Menu Close

పెళ్లి తప్పేట్టు లేదు పెదబాబుకి-Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

పెళ్లి తప్పేట్టు లేదు పెదబాబుకి. ‘కరోనా వెళ్ళేదాకా కాస్త ఆగరా’ అంటే “ఇది జీవితాంతం ఉండే వైరసు! అంటే లైఫులో నాకు పెళ్లి చెయ్యరా?” తిక్క రేగింది వాడికి. “సరే తగలడు. ఎవరెవర్ని పిలవాలో లిస్టు తయారు చెయ్యండి. ఇరవై మందికే పర్మిషనట!” అన్నాడు పెద్దాయన. “ఇదిగో చెల్లి పెళ్ళప్పటి లిస్టు. ఇందులో ఏడువందల ఎనభై రెండు పేర్లున్నాయి మరి!”
“చచ్చేం! పేర్లన్నీ కొట్టెయ్యండి. దయాదాక్షిణ్యాలు లేవు, బంధుత్వాబంధుత్వాలు లేవు, ప్రతిష్టాఅప్రదిష్ఠలు లేవు!” అన్నాడు పెద్దాయన ఆవేశంగా. అలాగే కొట్టేసుకుంటూ పోతే పంతొమ్మిది మంది తేలేరు. “ ఇంతకుమించి చచ్చినా తగ్గరు!” “గుడ్. పెళ్లి కూతురు ఒక్కత్తినీ పంపించమని వియ్యంకుడికి ఫోన్ కొడదాం. దాంతో ఇరవై మంది అవుతారు.”
“బావుంది సంబడం! పెళ్ళికూతురొక్కత్తినీ పంపిస్తే మరి ఎవరి బాబొచ్చి చేస్తాడండీ కన్యాదానం?” వియ్యంకుడు ఎగిరి పడ్డాడు. “అవును కదా, సరే మీ మొగుడూ పెళ్లాలిద్దరూ కూడా రండి, ఆవార మేం ఇద్దరిని తగ్గించుకుంటాం మా లిస్టులో! ఇంతకీ పురోహితుణ్ణి మీరు తెస్తున్నారుగా?” “లేదు లేదు మీరే తేవాలి.” “అయినా ‘మాంగల్యం తంతునా నేనా’ మనకందరికీ నోటి కొచ్చిందే కదా. అది చదివేసి పుస్తి కట్టించేస్తే పోలా? సుమతీ శతకం చదివేసి మావాడొకడు పెళ్లిళ్లు చేయించేస్తున్నాడు. వాళ్ళంతా పిల్లాపాపలతో సుఖంగా కాపరాలు చేసుకుంటున్నారు!”
“ఓకే. మరి భజంత్రీలో?” “భజంత్రీలు?? బహువచనం కూడానా? ‘భజంత్రీ’.. అనండి. ఒకాయనే వస్తాడు. ఆయనే నోటితో తూతూబాకా వాయిస్తూ రెండు చేతుల్తో డోలు వాయిస్తాడు!”


“అన్నట్టు వీడియో వాళ్ళు నలుగురొస్తారట.” గుర్తు చేసాడు పెదబాబు. “ చాల్చాలు. వొడిలిపోయి, వాడిపోయిన మన మొహాలకు వీడియోలు కూడానా? చినబాబు వాడి కెమెరాతో ఫుటోలు తీస్తాడు చాలు..”
“మరిచిపోయా బావగారూ. వాళ్ళక్క పెళ్ళిలో జడ తనే పైకెత్తి పట్టుకోవాలని మా చంటిది ఎప్పట్నుంచో రిహార్సల్సు వేసుకుంటోంది. దాన్ని రావద్దంటే చంపేస్తుంది. ఇంకో విషయం. పెళ్ళికూతురికి చీర కట్టుకోడం రాదు. దానివన్నీ చుడీదార్లే కదా. చీర కట్టడానికి, పీటల మీద అది జారిపోకుండా చూసుకోడానికీ మా మరదలు దగ్గరుండాల్సిందే. అలాగే పెట్టి దగ్గర కూర్చుని సామాను అందించడానికి, పిల్లని బుట్టలో తేవడానికి ముగ్గురు బావమరుదులు తప్పదు!” అన్నాడు వియ్యంకుడు. “బుట్ట సిస్టం కాన్సిలండీ. పిల్లని నడిచి రమ్మనండి. పెళ్లి మండపం దూరవేం కాదు.”


“అంటే మరో తొమ్మిది మందిని కొట్టెయ్యాలి మా లిస్టులో! బావుంది. ఇలా మీరు పదహారు అక్షౌణీల సైన్యాన్ని యుద్ధానికి తెచ్చినట్టు తెస్తే మేం ఏమైపోవాలి? మా వాళ్ళని ఎంతమందిని తెగ్గోయాలి? మా కొంపలోనే పదిమంది ఉన్నామాయె!” “ఎందుకుండరూ? కుటుంబ నియంత్రణాపరేషను చేయించుకోమని అప్పట్లో ఎన్నిసార్లు బతిమాలేరు మా వాళ్ళు! వినిపించుకున్నారా?” వంటింట్లోంచి పలికిందో స్త్రీ స్వరం.
“నాన్నా! మరి భోజనాలు?” “ఔన్రోయ్ మరిచిపోయాం. కేటరింగ్ వాళ్ళు నలుగురొస్తారట. వాళ్ళని తగ్గిస్తే తిండుండదు ఎవరికీ. ఓర్నాయనో! అవతల ఆడ పెళ్ళివాళ్ళు, ఇవతల వీళ్ళు! ఎవరి పేర్లు కొట్టెయ్యాలిరా? ఈ పెళ్లి నా వల్ల కాదు! గంగలో దూకండి అంతా!”


పోనీ, ఇరవై కంటే ఎక్కువమందిని తెచ్చుకోడానికి మనిషికి ఇంత చొప్పున పెనాల్టీ కట్టేద్దామా గవర్నమెంటుకి? సగం సగం భరిద్దాం మీరూ మేమూ.” “చాల్చాలు. ఇప్పటికే మాస్కులూ, సబ్బులూ, తువ్వాళ్ళూ అంటూ చాలా పెనాల్టీలు వేశారు మా మీద. ఇక మా వల్ల కాదు.” వియ్యంకుడి జవాబు.
“నాన్నా, అరమొహం మాస్కులతో, వైరస్ భయాలతో, రాని చుట్టాలతో ఈ పెళ్లి ఏం కళ కడుతుంది? వాయిదా వెయ్యండి. ఈలోగా ఆ పిల్లని పంపించమనండి. అందాకా సహజీవనం చేస్తాం!”
“డొక్క చీరేస్తా వెధవా! రిజిస్టర్ మ్యారేజ్ చేసుకు తగలడండి! పోండి!”
సేకరణ……
కొణకంచి సూర్య ప్రకాష్

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading