తల్లికి అర్ధమైంది..ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకోని తల పట్టుకుంది. మూర్తి కాలు పస… పసమని తొక్కింది తల్లి.. ఎంత తొక్కినా ఒకపట్టాన వినాడే… పూనకం వచ్చినవాడిలా ..మూర్తి గొంతు సవరించుకొని తన ప్రశ్నలను సంధించడం మొదలు పెట్టాడు.

ఈ సంబంధం కూడా గోవిందా.. గోవిందా అను కొంటూ మూర్తిని వారంచబోయాడు మూర్తి మేనమామ. కానీ అవేమి పంటిచుకోకుండా మూర్తి పెళ్ళి కూతురుని ఇలా ప్రశ్నలడగడం జరిగింది.

“మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా”? అన్నాడు మూర్తి గంభీరంగా. “అంటే ఏంటoటా”…. అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మీ ..తనకు అలాంటిదేమి తెలియనట్లు… హమ్మయ్య అనుకొని… “గుడ్” అన్నాడు మూర్తి.

“మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా”..? అడిగాడు మూర్తి. అదేంటబ్బా అన్నట్లు మొఖం పెట్టి..”ఎప్పుడు వినలేదండి” అంది లక్ష్మి.. కళ్ళు టప టప లాడిస్తూ. “మీకు టీవి లో ఏ సీరియల్ అంటే ఇష్టం.. ? దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలులుకోవాలని మూర్తి ఆరాటం.

“శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్…NTV భక్తి చానల్ అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి” అంది లక్ష్మి. మూర్తికి మహదానందమేసింది. “పిజ్జాలు..బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి.

దీనిద్వారా బజార్లకు వెళ్లే అలవాటు ఉందా”…? లేదా…?అని తెలుసుకోవాలన్నది మూర్తి ఆలోచన. “ఏంటో… అలాంటి పేర్లేవి తెలియవoడి అవి పళ్లా.. కాయల.. స్వీట్సా” అంది లక్ష్మీ అయోమయంగా.. మూర్తికి ఎగిరి గంతేయలనిపించినా.. బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు.

“నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి కానీ అంతలోనే సర్దుకొని “ఆ..ఆ…ఉన్నారండి…. ఎదురింటి రెండో తరగతి బుజ్జిగాడు,పక్కింటి నాలుగోతరగతి చంటిగాడు వున్నారు” అని నాలుక కరుచు కుంది లక్ష్మి సిగ్గుపడుతూ..

మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్నివిధాల నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు… ఈ సంభందం నాకు డబుల్ ఒకే.. అన్నాడు మూర్తి.. ఆనందంగా. కానీ….ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రోకడయిల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా.. పాపం.

ఈ మాట విన్న మూర్తి తల్లికి,మేనమాకు పెద్దగా కేక వేసి ,ఎగిరి గెతులేయాలనిపించి … ఈ వయస్సులో అలా చేయటం ఏమీ బాగుండదనుకొని బంధువులతో కలసి ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి. మొత్తానికి అందరికి నచ్చడాలు..నిశ్చయ తాంబూళాలు, పెళ్లి అన్ని చక చక జరిగి పోయాయి.

మూర్తి పెళ్ళి అయిన సంధర్బంలో తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళివస్తానని.. బయలు దేరింది. కొత్త సంసారం..కొత్త కాపురం .. సౌందర్యరాసి లాంటి భార్య అందునా కోరినా దొరకని ఏకాంతం..దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి.

పాపం ఇప్పుడే కథ లో..యుద్ధకాండ ప్రారంభం అవుతుందని తెలియని పూర్ మూర్తి. “లక్ష్మి ..లక్ష్మి…” అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నుంచున్నాడు మూర్తి “ఆ..ఇదిగో వస్తున్నానండి” అంటూ మెష్ డోర్ తీసి బైటికి వచ్చి బైక్ కు తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి. “అన్నట్టు.. నువ్వు చెప్పిన సరుకులన్ని ఉన్నాయేమో చూసుకో” అంటూ బాత్ రూంలోకి వెళ్ళాడు మూర్తి.

“ఆ..ఆ..అలాగే నండి” అంది లక్ష్మీ సంచిని తీసుకుంటూ.. బాత్రూమ్ పరిస్థితి చూసి చిర్రెత్తి మూర్తి కోపంగా “లక్ష్మీ “…అంటూ గట్టిగా అరిచాడు…”నేకేం చెప్పాను టాయిలెట్..బాత్ రూమ్ క్లిన్ చేయమని చెప్పానా..లేదా…ఏంటీ దరిద్రం “అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి.

ఆ అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మీ .. “ఏమైందండి అంది”. అమాయాకంగా ముఖం పెట్టి “ఏంటా..చూడు టాయిలెట్ బాత్ రూమ్ ఎలా తగలడ్డాయో”.. అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి. “ఒక్క నిముషమండి” అంటూ.. నింపాదిగా ఇంట్లోకి వెళ్లి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లినర్ తో ప్రత్యక్షమైంది లక్ష్మి.

తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు..తన మాటమీద ఉన్న గౌరవానికి లోలోన సంతోషిస్తూ.. “ఊ.. కానియ్” అన్నాడు హుకూమ్ జారీ చేస్తూ..మూర్తి “అదికాదండి….. ఇది హార్పిక్, ఇది క్లీనర్ ,అవి నీళ్లు ఇవి చాలా.. అని అడిగింది లక్ష్మీ.

అను అవే కావలసింది బాత్రూం కడగడానికి అలా గుడ్లప్పగించకుండా వెళ్ళి శుభ్రం చేయి” అన్నాడు మూర్తి కోపంగా. “మరే నండి.. ఇది టీవీలో మొగబ్బాయి అబ్బాస్ వాడి చూపించాడు..అంటే ఇది మొగవాళ్ళు చేసేదండి పైగా వెంకటేష్ గారు కూడా మోగాళ్లే ఈ పని చేయాలని చెప్పారు టీవీ లో మీరు చూశారుగా” . అంది లక్ష్మీ అమాయకంగా “ఓహో మంచి ప్లాను మీదే ఉన్నవన్న మాట అందుకేనా హార్పిక్ తేoడి…., హార్పిక్ తేండి… అని నొక్కి నొక్కి చెప్పింది…హమ్మ …హమ్మ.. ఎంత గుండెలు తీసిన బంటువే ” అన్నాడు మూర్తి ఆవేశంగా..

“అయ్యోరామ.. నాకేం తెలుసండి ఆ టీవి వాళ్ళు అలాగే చెప్పారుగా” అంది ఏడుపు మోఖం పెట్టి లక్ష్మీ. “చాల్లే …ముందా ఆ ఏడుపు ఆపి తగలడు” అన్నాడు మూర్తి. “త్వరగా కానివ్వండి టాయిలెట్ కంపు కొడుతుందని ,ప్రొద్దుట నుండి నేను టాయిలెట్ కి వెళ్ళలేదు..

మీరెప్పుడొస్తారా ఎప్పుడు శుభ్రం చేస్తారా..ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి” అంది లక్ష్మీ కడుపు నొక్కుకుంటూ… భార్య మాటలకు ఒళ్ళు మండి “వుద్దరించావులే” అంటూ టాయిలెట్ గబ గబా క్లిన్ చేసాడు మూర్తి.

అలా చేసి చేయగానే అందులో దూరింది లక్ష్మి “హమ్మయ్య లక్ష రూపాయలు దొరికినట్లుందండి.. ప్రాణానికి ఎంత హాయిగా ఉందొ” అంటూ ప్రశాంత వదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మీ.

“చాల్లే సంబడం..దీనికేమి తక్కువలేదు,ఇంతకు ఏమైనా చేశావ తినడానికి లేదా అన్నాడు మూర్తి.. “ఆ..ఆ.. చక్కగా.. వెరైటీగా పులిహోర చేశానండి” అంది లక్ష్మి ఉత్సాహంగా.. పులిహోర… రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి.

“అబ్బా …..ఆకలి దంచేస్తుంది.. ఏది త్వరగా పెట్టు” అన్నాడు మూర్తి. “మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి”…లక్ష్మీతో “లేదండి భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది…అందుకే తినలేదండి” అంది లక్ష్మి పతిభక్తితో పరవశిస్తూ… “అది ధట్స్..గుడ్…అలావుండాలి భార్యంటే… గుడ్ లక్..”అంటూ ఏది పులిహోర అన్నాడు..మూర్తి.

పులిహోర చూడగానే “ఇదేంటే నీ బొంద ఇలా తగలడింది …వెరైటి..వెరైటీ అన్నావుగా ఏం…తగలేసావే ఇందులో నీయమ్మా…కడుపు మాడ” వాంతి వచ్చేటట్టుంటే అన్నాడు మూర్తి కోపంగా. “మరేనండి….. నిమ్మకాయకు బదులు వంద నిమ్మకాయల శక్తి ఉంటుందని ‘వీల్ పౌడర్’, కొద్దిగా ‘విమ్’ అదేనండి అంట్లు రుద్దే సోప్ కొద్దిగా వేసాను,పసుపు చందనం గుణాల కలయిక ‘సంతూర్’ అంటారుగా అందుకే కొంచం సబ్బుముక్క వేసాను, మీ ‘టూత్ పేస్టు’లో ఉప్పుందా.. అంటారుగా అందుకే ఉప్పు బదులు కాల్గెట్ టూత్ పేస్ట్ వేసాను, ఘాటుకోసం కాస్త ‘డాబార్ రెడ్ పౌడర్’ వాడాను”…. ఇంకా..మాట పూర్తి కాకుండానే… “నీ బొంద… నీ బొందే… నీ కడుపు మాడా మనుషులను చంపడానికి పుట్టావటే… ఎదో పల్లెటూరి పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి వెతికి చేసుకుంటే..నా కొంప ముంచావు కదే,నా జీవితం నాశనం చేసావు కదే”, నీలాంటి దద్దోజనాన్ని చేసుకొన్నానే అంటూ పులిహోర కంచాన్ని విసిరి కొట్టి ఒంటిపై వున్న గుడ్డలు చింపుకొని,జుట్టు పీక్కుంటు..”ఒరేయ్ మూర్తి నీకు తగిన శాస్తి జరిగిందరా పల్లెటూరు అమ్మాయే కావలని కోరుకొనందుకు”… అంటూ పెళ్ళు పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు,పక్కనే వున్న తుండు గుడ్డ నెత్తినేసుకొంటూ కూర్చొండి పోయాడు బాధతో……

“ఇంకానయం ఉగాది పచ్చడిలో ‘మార్గో సబ్బు’,తో…..’టీ’ పెట్టమంటే తబలా.. వాయిoచండి.. వాహ్… తాజ్ అనండి అని, ‘థమ్సప్’ కోసం నన్ను సముద్రంలో దూకమని… వామ్మో..వామ్మో నువ్వెక్కడ దొరికావే…నా ప్రాణానికి”… హమ్మ హామ్మ..అంటూ ఆయాసపడ్డాడు మూర్తి.

“ఏవండి…ఇదిగో ఇప్పుడే చెపుతున్నా నన్ను ఏమన్న ఇబ్బంది పెట్టారో ?…జాగ్రత్త నేను డైరెక్టుగా.. టీవీలో వచ్చే..రోజాగారి రచ్చబండకో,జీవిత గారి బ్రతుకు జట్కాబండికో,సుమలత గారి సంసారం ఒక చదరంగంకో మిమ్ములను ఈడుస్తాను…ఆట్టే..నా సంగతి తెలియదు మీకు, నాకు గాని తిక్కరేగిందో.. మీ బతుకు బస్టాండ్ అవుతుంది జాగ్రత్త..జాగ్రత్త” అని వేలు చూపించుకుంటూ .. ఏడుస్తూ..ఉన్నపళాన వెళ్లి పోయింది లక్ష్మి.

ఇంతలో తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన మూర్తి తల్లి అక్కడ పరిస్థితి చూసి ,”ఏంట్రా పిచ్చి మూర్తి ఏం జరిగిందిరా నాన అంది”. తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖoతో…తల్లి వడిలో తలపెట్టి జరిగినదంతా చెప్పి బోరు బోరున వెక్కిళ్లు పెట్టి ఏడ్చాడు మూర్తి.

“అమ్మా… నా జీవితం నాశనం అయింది..ఆ చాందస్తపుది నాకెక్కడ దాపురించిందే, ఓ చదువు లేదు, సంధ్య లేదు, మచ్చుకైనా .. సంస్కారం లేదు..ఏదేదో.. ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే..నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు, ఆ దేవుడు..ఆదేవుడు.. నాకు తగిన గుణపాఠం చెప్పడే”.. అంటూ బ్యార్ మన్నాడు మూర్తి.

తల్లి చిరు నవ్వు నవ్వి..”ఓరి నా వెర్రి నాగన్న అమ్మ ఉండగా అలా జరుగనిస్తుందా..నాయనా నీకు గుణపాఠం నేర్పాలనే,లక్ష్మీ అలా చేసింది, అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని, పెళ్ళాం చదువుకుంటే మాట వినదని,సీరియళ్లు చూస్తే చెడిపోతుందని, భర్తను లెక్కచేయదని, ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా..అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము”.

“నీ మంచితనం..నీ అమాయకత్వం నీ పద్దతులన్ని చెప్పి లక్ష్మిని పెళ్లికి ముందే ఒప్పించాము,నీ తిక్క ప్రశ్నల సంగతి, నీ అతి చాదస్తాన్ని కూడా ముందే చెప్పామురా,అన్ని తెలిసే లక్ష్మి ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా..నా కోడలు లక్ష్మి… మహా లక్ష్మీరా…అది పల్లెటూరులో పుట్టినా చదువుల తల్లిరా…గ్రూప్ టూ..లో టాపార్ రా అది, రేపో ….మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా ..

అది పల్లెటూరిదే కానీ, తెలివితక్కువది కాదురా..సీరియళ్లు చూస్తుంది కాని, వాటిలో ఏది మంచో ఏది చేడో తెలియని అమాయకురాలు కాదురా”… “అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో”.. అంది మూర్తి అమ్మ నవ్వుతూ… గోడ వారుగా నవ్వుతూ నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్య పోయాడు…

మెల్లిగా లేచి రెండడుగులు వేసి లక్ష్మి కి దగ్గరగా వెళ్ళాడు మూర్తి ఉబికి వస్తున్న ఆనంద బాష్పలను..తుడ్చుకుంటూ.. “నన్ను క్షమించండి” అంన్నది మూర్తి తో లక్ష్మీ. మూర్తి భార్య గురించి తప్పుగా భావించినందుకు “అయాం.. సారి లక్ష్మి” అన్నాడు మూర్తి ఆర్ధత నిండిన గొంతకతో.. “అమ్మాయి పల్లెటూరిదైన..పట్టణానిదైన చదువున్నా లేకున్నా..ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి..

మీరనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి…ఎంత ఓర్పు లేకుంటే తాగే వ్యసన పరులైన భర్తలను,రోజు హింసించి వేధించే దుర్మాగులైన భర్తలను భార్యలు వదిలి వేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తపించే స్త్రీ మూర్తులెందరో ఉన్నారండి ఈ లోకంలో .. అందరూ మీరనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది..

మంచి చెడు ఎప్పుడూ పక్క పక్కనే వుంటాయండి, కానీ చెడుకు ప్రచారం ఎక్కువ, అందుకే అది అందరికి తెలుస్తుంది… మంచిని అందరూ మరచి పోతారు. మనుషులం నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటారండి అదే మన దౌర్భాగ్యం” అంది లక్ష్మీ సౌమ్యంగా తన భర్తతో. “అవును లక్ష్మి నువ్వన్నది ముమ్మాటికీ నిజం..ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేక పోయాను.. కాదు కాదు నీలా అందంగా చెప్పే వారు లేక తెలులుకోలేక పోయాను..సారి లక్ష్మి… వెరీ వెరీ సారి” అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో……

లక్ష్మిని ప్రేమగా దగ్గరికి తీసుకొంటూ… తన తప్పును తెలుసుకొందుకు సంతోషంచిన మూర్తి తల్లి…… ఒరేయ్ ఆకలన్నావుగా ఇదిగో నీకోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర ఇది తిందువురా అంది మూర్తి తల్లి. అమ్మచేత..లక్ష్మి చేసిన పులిహోర తింటూ అబ్బా ఇంత బ్రహ్మాoడమైన పులిహోర ఎప్పుడు తినలేదంటూ.. లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి.

“అదేరా…పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అంటారందుకే..ఇన్నాళ్లు చేసిపెట్టిన అమ్మ చేదయిందిరా”.. అంది అమ్మ వేళాకోళం చేస్తూ.. “ఆ మాత్రం లౌక్యం లేకుంటే..ఎలా అత్తయ్య” అంది లక్ష్మి.. నవ్వుతూ.. ఆ మాటలకు మూర్తి కూడా సంతోషంగా… నవ్వుకున్నాడు.

భార్యంటే భాదించేది కాదు ….. బంధాన్ని బ్రతికించేది

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Like and Share
+1
14
+1
10
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading