ఓసారి నారదుడు భూలోకం మీద సంచరిస్తుండగా… అతనికి కైలాసం అనే భక్తుడు కనిపించాడు. కైలాసాన్ని చూడగానే నారదునికి ఎందుకో జాలి కలిగింది. ‘కైలాసం ఎన్నాళ్లని ఇలా ఈ సంసార జంఝాటంలో పడిఉంటావు? నువ్వు కూడా చక్కగా నాతో వచ్చేయి. నిన్ను ఆ భగవంతుని పాదాల చెంతకు తీసుకువెళ్తాను,’ అని అన్నాడు.
‘అయ్యో మహానుభావా! మీ నోటివెంట ఆ మాట రావడం నా అదృష్టం. ఆ భగవంతుని చేరుకోవడమే ఈ జన్మకి పరమార్థం కదా! కాకపోతే ఓ చిన్నమనవి. నా పిల్లలు ఇంకా పసివారు. లోకం తెలియనివారు. వాళ్లని పెంచి యోగ్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా! ఆ బాధ్యత తీరిన వెంటనే ఠక్కున మీతో వచ్చేస్తాను,’ అని వేడుకున్నాడు కైలాసం.
తాను అంత గొప్ప వరం ఇచ్చినా కూడా కైలాసం తృణీకరించేసరికి నారదుడు బాధపడ్డాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఆయన తన వరాన్నిమాత్రం మర్చిపోలేదు. అందుకనే కొన్నేళ్లు గడిచిన తర్వాత తిరిగి కైలాసం ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. ‘కైలాసం! నీ పిల్లలు యోగ్యులయ్యారు కదా! ఇక నాతో వస్తావా!’ అనిఅడిగాడు.
‘అయ్యో! ఈ దీనుడిని ఇంకాగుర్తుంచుకున్నారా మహానుభావా! తప్పకుండా మీతోవస్తాను. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడిప్పుడే నావంశం వృద్ధి చెందుతోంది. కాస్త నామనవళ్లనీ, మనవరాళ్లనీ తనివితీరా చూసుకుంటాను. పిల్లలకు వ్యాపార రహస్యాలన్నీ నేర్పుతాను. కొద్ది సంవత్సరాలు గడిచాక ఇక నేను లేని లోటు కూడా వారికి తెలియదు. అప్పుడు మీతో తప్పకుండా వచ్చేస్తాను,’ అన్నాడుకైలాసం.
నారదుడు మరోసారి భంగపడి, బాధపడి తనదారిన తను వెళ్లిపోయాడు. కానీ తను వరాన్ని ఒసగిన విషయం గుర్తుంచుకుని కొన్నేళ్ల తర్వాత తిరిగి కైలాసం దగ్గరకు వెళ్లాడు. కానీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే కైలాసం అప్పటికే మరణించాడన్న విషయం తెలిసింది. ఇక కైలాసం ఏ దేహంలో ఉండి ఉంటాడో అని ఆలోచిస్తూ నారదుడు అక్కడి నుంచి నిష్ర్కమిస్తుండగా ‘మునివర్యులకుప్రణామం!’ అన్న మాటలు వినిపించాయి. వెనక్కి తిరిగిచూస్తే ఏముంది… కైలాసం ఆ ఇంటి కుక్కగా జన్మించాడని అర్థమైంది.
‘నారదా! నా కోసం మీరు తిరిగి వచ్చినందుకు శతకోటిధన్యవాదాలు. కాకపోతే చిన్నమాట! మా పిల్లలు ఉన్నారు చూశారు. వారికి నాఅంతజాగ్రత్త రాలేదు. అంతులేని సంపద చేతికిరావడంతో చాలాఅశ్రద్ధగా ఉంటున్నారు. అందుకే ఈ ఇంటికి పరులెవ్వరూ రాకుండా, ఇంట్లోని సంపదని దొంగలుదోచుకుపోకుండా ఈ ఇంటిని రాత్రింబగళ్లు కాపాడుకుంటూ వస్తున్నాను. నా పిల్లలకి కాస్త జాగ్రత్త తెలుస్తోందన్న నమ్మకం కలగగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీతో వచ్చేస్తాను,’ అంటూ ప్రాథేయపడ్డాడు.
నారదుడు ఉస్సూరుమంటూ అక్కడినుంచి వెడలిపోయాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. పాపం నారదుడు వరం ఇచ్చాడు కాబట్టి, ఆ వరాన్నినెరవేర్చే బాధ్యత కూడా ఆయన మీద ఉందయ్యే! కాబట్టి మళ్లీ కైలాసం ఉండే ఇంటికి వెళ్లాడు. కానీ అక్కడ కుక్క కనిపించలేదు. కొద్దిరోజులక్రితమే అది చనిపోయిందని తెలిసింది. అది తిరిగి ఏ జన్మ ఎత్తిందా అని యోచిస్తూ నారదుడు ఆ ఇంటి వెనకే ఉన్న పొలంలో తిరుగుతుండగా…. ‘మునివర్యులకుప్రణామం!’ అన్న సుపరిచితమైన గొంతుక వినిపించింది. అటూఇటూ చూడగా గడ్డివాము చాటున మునగదీసుకుని ఉన్న పామురూపంలో కైలాసం కనిపించాడు.
‘నారదా! నా పిల్లలకు డబ్బు మీద జాగ్రత్త కలిగిన మాట నిజమే! కానీ వారు మహాబద్ధకిష్టులు. ఎప్పుడో కానీ పొలంలోకి అడుగుపెట్టరు. ఈలోగా నానారకాల జీవాలన్నీ పొలంలోని ధాన్యరాశులని ఆరగించేస్తున్నాయి. అదనుచూసుకుని పక్కపొలంలోనివారుకూడా ఇక్కడి ధాన్యాన్నితస్కరిస్తున్నారు. అందుకనే నా పొలానికి అండగా ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. ఈ కాస్త బాధ్యత తీరగానే మీ వెంబడి వచ్చేస్తాను. బాబ్బాబు! ఈ ఒక్కసారికీ నన్ను విడిచిపెట్టివెళ్లండి,’ అంటూప్రాధేయపడ్డాడు.
నారదుడు ఒక్కక్షణం ఆలోచించాడు. కైలాసం ఆశాపాశాలకు అంతేలేకుండా పోయిందని గ్రహించాడు. ఆ వలయం నుంచి ఎలాగైనా అతన్ని దాటవేయాలని తలచాడు. అంతే! ఆ ఇంట్లోని వారిని పిలిచి వారి పొలంలో తిరుగుతున్న పాముని చూపించాడు. పాముని చూడగానే… ఇంట్లోవారంతా తలా ఓ దుడ్డుకర్రనీ తీసుకుని దాన్ని మోది మోది చంపారు.
‘నేనుమీతండ్రికైలాసాన్ని’ అంటూ ఆ పాము ఎంత మొత్తుకున్నా దాని భాష వారి చెవిన పడలేదు. మోహంలో కన్నూమిన్నూ కానని తనకి తగిన శాస్తి జరిగిందని బుద్ధితెచ్చుకుంటూ కైలాసం తన ప్రాణాన్ని విడిచాడు. నారదునితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధపడ్డాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.