Menu Close

అహంకారం అవమానాన్ని తెచ్చి పెడుతుంది – Telugu Stories

అహంకారం అవమానాన్ని తెచ్చి పెడుతుంది – Telugu Stories

ఒక ఊళ్ళో భద్రయ్య అనేవాడు హస్త సాముద్రికంలో చాలా గట్టివాడు. ఆ చుట్టు పక్కల గ్రామాలలో భద్రయ్యకు చెయ్యి చూపించనివాడు లేడు. అతను చెయ్యి చూసి మనిషి మనస్తత్వం ఎటువంటిదైనదీ, ఆ మనిషికి లోగడ ఏమేమి జరిగినదీ, ముందు ఏమి జరగబోయేదీ చూసినట్టు చెప్పేవాడు.

హస్తసాముద్రికం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు భద్రయ్య పేరు ప్రతిష్ఠలు విని, అతనికి వెరచి, అతనుండే గ్రామం చాయలకు వెళ్ళేవారు కారు. ఎవరన్నా పొరపాటున వస్తే భద్రయ్య వాళ్ళను పదిమందిలోనూ పరీక్షకు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు తాగించి మరీ గ్రామం నుంచి బయిటికి పంపేవాడు.

భద్రయ్య సంగతి తెలియక రామశాస్ర్తి అనేవాడు చేతులు చూసి ప్రశ్నలు చెబుతానంటూ ఆ గ్రామానికి వచ్చాడు. రామశాస్ర్తి ఊళ్ళోకి వచ్చేసరికి గ్రామచావిడి వద్ద భద్రయ్య నలుగురితోపాటు చేరి లోకాభిరామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. రామశాస్ర్తి కూడా చేతులు చూసేవాడని తెలియగానే భద్రయ్య, ‘‘ఏమయ్యా, నువ్వు ఏయే గ్రంథాలు చదివావు? నీ గురువు గారెవరు? హస్తసాముద్రికంలో ఏయే విభాగాలు నీకు తెలుసు? అసలు నీదేవూరు?” అని ప్రశ్నలు వేశాడు.

‘‘అయ్యా, నేను హస్తసాముద్రిక శాస్ర్తం చాలా కొద్దిగా చదివాను. నాకు తెలిసినది బహుకొద్ది. తెలిసినంత వరకే ప్రశ్నలు చెప్పి పొట్టపోసుకుంటున్నాను. ఇక ఊరా? పుట్టి పెరిగిన ఊరు ఏనాడో వదిలేశాను. ఎక్కడ పొట్టగడిస్తే, అదే నా ఊరు,” అన్నాడు రామశాస్ర్తి అణకువగా. అతని అణకువ చూసి భద్రయ్య రెచ్చిపోయి, ‘‘నీ మిడిమిడి జ్ఞానం చూసి ఈ వూళ్ళోవాళ్ళు డబ్బులిచ్చేటంత వెర్రివాళ్ళు కారయ్యా! నా సంగతి నువ్వు వినలేదు కాబోలు.

హస్తసాముద్రికంలో అందెవేసిన చెయ్యిని నేనుండగా నీకు ఈ ఊళ్ళో మంచి నీరు కూడా పుట్టదు. అందుచేత మరోవూరు చూసుకో!” అని నిష్ఠురంగా అన్నాడు. అది విని రామశాస్ర్తికి కోపం వచ్చింది. ఈ భద్రయ్య అహంకారాన్ని అణచకుండా వెళ్ళగూడ దనుకుని అతను, ‘‘అయ్యా, ఎవరెంతటి వారు! నేను మీ కన్న గొప్పవాణ్ణి ప్రగల్భాలు పలకలేదు.

కాని మీరు ఏ ఆధారమూ లేకుండానే నన్ను తీసిపారేశారు. తరతమ భేదాలు నిర్ణయమయ్యేది పరీక్షలో గదా? మీకు నాకన్న ఎక్కువ తెలిసినట్టు ఏ ఆధారం మీద చెబుతున్నారు?” అని అడిగాడు. అక్కడ చేరినవారు రామశాస్ర్తి చెప్పినది సబబేననీ, ఇద్దరూ ఎరగని మనిషి చెయ్యి చూసి ఆ మనిషిని గురించి చెబితే, ఎవరు చెప్పినది సరిగా ఉన్నదీ తెలిసిపోతుందనీ అన్నారు.

*వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అటుగా ఒక పొరుగూరి మోతుబరి వచ్చాడు. గ్రామచావడి వద్ద చేరినవాళ్ళు ఆయనను పిలిచి, ‘‘అయ్యా, ఒక చిన్న పరీక్ష జరుగుతున్నది. మీరు ఒక్క క్షణం ఇలా వచ్చి, వీరిద్దరికీ మీ చెయ్యి చూపండి,” అన్నారు.

*పొరుగూరి మోతుబరి దగ్గరికి వచ్చి చెయ్యి చాచాడు. భద్రయ్య అతని చెయ్యి చూసి, ‘‘అయ్యా, ఇది పరీక్ష కనక ఉన్న మాట చెప్పక తప్పదు. మీకు ధనం చాలా ఉన్నదిగాని, అంతకు మించిన లోభితనం కూడా ఉన్నది. మీ భార్య ఎలా చెబితే అలా నడుచుకుంటారు,” అన్నాడు.*

మోతుబరి మండిపడి, ‘‘అబద్ధాల కూతలతో నన్ను అవమానించటానికేనా పిలిచారు?” అన్నాడు. రామశాస్ర్తి అతనితో, ‘‘ఆగ్రహించకండి. కొందరు హస్తసాముద్రికమంతా తమకే తెలుసుననుకుంటారు. మీ చెయ్యి నన్ను కూడా చూడనివ్వండి…, ఈ చెయ్యి లక్ష్మీ పుత్రుడిది. ఈ రేఖలు గొప్ప ఉదారస్వభావాన్ని సూచిస్తున్నాయి. ఎంతటివారైనా ఈ వ్యక్తి ముందు పిల్లుల్లాగా అయిపోతారు.

పూర్వజన్మ సుకృతం వల్ల భార్య చాలా అనుకూలవతి!” అన్నాడు. ఈ మాటలకు మోతుబరి చెప్పలేనంతగా పొంగిపోయి, ‘‘శబాష్‌! నా సంగతంతా దగ్గిరుండి చూసినట్టు చెప్పావు. చెయ్యి చూసి చెబితే అలా చెప్పాలి గాని, ఈ రెండో ఆయనలా పుల్లవిరుపుగా మాట్టాడితే ఎలా,” అన్నాడు. రామశాస్ర్తి ఆయన చేతిలోకి చూస్తూ, ‘‘మీరు నా శాస్ర్తజ్ఞానాన్ని మెచ్చుకుని నాకు ఉంగరం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు.

మీ దాతృత్వం జగమెరిగినది గదా,” అన్నాడు. ఈ మాటతో మోతుబరి కొయ్యబారిపోయాడు. రామశాస్ర్తి అది చూసి, ‘‘కొంపతీసి తప్పు చెప్పానా ఏమిటి? ఎందుకు అలా చూస్తున్నారు?” అని అడిగాడు. మోతుబరి తమాయించుకుని, ‘‘అబ్బే, మరేమీ లేదు. నా మనసులో మాట కూడా ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది,” అని తన వేలిన ఉన్న ఖరీదైన ఉంగరం తీసి రామశాస్ర్తికి ఇచ్చి, తన దారిన తాను వెళ్ళిపోయాడు.

అందరూ రామశాస్ర్తిని రకరకాలుగా పొగడి, అతను పరీక్షలో గెలిచినట్టు అంగీకరించారు. భద్రయ్య ముఖం ముడుచుకుపోయింది. రామశాస్ర్తి వారితో, ‘‘నిజానికి ఈ భద్రయ్యగారు హస్తసాముద్రికంలో చాలా గట్టివాడే. కాని అదే వృత్తిగా గల నాబోటి వాడికి శాస్ర్తజ్ఞానం చాలదు. సమయస్ఫూర్తి కూడా ఉండాలి. జ్ఞానానికి లౌక్యం తోడు కాకపోతే అర్థంలేని అహంకారం పెరుగుతుంది. అహంకారం అవమానం తెచ్చి పెట్టుతుంది,” అన్నాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images