Menu Close

అహంకరిస్తే అవమానం తప్పదు!-Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

పూర్వం ఓ ధనిక వర్తకుడు ఉండేవాడు. అతగాడికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలూ ఓ కాకిని ముద్దుచేయసాగారు. వారు విదిలించే ఎంగిలి ఆహారాన్ని తిని ఆ కాకి గుండ్రంగా తయారైంది. రోజూ మృష్టాన్నం దొరకడంతో దాని అతిశయానికి అంతులేకుండా పోయింది. అసలు తనలాంటి పక్షి ఈ భూమ్మీదే లేదన్నంతగా దాని పొగరు పెరిగిపోయింది. ఆ పొగరుకి తగినట్లుగానే మిగతా పక్షులని చులకన చేయసాగింది.


కాలం ఇలా సాగుతుండగా ఒక రోజు ఓ హంసల గుంపు వినువీధిలో ఎగురుతూ కాకికి కనిపించాయి. ‘మీ వాలకం చూస్తుంటే నాకు జాలి వేస్తోంది. ఎలాంటి కదలికలూ లేకుండా నిదానంగా సాగడం మాత్రమే మీకు తెలసు. అదే నేనైతేనా.. నూటొక్క రకాలుగా ఎగరగలను. ఒకో భంగిమలోనూ వందల యోజనాలు ప్రయాణించగలను. కావాలంటే నాతో పోటీ పడి చూడండి!’ అంటూ ఆ హంసలను రెచ్చగొట్టింది కాకి.


కాకి మాటలను విన్న ఓ హంస, దాని దగ్గరకు వచ్చింది. ‘మేము ఎక్కడో మానససరోవరం నుంచీ ప్రయాణిస్తున్నాం. అంతలేసి దూరాలను ప్రయాణించగలం కాబట్టే లోకం మమ్మల్ని గౌరవిస్తుంది. మాతో నీకు పోటీ ఏంటి!’ అంటూ కాకిని సమాధానపరిచే ప్రయత్నం చేసింది. కానీ కాకికి పొగరు తలకెక్కింది. వెనక్కి తగ్గే వినయం కోల్పోయింది.


‘నాతో పోటీ అంటే భయపడి ఇలాంటి సాకులు చెబుతున్నావు. నీలో నిజంగా దమ్ముంటే నాతో పోటీకి రా!’ అంటూ రెచ్చగొట్టింది. దాంతో కాకి, హంస పోటీకి సిద్ధమయ్యాయి.


ఒక్కసారిగా గగనతలంలోకి ఎగిరాయి. కాకి మాంచి ఉషారుగా ఉందేమో… ఎగరడంలో తనకి తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించడం మొదలుపెట్టింది. గాలిలో పల్టీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేసింది. హంస మాత్రం తనకి తెలిసిన ఒకే ఒక భంగిమలో నిదానంగా ఎగరసాగింది.


పోటీలో హంస ఎగురుతున్న తీరుని చూసి కాకి పగలబడి నవ్వింది. ‘ఇలా అయితే గమ్యం చేరుకున్నట్లే! చూస్తుంటే నువ్వు నాతో ఏమాత్రం సరితూగలేవు అనిపిస్తోంది,’ అంటూ ఎగతాళి చేసింది. కానీ హంస మాత్రం చిరునవ్వే సమాధానంగా ముందుకు సాగింది.


చూస్తూచూస్తుండగా తీరం దూరమైపోయింది. ఎటుచూసినా ఎడతెగని నీరే కనిపించసాగింది. అలసిపోయి కాలు మోపేందుకు, ఇసుమంతైనా ఇసుక కనిపించలేదు.


ఆ దృశ్యం చూసేసరికి కాకి గుండె ఝల్లుమంది. ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుదామంటే దాని ఒంట్లో ఓపిక నశించిపోయింది. మరికొద్ది క్షణాలకి రెక్కలు కూడా ఆడించలేని స్థితికి చేరుకొంది. ఇక నిదానంగా నీటి మీదకి జారిపోవడం మొదలుపెట్టింది.


‘ఓ హంస మిత్రమా! ఇక నేను ఎగరలేకపోతున్నాను. ఈ సమయంలో నువ్వు మాత్రమే నా ప్రాణాలను కాపాడగలవు. దయచేసి నన్ను రక్షించు!’ అని జాలిగా అరవసాగింది.


కాకి అరుపులు విని వెనక్కి చూసిన హంసకి విషయం అర్థమైంది. కాకి పొగరు దాని ప్రాణాల మీదకు వచ్చిందని తెలిసింది. అయినా జాలిపడి కాకి చెంతకి చేరుకుంది. దానిని నోట కరుచుకుని తిరిగి ఒడ్డు మీదకు చేర్చింది.


‘మిత్రమా! ఎంగిలిమెతుకులు తిని బలిసిన నేను కన్నూమిన్నూ కానక నిన్ను రెచ్చగొట్టాను. నా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాను. పెద్దమనసుతో నువ్వు నన్ను ఆదుకోకపోతే ఆ సముద్రంలోనే సమాధి అయిపోయేదాన్ని. ఇక మీదట ఎప్పుడూ నా యోగ్యతని మరచి గొప్పలకు పోను. దయచేసి నన్ను క్షమించు,’ అంటూ ప్రాథేయపడింది.


కాకి మాటలు విన్న హంస నవ్వుకుంటూ వినువీధిలోకి ఎగిరిపోయింది.
“మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి! “
అలా కాకుండా తన అదృష్టాన్ని చూసి విర్రవీగుతూ ఇతరులను చులకన చేయాలని చూస్తే మాత్రం భంగపాటు తప్పదు. తలెత్తుకుని తిరిగినచోటే, అవమానభారంతో తలదించుకోకా తప్పదు.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading