Menu Close

ఆహారాన్ని వృధాచేయకు అలా చేస్తే శ్రమించిన రైతు కష్టాన్ని, భూమాతను అవమానించినట్లే – Telugu Moral Stories


ఆహారాన్ని వృధాచేయకు అలా చేస్తే శ్రమించిన రైతు కష్టాన్ని, భూమాతను అవమానించినట్లే – Telugu Moral Stories

విజయవాడ, బంధువుల పెళ్లికని బయల్దేరాము. బాగా ఆకలి వేస్తే ఒకచోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక్కో ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తరువాత, బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరూ.. టిఫిన్ సగం తిని, సగం వదిలేసి మధ్యలోనే లేచి వెళ్లి చేతులు కడిగేసారు. మిగిలిపోయిన టిఫిన్ చూసి నా మనసు కలుక్కుమంది. ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా.. మొత్తం తింటారనుకున్నా, కానీ ఇలా వదిలేస్తారనుకోలేదు.

దారి మధ్యలో ఒక చోట పుచ్చకాయముక్కలు కోసి ఐస్ పైనపెట్టి ఒకప్లాస్టిక్ ప్లేటులో ఆ ముక్కలు ఉంచి, వాటిమీద ఉప్పు చల్లి అమ్ముతున్నారు. అవి తిందామని బతిమాలి కారు ఆపించారు. ఇక్కడా అదే తంతు. అందరూ తిన్నతరువాత మరో ప్లేటు ఆర్డర్ చేసి, సగం తిని సగం వదిలేసారు. ఈ సారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది. మరోసారి బాధపడి, నోరుచేసుకోకుండా ఊరుకున్నాను. వద్దని వారిస్తే పిసినారి పైసా పోనీయడు, తాను తినడు, తినేవారిని తిననీయడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను.

indian marriage food

పెళ్ళికి వెళ్ళాము. అక్కడ అంగరంగ వైభవంగా అలంకరించిన వేదిక. వచ్చి పోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడిపోతుంది. వేదికముందు కుర్చీలలో కూర్చున్నవారికి కూల్ డ్రింకులు అందిస్తున్నారు. కూల్ డ్రింక్ తాగిన వారిలో చాలా మంది సగం వదిలేశారు. షుగరు ఉన్నవారు కూడా ఎవరికీ తమ వ్యాధి తెలియకూడదని, కూల్ డ్రింక్ తీసుకున్నారు. కానీ త్రాగకుండా ప్రక్కన పెట్టారు.

చిన్న చిన్న నిర్ణయాలే జీవితాన్ని అందంగా మారుస్తాయి – Life Lessons in Telugu

మేము పెళ్ళి వారిని పలకరించి, భోజనాలవైపు బయలుదేరాము. ఎన్నిరకాల వంటకాలు పెట్టారో, లెక్కపెట్టడానికే పదినిమిషాలు పట్టింది. నాకైతే చూసాకే సగం కడుపు నిండిపోయింది. భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే కరువు ప్రాంతాలనుండి వచ్చిన వారిలాగా ఎగబడుతున్నారు.

జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు, తినలేదు, ఇప్పుడు తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంత ఇదిగా ఎగబడ్డారు.. ఎంత వడ్డించుకుంటున్నారో, ఎంత తింటున్నారో, ఎంత వదిలేస్తున్నారో వారికే తెలియడం లేదు. వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది. అక్కడ జరుగుతున్న తతంగమంతా గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి భోజనానికి వెళదామని పిలిచింది.

చేతిలో పళ్లెం దానినిండా పదార్థాలు. కలుపుకోవడానికి కూడా చోటులేదు. అది చూసి అన్నం తినబుద్దికాలేదు. నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని వారిని పురామయించి, ఓ పక్కన కూలబడిపోయాను. అక్కడినుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పల్లాలలలో వదిలేసిన భోజనాన్ని డేగిసలో నింపి గోడవతల విసిరేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను. నోరెళ్ళబెట్టి చూసారు, కానీ వారి ముఖంలో ఏ రకమైన అపరాధ భావనా కనిపించలేదు.

నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు, కాలికింద నేల కదిలిపోయినట్లు అనిపించింది. తిరుగుప్రయణంలో, నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగింది. ముభావంగా ఉండిపోయాను. ఏమైంది నాన్నా? అని పిల్లలిద్దరూ పిలిచేసరికి ఆలోచనల్లోంచి తేరుకుని, ఒక్కక్షణం ఆగి, జేబులోనుండి వందరూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను.

అకస్మాత్తుగా నేనలా చెప్పేసరికి విస్తుపోయి చూసింది. నేను కల్పించుకుని, నువ్వు విన్నది నిజమే వందరూపాయల నోటు బయటపడేయమన్నాను. మరోసారి చెప్పాను. ఎమ్మాట్లాడుతున్నారండి మీరు. భోజనాల దగ్గరనుండి చూస్తున్నాను. ముభావంగా ఉంటున్నారు. ఏమి మాట్లాడటంలేదు, ఏమైందని పలకరిస్తే, వందరూపాయలు బయటపాడేయమంటారా? గాలిగాని సోకిందా, దెయ్యంగానీ పట్టిందా? విసురుగా చూసి వంద రూపాయలు నా జేబులో కుక్కింది.

ఒకవంద రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు అంత కోపం వచ్చింది కదా….? పొద్దున్నుండి మీరు హోటల్లో టిఫిన్, పుచ్చకాయముక్కలు, పెళ్లిభోజనాల దగ్గరకూరలు వంటి మీరు వదిలేసిన వచ్చిన వాటి విలువ ఎంతో తెలుసా? మీ ముగ్గురివి కలిపి దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది తెలుసా? అంటే మీరు వేయి రూపాయలు బయటపడేసారు.

నేను వందరూపాయల నోటు విసిరేయడం పిచ్చయితే మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకుని, వదిలేయడం పిచ్చి కాదా? అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లు కాదా? వృధాగా పడేసే అన్నం ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది. మనం భోజనాన్ని వృధా చేయక పోతే ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క.

నేను ఆవేశంగా చెబుతున్నమాటల్ని అడ్డుకుంటూ …. మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ, అడిగింది మా అమ్మాయి. అవునమ్మా చిన్నచిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడతాయి. ఒక్కొక్కనీటిచుక్క కలిసి కుంభవృష్టి వర్షం అవుతుంది. వేల మైళ్ళ గమ్యమైన ఒక్కఅడుగుతోనే మొదలవుతుంది. చెప్పడం ఆపేసాను. అందరూ ఆలోచనల్లో పడిపోయారు. “మార్పు కి బీజం పడినట్లే……. ఎందుకంటే ఆలోచిస్తే మనం కూడా ఆ కోవకి వస్తామా అనిపిస్తుంది… ఇకనుండి నేను ఆహారాన్ని వృధాకానివ్వను …అని మనస్సులో నిర్ణయించుకున్నాను.. మరి మీరో..?

ఆకలి విలువ తెలిసినవారు, ఆహారాన్ని వృధాచేయరు. అలా చేస్తే ఆరుగాలం శ్రమించిన రైతు కష్టాన్ని, భూమాతను అవమానించినట్లే గొప్పల కోసం, స్థాయిని, స్టేటస్ చూపించుకోవడం కోసం వందల రకాలు వండి వార్చి వృధాచేయకండి. కనీసం ఆ ఖర్చుతో వందల మంది అనాధల, పేదల, అన్నార్తుల కడుపులు నింపవచ్చు.

వారు తృప్తిగా తిని చేసిన ఆశీర్వచనమే మన పిల్లలకు శ్రీరామరక్ష. మిగిలితే వృద్దాశ్రమాలకూ, అనాధ శరణాలయాలకూ పంచండి. లేకుంటే ప్యాకెట్లు చేసి రోడ్డు ప్రక్క అన్నార్తులకు పంచండి. మారండి. తమను తాము ఈ విషయంలో మార్చుకునే ప్రయత్నం చేసిన వారికి సహాకరించండి.

ఎమోషనల్ స్టోరీ – తండ్రి, కొడుకుల కథ – Father and Son Emotional Story in Telugu

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading